
నేరం బాలీవుడ్‌దే..
తమిళ సినీపరిశ్రమకు తాను దూరంగా ఉండటంలో నేరం తనది కాదని, తనను బిజీగా మార్చేసిన బాలీవుడ్‌దేనని అంటున్నాడు ప్రభుదేవా.
తమిళ సినీపరిశ్రమకు తాను దూరంగా ఉండటంలో నేరం తనది కాదని, తనను బిజీగా మార్చేసిన బాలీవుడ్‌దేనని అంటున్నాడు ప్రభుదేవా. ప్రస్తుతం అజయ్ దేవ్‌గణ్ హీరోగా ‘యాక్షన్ జాక్సన్’ రూపకల్పనలో తలమునకలుగా ఉన్నాడు. త్వరలోనే ఒక తమిళ సినిమాకు దర్శకత్వం వహిస్తానని చెబుతున్నాడు.
విలన్ పాత్రల్లో ఇంప్రూవ్‌మెంట్..
ఇదివరకటితో పోల్చుకుంటే ఇప్పటి సినిమాల్లో విలన్ పాత్రలు బాగా ఇంప్రూవ్ అయ్యాయని నిన్నటితరం విలన్ ప్రేమ్ చోప్రా కితాబునిస్తున్నాడు. విలన్ పాత్రలను రచయితలు, దర్శకులు మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతున్నారని, విలన్‌లు అలా మారడానికి దారితీసిన నేపథ్యాన్ని శ్రద్ధగా రూపొందిస్తున్నారని ఈ మాజీ విలన్ ప్రశంసలు కురిపిస్తున్నాడు.
నసీరుద్దీన్ ఆత్మకథ..
విలక్షణ నటుడు నసీరుద్దీన్ షా ఆత్మకథ రాశాడు. ‘అండ్ దెన్ వన్ డే’ పేరిట ఈ పుస్తక రచనను అతడు పుష్కరం కిందటే మొదలు పెట్టాడు. ఇప్పుడది పూర్తయింది. ఇంకా విడుదల కాలేదు. తన ఆత్మకథ సినీపరిశ్రమలో కొందరికి ఇబ్బందికరంగా పరిణమించే అవకాశాలు ఉన్నాయని నసీరుద్దీన్ చెబుతున్నాడు. ఇప్పటికే తన ఆత్మకథను చదివిన శ్యామ్ బెనగళ్ తదితర ప్రముఖులు ప్రశంసలు కురిపించారన్నాడు.