
భారత్‌లో క్రికెట్ ఓ మతం లాంటిది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ ఆటను అభిమానిస్తారనడంలో సందేహం లేదు. అందుకే మనదేశంలో ఎన్ని క్రికెట్ లీగ్‌లు పుట్టుకొచ్చినా ఆదరణ మాత్రం తగ్గడం లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో మొదలుకాగా.. వివిధ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లు కూడా టీ20 ఫార్మాట్లో లీగ్‌లు నిర్వహిస్తున్నాయి.
టీ10 లీగ్
ఈ క్రమంలో గతేడాది టీ10 క్రికెట్ లీగ్ కూడా పురుడుపోసుకుంది. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) పేరిట టెన్నిస్ బాల్‌తో నిర్వహించే ఈ లీగ్ ద్వారా స్ట్రీట్ లెవల్ టాలెంట్‌ను కూడా వెలుగులోకి తీసుకురావడం ప్రధాన ఉద్దేశం. ఇక ఈ లీగ్‌లో ఈ ఏడాది కొత్త జట్టు చేరింది. అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ జట్టు ఐఎస్‌పీఎల్‌లో ప్రవేశించింది.
ఈ టీ10 లీగ్‌లో ఇది ఎనిమిదో ఫ్రాంఛైజీ. దీనిని బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ సొంతం చేసుకున్నాడు. కాగా ఈ లీగ్‌లో ఇప్పటికే మజీ ముంబై, టైగర్స్ ఆఫ్ కోల్‌కతా, శ్రీనగర్ కే వీర్, చెన్నై సింగమ్స్, బెంగళూరు స్ట్రైకర్స్, ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ పేరిట ఇప్పటికే ఆరు జట్లు ఉండగా.. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ న్యూ ఢిల్లీ ఫ్రాంఛైజీని కొనుగోలు చేశాడు.
బాలీవుడ్ తారలవే జట్లన్నీ
ఇక మజీ ముంబై ఫ్రాంఛైజీకి బాలీవుడ్ దిగ్గజం, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ యజమాని కాగా.. టైగర్స్ ఆఫ్ కోల్‌కతాకు సైఫ్ అలీ ఖాన్- కరీనా కపూర్ ఖాన్ దంపతులు, శ్రీనగర్ కే వీర్‌కు అక్షయ్ కుమార్, చెన్నై సింగమ్స్‌కు సూర్య, బెంగళూరు స్ట్రైకర్స్‌కు హృతిక్ రోషన్, ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్‌కు రామ్ చరణ్ ఓనర్లుగా ఉన్నారు. సినీ ప్రముఖులు యజమానులుగా ఉన్న ఈ లీగ్‌లో తాజాగా అజయ్ దేవ్‌గణ్ కూడా చేరడం విశేషం.
సచిన్ సంతోషం
కాగా ISPLలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కోర్ కమిటీ మెంబర్. ఈ టీ10 లీగ్ ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారని.. జట్ల సంఖ్య పెంచడం ద్వారా మరికొంత మందికి ఆడే అవకాశం దక్కుతుందని సంతోషం వ్యక్తం చేశాడు.
ఇక ఈ లీగ్ మూడో సీజన్ కోసం ఇప్పటికే నలభై లక్షలకు పైగా మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. దేశంలోని 101 పట్టణాల నుంచి రిజిస్ట్రేషన్లు రాగా.. వడపోత తర్వాత ఎంత మంది మిగిలి ఉంటారో చూడాల్సి ఉంది.
తొలి టైటిల్ ఎవరిదంటే..
ISPL తొలి సీజన్ ఫైనల్లో టైగర్స్ ఆఫ్ కోల్‌కతా మజీ ముంబైని ఓడించి అరంగేట్ర ఎడిషన్ చాంపియన్‌గా నిలిచింది. ఇక ఐఎస్‌పీఎల్-2025లో శ్రీనగర్ కే వీర్‌పై గెలుపొంది మజీ ముంబై టైటిల్‌ను ఎగురేసుకుపోయింది.
చదవండి: మౌనం వీడిన ఆర్సీబీ.. బిగ్ అప్‌డేట్.. పోస్ట్ వైరల్