అక్షయ్‌తో మహేశ్‌ పోరాటం లేనట్టే!

అక్షయ్‌తో మహేశ్‌ పోరాటం లేనట్టే!


'శ్రీమంతుడు' వంటి భారీ హిట్ తర్వాత వచ్చిన 'బ్రహ్మోత్సవం' అట్టర్‌ ప్లాప్‌ కావడంతో మహేశ్‌ బాబు తన తదుపరి సినిమాపై పూర్తిగా దృష్టి పెట్టారు. 'గజనీ', స్టాలిన్‌ వంటి భారీ సినిమాలు తెరకెక్కించిన తమిళ అగ్ర దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌తో ద్విభాష చిత్రానికి మహేష్‌ ఇప్పుడు రెడీ అవుతున్నాడు. ఈ నెలాఖరులో లేదా జూలైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.దాదాపు 90 కోట్ల బడ్జెట్‌తో మహేశ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త బాగా హల్‌చల్ చేసింది. ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్‌కుమార్ నటిస్తారని కథనాలు వచ్చాయి. ఇప్పటికే అక్కీ రజనీకాంత్‌ ప్రతిష్టాత్మక సినిమా 'రోబో-2'లో విలన్‌గా నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మహేశ్‌ సినిమాలోనూ ఈ యాక్షన్‌ స్టార్‌ను విలన్‌గా తీసుకొనే అవకాశముందని కథనాలు వినిపించాయి. ఇటు టాలీవుడ్‌లోనూ, అటు కోలివుడ్‌లోనూ హల్‌చల్ చేసిన ఈ కథనాలపై తాజాగా దర్శకుడు మురుగదాస్ స్పందించాడు. తమ సినిమాలో అక్షయ్‌కుమార్‌ నటించడం లేదని క్లారిటీ ఇవ్వడంతో ఈ వదంతులకు ఫుట్‌స్టాప్‌ పడింది. కానీ అక్షయ్‌కుమార్‌ లేనప్పటికీ ఈ సినిమాలో మరో బాలీవుడ్‌ తార కనిపించే అవకాశం కనిపిస్తోంది. మహేశ్‌ సరసన పరిణీతచోప్రాను హీరోయిన్‌గా తీసుకొనే అవకాశమున్నట్టు వినిపిస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top