నిర్మాణంలోకి నిర్వాణ తొలి అడుగు

Niharika Konidela and Rahul New Movie Launch - Sakshi

రాహుల్‌ విజయ్, నిహారిక జంటగా ప్రణీత్‌ బ్రమనడపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం  రూపొందనుంది. నిర్వాణ సినిమాస్‌ పతాకంపై  సందీప్‌ ఎర్మారెడ్డి, సుజన్‌ ఎరబోలు, రామ్‌ నరేశ్‌ దండ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి వరుణ్‌ తేజ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నాగబాబు క్లాప్‌ ఇచ్చారు. శివాజీ రాజా గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రణీత్‌ మాట్లాడుతూ – ‘‘ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచి’ తర్వాత నా స్క్రిప్ట్‌ని నమ్మి అవకాశం ఇచ్చిన నిర్వాణ సినిమాస్‌కి, నిహారిక, రాహుల్‌ విజయ్‌కి చాలా థ్యాంక్స్‌.

ఫస్ట్‌ షెడ్యూల్‌ 25 నుంచి జూలై 20 వరకు జరుగుతుంది’’ అన్నారు. ‘‘మా నిర్వాణ సినిమాస్‌పై యూఎస్‌లో డిస్ట్రిబ్యూషన్‌ చేస్తుంటాం. ఈ సినిమాతో నిర్మాణంలో తొలి అడుగు వేశాం. రెండు వారాల్లో సినిమాను స్టార్ట్‌ చేస్తాం. ప్రణీత్‌ కథ చెప్పాక నిహారిక అయితే బావుంటుందని అనిపించింది. హీరో కోసం వెతుకుతుంటే విజయ్‌ గురించి తెలిసింది. శివాజీ రాజా కీలక పాత్ర పోషిస్తున్నారు’’ అన్నారు నిర్మాతలు. రాహుల్‌ విజయ్‌ మాట్లాడుతూ – ‘‘శేఖర్‌ కమ్ముల సినిమాలా ఉంటుంది. నిహారిక పక్కన నటించడం మంచి అవకాశంగా భావిస్తున్నాను.

నిర్మాణ సంస్థ చేస్తున్న ఈ తొలి ప్రయత్నం సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ప్రణీత్‌ నా ఫ్యామిలీ మెంబర్‌తో సమానం. తన ఫస్ట్‌ సినిమాలో యాక్ట్‌ చేయడం ఆనందంగా ఉంది. ఇందులో హీరో క్యారెక్టర్‌కి రాహుల్‌ పర్ఫెక్ట్‌గా సూట్‌ అవుతాడు. సినిమా కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు నిహారిక. ‘‘ప్రణీత్‌ చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. మంచి సినిమా అవుతుందని నమ్ముతున్నాను. విజయ్‌ మాస్టర్‌గారి అబ్బాయి, నా స్నేహితుడి కుమార్తె సినిమాలో యాక్ట్‌ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు శివాజీ రాజా. ఈ చిత్రానికి సంగీతం : మార్క్‌ కె రాబిన్, కెమెరా: హరి ప్రసాద్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top