
బామ్మ నన్ను కలిసినందుకు.. తనకంటే ఎక్కువగా నాకే ఆనందంగా ఉంది.
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తనను కలవాలని ఉందన్న ఓ బామ్మ కోరిక తీర్చారు. వివరాల్లోకి వెళ్తే.. రాజమండ్రికి చెందిన 106 ఏళ్ల రేలంగి సత్యవతి అనే బామ్మకు మహేష్ కుటుంబం అంటే చాలా ప్రేమ. కొంతకాలం కిందట మహేష్‌ను చూడాలనేది తన కోరిక అని ఆమె తెలిపారు. ఇది కాస్త మహేష్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆమెను తన మహర్షి సినిమా షూటింగ్ జరుగుతున్న చోటుకు పిలిపించుకున్న మహేశ్.. షూటింగ్‌కు కాసేపు విరామం ఇచ్చి ఆమెతో ముచ్చటించారు. ఎలా ఉన్నారని అప్యాయంగా పలకరించారు. ఆమె వేసిన కుశల ప్రశ్నలకు మహేశ్ నవ్వుతూ సమాధానం చెప్పారు. ఆ బామ్మతో పాటు ఆమె కుటుంబసభ్యులు కూడా మహేష్‌ను కలుసుకున్నారు.
ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్న మహేష్.. ‘ఏళ్లు గడుస్తున్నా కూడా నా మీద అభిమానం పెంచుకోవడం చూస్తుంటే ముచ్చటేస్తోంది. ముందు తరాల వారు కూడా నాపై ఇంత ప్రేమ చూపించడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. నా అభిమానుల చూపించే ప్రేమ నాకెప్పుడూ ఆనందాన్ని కలిగిస్తుంది.. కానీ ఈ 106 ఏళ్ల బామ్మ నాపై ప్రేమతో.. నన్ను ఆశీర్వదించడానికి రాజమండ్రి నుంచి ఇక్కడికి రావడం నా హృదయాన్ని తాకింది. బామ్మ నన్ను కలిసినందుకు.. తనకంటే ఎక్కువగా నాకే ఆనందంగా ఉంది. ఈ బామ్మను దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాన’ని పేర్కొన్నారు.
మా తాతకు కూడా మీరంటే ఇష్టం
మహేశ్ పోస్ట్‌పై ప్రముఖ నటుడు సుమంత్ ట్విటర్‌లో స్పందించారు. ‘పెద్దవారంత మిమ్మల్ని ఇష్టపడతారు. మా తాత(అక్కినేని నాగేశ్వరరావు)కు నేటి తరం నటుల్లో మీరంటే ఎంతో ఇష్టమ’ని సుమంత్ తెలిపారు.