కళాతపస్వికి ‘ఫాల్కే’ అవార్డు

కళాతపస్వికి ‘ఫాల్కే’  అవార్డు


రాష్ట్రపతి చేతుల మీదుగా 3న పురస్కారం ప్రదానం

విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను మైమరపించిన కె.విశ్వనాథ్‌

కథ, కథనం, సాంస్కృతిక అంశాలకు పెద్దపీట
ప్రముఖ దర్శకుడు, నటుడు కె.విశ్వనాథ్‌కు 2016వ సంవత్సరానికిగాను దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు దక్కింది. భారతీయ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అపారమైన సేవలు అందించిన వారికి భారత ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందిస్తోంది. ఫాల్కే అవార్డు కమిటీ సిఫారసులను కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ఆమోదించారు. మే 3న ఇక్కడి విజ్ఞాన్‌ భవన్‌లో భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ.. దాదాసాహెబ్‌ ఫాల్కే 48వ పురస్కారాన్ని విశ్వనాథ్‌కు అంద జేస్తారు. ఈ అవార్డు కింద స్వర్ణ కమలం, రూ.10 లక్షల నగదు, శాలువాతో సత్కరిస్తారు.శాస్త్రీయ, సంప్రదాయ కళలు, సంగీతం, నృత్యాన్ని తన సినిమాలతో అందిస్తూ భారత సినీ పరిశ్రమకు విశ్వనాథ్‌ మార్గదర్శిగా నిలిచారు. బలమైన కథ, మనోహరమైన కథనం, ప్రామాణికమైన సాంస్కృతిక అంశాలకు పేరొందిన దర్శకుడిగా ఆయన గుర్తింపు పొందారు. 1965 నుంచి ఇప్పటి వరకు 50 సినిమాలు రూపొందించారు. సామాజిక, మానవీయ అంశాలపై విభిన్న చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. 1930లో గుడివాడలో జన్మించిన ఆయన కళా ప్రేమికుడు. కళలు, సంగీతం, నృత్యం తదితర విభిన్న నేపథ్యాలతో సినిమాలు రూపొందించారు. 1992లోనే ఆయన భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.ఐదు జాతీయ అవార్డులు, 20 నంది అవార్డులు, 10 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఫిల్మ్‌ఫేర్‌ జీవిత సాఫల్య పురస్కారం కూడా దక్కింది. ‘స్వాతి ముత్యం’చిత్రం 59వ అకాడమి ఆవార్డుల్లో ఉత్తమ విదేశీ చిత్ర కేటగిరీలో భారత అధికార ఎంట్రీ చిత్రంగా నిలిచింది. సిరివెన్నెల, స్వాతిముత్యం, శంకరాభరణం తదితర చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. సాక్షి మీడియా గ్రూప్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల పరంపరలో భాగంగా 2016లో విశ్వనాథ్‌ను లైఫ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డుతో ఘనంగా సత్కరించింది. తనదైన శైలిలో ప్రేక్షకులను మైమరపించిన ఈ కళాతపస్వికి అరుదైన గౌరవం దక్కడం పట్ల పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.చంద్రబాబు శుభాకాంక్షలు

కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం దక్కడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. విశ్వ నాథ్‌కు ఈ అవార్డు వరించడంతో తెలుగువారి కీర్తి మరోసారి జాతీయ స్థాయిలో మార్మోగిం దని సంతోషం వ్యక్తం చేశారు. శంకరాభ రణం, శృతిలయలు, సిరివెన్నెల, సాగరసం గమం, స్వర్ణకమలం, తదితర ఎన్నో చిత్రా లను ఆయన అందించారని తెలిపారు. ఆ రోజుల్లోనే తెలుగు సినిమా ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యేలా రూపొందించిన ఘనత విశ్వనాథ్‌దేనని, ఆయన భావితరాలకు స్ఫూర్తి అని కొనియాడారు.      విశ్వనాథ్‌కు వైఎస్‌ జగన్‌ అభినందనలు..

ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు 2016 సంవత్సరానికి దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం ప్రకటించడం పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అత్యుత్తమ పురస్కారం అందుకున్న విశ్వనాథ్‌కు అభినందనలు తెలిపారు. ఆయనకు ఈ అవార్డు రావడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకే గర్వకారణమని కీర్తించారు. ఇది తెలుగు సినిమా రంగానికి దక్కిన గౌరవమని, తెలుగు చలన చిత్ర రంగంలో ఎన్నో మరచిపోలేని సినిమాలను విశ్వనాథ్‌ అందించారని జగన్‌ ఈ సందర్భంగా ప్రస్తుతించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top