
అతడిని ‘కంప్లీట్ యాక్టర్’ అని పిలుస్తారు. ‘లాలెట్టన్’ అని ప్రేమగా పిలుచుకుంటారు. ‘కేరళ అహం’ అని వ్యాఖ్యానిస్తారు. ‘దర్శకుల నటుడు’ అని శ్లాఘిస్తారు. మోహన్‌లాల్ మాధవన్ నాయర్ అతడిప్పటికి 400 వందల సినిమాలు. నలుదిశలకు చేరిన విజయాలు. అతడు పాత్రను గెలిపించే నటుడు. తాను ఓడని కళాకారుడు. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే... ఎప్పటికీ నటులలో ధ్రువతార.
మీకు ‘గాంధీ నగర్ రెండవ వీధి’ సినిమా గుర్తుందా? అందులో రాజేంద్ర ప్రసాద్ చెప్పే డైలాగ్– ‘మై అసలీ గూర్ఖా హూ... హై... హూ’ ... అది మోహన్‌లాల్ మలయాళంలో చేసిన పాత్ర. ఆ సినిమా ‘గాంధీ నగర్ సెకండ్ స్ట్రీట్’.
‘అల్లుడు గారు’ పెద్ద హిట్ అయ్యింది తెలుగులో. పెరోల్ మీద బయటకు వచ్చిన ఖైదీ అద్దె మొగుడుగా మారి సందడి సృష్టిస్తాడు. కాని ఆ సందడి వెనుక భయానకమైన విషాదం ఉంటుంది. అతడు త్వరలో ఉరిశిక్ష అనుభవించబోతున్నాడు. మోహన్‌బాబుకు లైఫ్ ఇచ్చిన ఆ వేషం మోహన్‌లాల్‌ది. సినిమా పేరు ‘చిత్రం’.
ఇటీవల చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ చేశారు. స్టయిలిష్ లుక్‌తో అభిమానులను అలరించారు. అది మలయాళంలో సూపర్‌హిట్ అయిన మోహన్‌లాల్ సినిమా– లూసిఫర్.
విదేశాలలో ఉన్న యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో విద్యార్థులకు మోహన్‌లాల్ సినిమాల క్లిపింగ్స్‌తో ఒక వీడియో చూపిస్తారు. ముఖంలో ఎన్ని ఎక్స్‌ప్రెషన్స్ చూపించవచ్చు... ఆ భావాన్ని కచ్చితంగా పలికించవచ్చు అనేది ఆ వీడియోలో ఉంటుంది. పెన్ను, పేపర్ తీసుకొని మొదట భావాలు రాసుకుంటే– అయోమయం, పరాభవం, తమకం, ఉత్సాహం, విసుగు, ఆరాటం, సహానుభూతి, విషాదం, ఆరాధన, సంతోషం, మౌనం, ఆందోళన, ఆశ్చర్యం, కుతూహలం... ఇలా ప్రతిపదానికి మోహన్‌లాల్ ముఖాన ఎక్స్‌ప్రెషన్ ఉంటుంది. మొత్తం ఎన్ని భావాలో తెలుసా? 27. ఇన్ని ఎక్స్‌ప్రెషన్స్‌ను పలికించగల నటులు వేళ్ల మీద లెక్కించగలిగినంత మందే ఉంటారు. వారిలో మోహన్‌లాల్ ముందు వరుసలో ఉంటాడు.
మోహన్‌లాల్‌ను దర్శకుల నటుడు అంటాడు మణిరత్నం. ఆయన దర్శకత్వంలో మోహన్‌లాల్ ‘ఇద్దరు’లో నటించాడు. అందులో ఆయన ఎం.జి.ఆర్ వేషం పోషించాడు. ‘మోహన్‌లాల్ సెట్ మీద ఉంటే దర్శకుడికి నటుడికి ఏం చెప్పాలనే టెన్షన్ ఉండదు. సీన్ ఎలా రాబట్టుకోవాలో చూసుకుంటే చాలు’ అంటాడు మణివణ్ణన్. ‘మోహన్‌లాల్ సెట్‌లో ఉంటే మీరు కెమెరా ఎటుపెట్టుకున్నా దిగుల్లేదు’ అంటాడు దర్శకుడు మురగదాస్. ‘మోహన్‌లాల్ ముందు నుంచి కూడా ఒకే హెయిల్ స్టయిల్... కేవలం మీసాన్నే కొద్దిగా మారుస్తాడు పాత్రను బట్టి. రూపం ఏదైనా తన బాడీ లాంగ్వేజ్‌తో పాత్రను నమ్మించగలడు... అదే ఆయనలోని మేజిక్’ అంటారు తోటి నటులు.
ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ‘గాండీవం’లో అక్కినేని, బాలకృష్ణ, రోజాల మీద పాట ఉంటుంది. ‘గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణగంటలే మోగనేల’... ఆ పాటలో హటాత్తుగా ప్రత్యక్షమవుతాడు మోహన్‌లాల్. ప్రియదర్శన్ తన క్లోజ్‌ఫ్రెండ్ కావడం వల్ల అలా అతిథిగా మెరిశాడు. అక్కినేనితో కలిసి మోహన్‌లాల్ వేసే స్టెప్స్ చూసే ప్రేక్షకులు నేటికీ ఎంజాయ్ చేస్తారు.
కొంతమంది హీరోలు చని పోయేవరకూ హీరోలగానే ఉండాలనుకుంటారు. తప్పులేదు. కాని కొంతమంది హీరోలు నటులుగా ఉండాలనుకుంటారు. మోహన్‌లాల్ రెండో రకం. అందుకే ‘జనతా గ్యారేజ్’ లో వయసు మళ్లిన క్యారెక్టర్‌లో కనిపించడానికి అంగీకరించాడు. తెలుగులో ఆయన నేరుగా చేసిన సినిమా ‘మనమంతా’. ఇందుకోసం తెలుగు నేర్చుకుని సొంతగా డబ్బింగ్ చెప్పాడు. ఇలా చేసే నటులు ఎందరు? సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ లో ఐదు, పదినిమిషాల్లో మెరిసే పాత్ర మోహన్‌లాల్ చేయడం ఆ సినిమాలో కేరింతలు పుట్టించింది. అదీ మోహన్‌లాల్.
విలన్లుగా చేసి హీరోలైన వారు మన దేశంలో చాలామంది ఉన్నారు. బాలీవుడ్‌లో శతృఘ్న సిన్హా ఉన్నాడు. తమిళంలో రజనీకాంత్ ఉన్నాడు. తెలుగులో చిరంజీవి, మోహన్‌బాబు ఉన్నారు. మలయాళంలో మోహన్‌లాల్!
బొద్దుగా ఉంటే మోహన్‌లాల్ కాలేజీ చదివే సమయానికి దట్టమైన కనుబొమలతో, లావు మీసాలతో అప్పటి కాలానికి వెండితెరకు పనికి వచ్చే విధంగా కనిపించేవాడు కాదు. కాని కాలేజీ రోజుల్లోనే విపరీతంగా నాటకాలు ఆడేవాడు. తర్వాతి కాలంలో పెద్ద దర్శకుడైన ప్రియదర్శన్ మోహన్‌లాల్‌కు కాలేజీమేట్. అందరికీ సినిమా పిచ్చి పట్టింది. కానీ ఎవరు అవకాశం ఇస్తారు? అయితే అప్పటికి మోహన్‌లాల్ తండ్రి కేరళలో ‘లా సెక్రెటరీ’గా పని చేసేవాడు. కాబట్టి తగినంత డబ్బు ఉండేది. దాంతో అందరం తలా కొంత వేసుకుని సినిమా తీద్దాం అని మోహన్‌లాల్ ప్రతిపాదించాడు. అలా మొదలైన సినిమాయే ‘తిరనోట్టం’ (1978). అయితే ఆ సినిమా ముగియడానికే చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. అయినా రిలీజ్ కాలేదు.
25 సంవత్సరాల తర్వాత రిలీజైంది. అయితే దర్శకుడు ఫాజిల్ కళ్లలో పడటంతో మోహన్‌లాల్ దశ తిరిగింది. ‘మంజిల్ విరింజ పూక్కళ్’ (1980) సినిమాలో ఫాజిల్ ఆయనకు విలన్ వేషం ఇచ్చాడు. ఆ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచి మోహన్‌లాల్ విలన్‌గా అవతరించాడు. సంవత్సరానికి 27 సినిమాల్లో విలన్‌గా నటించిన రికార్డు మోహన్‌లాల్‌కి ఉంది. 1984లో వచ్చిన ‘ఈవిడె తుడన్‌గున్ను’ సినిమాతో మోహన్‌లాల్ హీరోగా గుర్తింపు పొందాడు. 1986లో వచ్చిన ‘టి.పి.బాలగోపాలన్ ఎం.ఏ’ సినిమాతో మోహన్‌లాల్ కేరళ ఉత్తమ నటుడు అవార్డు తీసుకోవడంతో అతని జైత్రయాత్ర మొదలైంది.
మోహన్‌లాల్ తన కెరీర్‌లో భిన్నమైన పాత్రలు చేయడానికి వెనుకాడలేదు. ‘వానప్రస్థం’ (1999)లో ఆయన కథకళి ఆర్టిస్ట్‌గా పోషించిన పాత్ర చిరస్మరణీయం. విమర్శకులు అత్యంత మేలిమి నటనగా గుర్తించారు. ‘తన్మాత్ర’ సినిమా లో అలై్జమర్స్ పేషంట్‌గా, ‘వడక్కుమ్‌నదన్’లో బై పోలార్ డిజార్డర్ ఉన్న వ్యక్తిగా నటించాడు. ‘అహమ్’ (1992)లో ఓసీడీ పేషంట్‌గా, ‘కమలదళం’(1992)లో క్లాసికల్ డాన్సర్‌గా ప్రేక్షకుల మన్ననలు పొందాడు. ఇక మాస్‌ప్రేక్షకుల కోసం ‘మన్యం పులి’లాంటి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. మన్యం పులి వందకోట్ల రికార్డు స్థాపించి కేరళ ట్రేడ్‌లో సంచలనం రేపింది. ఇక మోహన్‌లాల్ నటించిన ‘దృశ్యం’ ఎన్ని భాషల్లో రీమేక్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇటీవల మోహన్‌లాల్ నటించిన ‘తుడరం’ సంచలన కలెక్షన్స్ సాధించింది. మోహన్‌లాల్ తాజా సినిమా ‘హృదయ
పూర్వం’ 30 కోట్లతో తీస్తే 80 కోట్లు రాబట్టింది.
మోహన్‌లాల్ యాక్షన్ ఎంతబాగా చేయగలడో కామెడీ అంత బాగా చేయగలడు. నృత్యాలు చేస్తాడు. అవసరమైతే ‘కాలాపానీ’ వంటి సినిమాలో బ్రిటిష్ పోలీసుల బూట్లు నాకే (నిజంగానే నాకాడు) భారత ఖైదీ పాత్ర కూడా చేయగలడు. అందుకే మోహన్‌లాల్ ఇంతకాలం ప్రేక్షకులకు ఆరాధ్యుడిగా ఉన్నాడు. ఇంత బిజీలో కూడా నాటకాలు వేయడం, కౌన్ బనేగా కరోడ్‌పతి మలయాళం వెర్షన్ చేయడం, గాయకుడు కాబట్టి పాటలు పాడటం, ఇంట్లో మొక్కలు పెంచడం... అన్నీ చేస్తుంటాడు. తన సమఉజ్జీ మమ్ముట్టితో అతను స్నేహంగా కొనసాగుతున్నాడు. మోహన్‌లాల్‌కు ‘పద్మభూషణ్’తోపాటు ఐదుసార్లు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. ఇంకా ఇతర అవార్డులు, గౌరవాలకు లెక్కే లేదు. ఇప్పుడు దాదాసాహెబ్ వచ్చింది. మోహన్‌లాల్ వంటి నటుణ్ణి వరించడం వల్ల అది ఇప్పుడు కొత్త కాంతులీనుతున్న వధువులా మారింది.
మోహన్‌లాల్‌కు శుభాకాంక్షలు.