పద్మశ్రీ’ నాది కాదు.. వారందరిదీ!

k viswanath honored padma shri sirivennela seetharama sastry - Sakshi

–  ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి

‘‘చెంబోలు సీతారామశాస్త్రిని ‘సిరివెన్నెల’ చిత్రంతో సిరివెన్నెల సీతారామశాస్త్రిని చేసి, సినీ రంగంలో జన్మనిచ్చి ప్రోత్సహించిన దర్శకులు కె. విశ్వనాథ్‌గారిని ఎప్పటికీ మర్చిపోలేను. నా ఈ అభ్యున్నతికి కారణం నాకు జన్మనిచ్చిన తల్లితండ్రులు, సినీ జన్మనిచ్చిన విశ్వనాథ్‌గారు, పెంచిపోషించిన సినిమా తల్లి, ఇన్నేళ్లు నా వెన్నంటి ఉండి కలసి ప్రయాణించిన నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు, గాయకులు, నా కుటుంబ సభ్యులు. అందుకే తెలుగులో సినీ గేయకవితా రచన విభాగానికి తొలిసారి వచ్చిన ఈ ‘పద్మశ్రీ’ అవార్డు నాది కాదు.. వారందరిదీ! అందుకే, ఇది నాకు అభినందన కాదు ఆశీర్వాద సభగా భావిస్తున్నా’’ అని సినీ గీత రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అన్నారు.

భారత ప్రభుత్వం సిరివెన్నెలకు ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించిన సందర్భంగా కళాత్మక చిత్రాల దర్శకుడు కె. విశ్వనాథ్‌ స్వగృహంలో ‘చిరువెన్నెలలో సిరిమల్లెలు’ పేరిట ఆత్మీయ అభినందన సభ జరిగింది. సీతారామశాస్త్రి దంపతులను, ఆయన మాతృమూర్తిని విశ్వనాథ్‌ కుటుంబం సాదరంగా సత్కరించింది. ఈ సందర్భంగా విశ్వనాథ్‌ మాట్లాడుతూ– ‘‘పద్మశ్రీ’ పురస్కారం రావడం ఆలస్యమైందా, ముందుగా వచ్చిందా లాంటి మాటలను అటుంచితే రావాల్సిన వ్యక్తికి రావడం ఆనందంగా ఉంది. స్వయంకృషి, సాధనతో ఈ స్థాయికి ఎదిగిన సీతారామశాస్త్రి తన మొదటి చిత్రం ‘సిరివెన్నెల’ రోజులలానే ఇప్పటికీ నిగర్వంగా ఉండటం విశేషం. సాహితీ మానస పుత్రుడైన శాస్త్రి మరిన్ని ఉన్నతశిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదిస్తున్నా’’ అన్నారు.

విశ్వనాథ్, సీతారామశాస్త్రి కలయికలోని వివిధ చిత్రాల్లోని పాటలను గాయనీ గాయకులు ఉష, శశికళ, హరిణి, సాయిచరణ్‌ గానం చేశారు. వేణుగాన విద్వాంసుడు నాగరాజు, నటి, నాట్యకళాకారిణి ఆశ్రిత వేముగంటి, ‘సప్తపది’ ఫేమ్‌ సబిత కొన్ని పాటలకు తమ కళా ప్రదర్శనతో మరింత రక్తి కట్టించారు. సంగీత దర్శకుడు మణిశర్మ, నటుడు గుండు సుదర్శన్‌ పాల్గొన్నారు. దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, దశరథ్, వీఎన్‌ ఆదిత్య, ఇంద్రగంటి, కాశీ విశ్వనాథ్, బీవీఎస్‌ రవి, రచయితలు జనార్దన మహర్షి, రామజోగయ్య శాస్త్రి, బుర్రా సాయిమాధవ్, అబ్బూరి రవి, నిర్మాతలు రాజ్‌ కందుకూరి, ఏడిద శ్రీరామ్, నటుడు జిత్‌మోహన్‌ మిత్రా, ‘మా’ శర్మ, యాంకర్‌ ఝాన్సీ తదితరులు ‘సిరివెన్నెల’తో తమ అనుభవాలను పంచుకున్నారు.
∙సిరివెన్నెల, పద్మ, విశ్వనాథ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top