నా ప్రేమకథ అలా మరుగున పడిపోయింది - గోపీచంద్ మలినేని

నా ప్రేమకథ అలా మరుగున పడిపోయింది - గోపీచంద్ మలినేని

ఆరోజు ‘స్టాలిన్’ సినిమా షూటింగ్‌లో దర్శకులు మురుగదాస్‌గారు చాలా మూడీగా కనిపించారు. నేనా సినిమాకి అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేశాను. విషయం తెలుసుకుందామని ఆయన దగ్గరకు వెళితే, ఏడుస్తూ కనిపించారు. సీన్ అనుకున్న విధంగా రావడంలేదన్నారు. ఆ రోజు నేనో నిర్ణయం తీసుకున్నా. ఇంత సిన్సియర్‌గా ఉంటేనే మంచి సినిమా వస్తుందని ఫిక్స్ అయిపోయాను. అందుకే చాలా సిన్సియర్‌గా వర్క్ చేస్తాను. సినిమాతో ఎమోషనల్ ఎటాచ్‌మెంట్ పెంచుకున్నాను కాబట్టే.. ఎప్పుడైనా సీన్ సరిగ్గా లేకపోతే, పక్కకెళ్లి కన్నీళ్లు పెట్టేసుకుంటాను’’ అన్నారు గోపీచంద్ మలినేని. 

 

 ఈవీవీ సత్యనారాయణ, వీవీ వినాయక్, శ్రీను వైట్ల తదితరుల దగ్గర దర్శకత్వ శాఖలో చేసి, ‘డాన్ శీను’ ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు గోపీచంద్. తొలి సినిమాతోనే తనలో మంచి మాస్ డెరైక్టర్ ఉన్న విషయాన్ని నిరూపించుకున్నారు. ఆ తర్వాత బాడీగార్డ్, తాజాగా బలుపుతో సక్సెస్‌ఫుల్ డెరైక్టర్ల జాబితాలోకి చేరిపోయారాయన. ప్రస్తుతం గోపీచంద్ మోస్ట్ వాంటెడ్ డెరైక్టర్. ‘దిల్’ రాజు బేనర్లో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా, పరుచూరి ప్రసాద్ బేనర్లో ఓ అగ్రహీరోతో మరో సినిమా చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం గోపీచంద్ పాత్రికేయులతో మాట్లాడుతూ - ‘‘‘డాన్ శీను’ తర్వాత రవితేజతో చేసిన రెండో సినిమా ‘బలుపు’. 

 

 అందరికీ ఓ మంచి విజయం అవసరం. పైగా నాకు దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన నా తొలి హీరో రవితేజకు మరో హిట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. టీమ్ వర్క్‌తో ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు నచ్చేలా తీయగలిగాను. రవితేజ కెరీర్‌లో ‘బలుపు’ పెద్ద హిట్ నిలిచినందుకు ఆనందంగా ఉంది. వరుసగా మూడు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, ప్రేక్షకులు నా నుంచి సక్సెస్‌ఫుల్ ఫిల్మ్‌ని ఎదురుచూస్తారు. అందుకే గత మూడు చిత్రాలకన్నా తదుపరి చిత్రాలకు ఇంకా ఎక్కువ కష్టపడాలనుకుంటున్నా’’ అన్నారు.

 

 హిందీలో అవకాశాలు వచ్చినప్పటికీ తెలుగులో నిరూపించుకున్న తర్వాతే అని చెబుతూ - ‘‘‘డాన్ శీను’ని హిందీలో సైఫ్ అలీఖాన్, అక్షయ్‌కుమార్‌లతో తీయమని, టిప్స్ అధినేత ఆఫర్ ఇచ్చారు. ఆ తర్వాత ‘తను వెడ్స్ మను’ నిర్మాతలు షాహిద్‌కపూర్ హీరోగా ఓ హిందీ సినిమాకి ఆఫర్ ఇచ్చారు. కానీ ప్రస్తుతానికి నా ఫోకస్ తెలుగు సినిమాల పైనే ఉంది’’ అన్నారు గోపీచంద్. మురుగదాస్ కథ, స్క్రీన్‌ప్లే అందించే చిత్రానికి దర్శకత్వం వహిస్తానని, ప్రేక్షకులకు నచ్చే మాస్ కమర్షియల్ మూవీస్‌కే ప్రాధాన్యం ఇస్తానని గోపీచంద్ తెలిపారు. 

 

 ప్రేమకథా చిత్రాలకు  దర్శకత్వం వహించే ఆలోచన ఉందా? అనడిగితే - ‘‘వాస్తవానికి ఓ మంచి లవ్‌స్టోరీ ద్వారా దర్శకుణ్ణి కావాల్సింది. అయితే ‘ఏ మాయ చేశావె’ రావడంతో నా కథను పక్కన పెట్టేశాను. ఎందుకంటే నేను రాసుకున్న కథకి ఆ సినిమా దగ్గరగా ఉంది. గౌతమ్ మీనన్‌గారికి కూడా నాలానే ఆలోచనలు వచ్చాయేమో అలాంటి కథను రెడీ చేసుకున్నారు. ఏదైతేనేం.. నా ప్రేమకథ మరుగునపడిపోయింది’’ అని చెప్పారు గోపీచంద్.
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top