breaking news
E. V. V. Satyanarayana
-
జన్మంటూ ఉంటే స్విస్‌లో పుట్టాలి!
జీవితాన్ని బాగా ఇష్టపడతారు నటుడు అలీ. భూత, భవిష్యత్, వర్తమానాలపై ఆయనకు నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. దేన్నీ తేలిగ్గా తీసుకోరు. ఎదురైన ప్రతి అనుభవాన్నీ ప్రేమిస్తారు. కాసేపు మాట్లాడితే చాలు.. జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి.. ఇలా నాన్‌స్టాప్‌గా ఎన్నో విషయాలు చెబుతారు. ఆయన అభిరుచుల్ని తెలుసుకోవడానికి చేసిన చిరు ప్రయత్నం... వాళ్లిద్దరి సినిమాలూ పక్కన పెడితే నేను లేను! నా జీవితంపై అయిదుగురి ప్రభావం బలంగా ఉంది. వారు.. నా గురువుగారు శ్రీపాద జిత్‌మోహన్ మిత్రా, దర్శకులు కె. రాఘవేంద్రరావు, జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి. బాల్యంలోనే రాజమండ్రిలో కళాకారుడిగా నా ప్రయాణం మొదలైంది. అప్పుడు మా గురువు మిత్రాగారే అన్నీ తానై నన్ను నడిపించారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నో మిమిక్రీ ప్రోగ్రామ్‌లు చేశాను. ఇక, సినిమాల్లోకొచ్చాక... వెన్నంటి ఉండి నడిపించింది - రాఘవేంద్రరావుగారు. ఒక వ్యక్తిగా ఆయనను చూసి చాలా నేర్చుకున్నా. ఇక, జంధ్యాల గారి సినిమాల్లో నేను నటించింది తక్కువైనా, కమెడియన్‌గా నాపై అంతులేని ప్రభావాన్ని చూపించారాయన. ఇక ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి. వీళ్లిద్దరి సినిమాలను పక్కన పెట్టి అలీని చూస్తే ఏమీ కనిపించదు. దశాబ్దం పాటు నా వేలు పట్టుకొని నడిపించారు ఈవీవీ. నన్ను హీరోను చేసి కెరీర్‌ను పూర్తిగా మార్చేశారు కృష్ణారెడ్డి. ఈ అయిదుగుర్నీ జీవితంలో మర్చిపోలేను. మళ్లీ జన్మంటూ ఉంటే స్విస్‌లో పుట్టాలి! కళాకారుణ్ణి కావడం వల్ల, ముఖ్యంగా సినిమా నటుణ్ణి అవడం వల్ల.. ప్రపంచం మొత్తం తిరగగలిగాను. ఎన్ని దేశాలు తిరిగినా... ఓ అయిదు ప్రాంతాలు మాత్రం నా మనసులో అలా నిలిచిపోయాయి. అవే.. రాజమండ్రి, కేరళ, కన్యాకుమారి, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్. వీటిల్లో రాజమండ్రి నా జన్మస్థలం. నటుడిగా నేను ఓనమాలు దిద్దింది కూడా అక్కడే. సో... రాజమండ్రిని అభిమానించడంలో తప్పేం లేదు. ఇక కన్యాకుమారి విషయానికొస్తే... ‘సీతాకోక చిలుక’ సినిమా అక్కడే ఎక్కువ తీశారు. సినీ నటునిగా నా తొలి అడుగులు పడ్డవి అక్కడే. అందుకే కన్యాకుమారి ఓ తీపి జ్ఞాపకంగా నిలిచిపోయింది నాకు. న్యూజిలాండ్ అంటే ఇష్టపడడానికి కారణం... అక్కడ కాలుష్యం సున్నా. నేరాలు శూన్యం. ఎంత ఉండాలో అంతే ఉండే జన సాంద్రత. స్విట్జర్లాండ్ విషయానికొస్తే... ‘ఇక్కడేమైనా కర్ఫ్యూ పెట్టారా!’ అన్నట్లు ఉంటుంది. చాలా ప్రశాంత వాతావరణం. మనం కలలో కూడా చూడనన్ని అందమైన రంగులతో రకరకాల పూలమొక్కలు రోడ్డు పక్కనే దర్శనమిస్తుంటాయి. అంతేకాదు... ఏదైనా పని ఉంటే తప్ప జనం ఇళ్ల నుంచి బయటకు రారు. ‘మళ్లీ జన్మంటూ ఉంటే... స్విస్‌లోనే పుట్టాలి’ అనిపిస్తుంది అక్కడి వాతావరణం. చివరగా కేరళ. అక్కడ ఇంట్లో అయిదుగురు సభ్యులుంటే... నలుగురు పనిచేస్తారు. రాష్ట్రాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి వ్యక్తీ కష్టపడతాడు. ఇళ్ల ముందు ఆకులు రాలినా... వాటిని చిమ్మి, కుప్పగా పోసి, కిరోసిన్ పోసి తగులపెడతారు. నీట్‌గా ఉంటారు. నీతిగా ఉంటారు. అమ్మాయిలైతే అందంగా ఉంటారు. దాదాపు అందరూ చదువుకున్నవాళ్లే. నా జీవితం ఆధారంగా బోల్డన్ని పుస్తకాలు రాయొచ్చు! నేను పుస్తకాలు చదవను. అయినా... నా జీవితంలోనే కావాల్సినన్ని ఘట్టాలున్నాయి. వాటి ఆధారంగా బోల్డన్ని పుస్తకాలు రాయొచ్చు. తల్లిదండ్రుల దగ్గర పెరగాల్సిన వయసులో వాళ్లను వదులుకొని దూరంగా బతికాను. మా ఊరు కాని ఊరు మద్రాసులో, భాష కాని భాష మధ్య నాకంటూ నేపథ్యం కానీ, ఎవరి సహాయం, తోడు కానీ లేకుండా కొన్నేళ్ల పాటు జీవనం సాగించాను. ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. ఇది మామూలు విషయం కాదు. నాది మామూలు జన్మ కాదని నేను నమ్ముతాను. నా జీవితమనే పుస్తకాన్ని ఎప్పటికప్పుడు నెమరువేసుకోవడమే నాకు సరిపోతుంది. ఇక వేరే పుస్తకాలు చదివే టైమ్ ఎక్కడిది! - బుర్రా నరసింహ -
నా ప్రేమకథ అలా మరుగున పడిపోయింది - గోపీచంద్ మలినేని
ఆరోజు ‘స్టాలిన్’ సినిమా షూటింగ్లో దర్శకులు మురుగదాస్‌గారు చాలా మూడీగా కనిపించారు. నేనా సినిమాకి అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేశాను. విషయం తెలుసుకుందామని ఆయన దగ్గరకు వెళితే, ఏడుస్తూ కనిపించారు. సీన్ అనుకున్న విధంగా రావడంలేదన్నారు. ఆ రోజు నేనో నిర్ణయం తీసుకున్నా. ఇంత సిన్సియర్‌గా ఉంటేనే మంచి సినిమా వస్తుందని ఫిక్స్ అయిపోయాను. అందుకే చాలా సిన్సియర్‌గా వర్క్ చేస్తాను. సినిమాతో ఎమోషనల్ ఎటాచ్మెంట్ పెంచుకున్నాను కాబట్టే.. ఎప్పుడైనా సీన్ సరిగ్గా లేకపోతే, పక్కకెళ్లి కన్నీళ్లు పెట్టేసుకుంటాను’’ అన్నారు గోపీచంద్ మలినేని. ఈవీవీ సత్యనారాయణ, వీవీ వినాయక్, శ్రీను వైట్ల తదితరుల దగ్గర దర్శకత్వ శాఖలో చేసి, ‘డాన్ శీను’ ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు గోపీచంద్. తొలి సినిమాతోనే తనలో మంచి మాస్ డెరైక్టర్ ఉన్న విషయాన్ని నిరూపించుకున్నారు. ఆ తర్వాత బాడీగార్డ్, తాజాగా బలుపుతో సక్సెస్ఫుల్ డెరైక్టర్ల జాబితాలోకి చేరిపోయారాయన. ప్రస్తుతం గోపీచంద్ మోస్ట్ వాంటెడ్ డెరైక్టర్. ‘దిల్’ రాజు బేనర్లో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా, పరుచూరి ప్రసాద్ బేనర్లో ఓ అగ్రహీరోతో మరో సినిమా చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం గోపీచంద్ పాత్రికేయులతో మాట్లాడుతూ - ‘‘‘డాన్ శీను’ తర్వాత రవితేజతో చేసిన రెండో సినిమా ‘బలుపు’. అందరికీ ఓ మంచి విజయం అవసరం. పైగా నాకు దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన నా తొలి హీరో రవితేజకు మరో హిట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. టీమ్ వర్క్‌తో ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు నచ్చేలా తీయగలిగాను. రవితేజ కెరీర్లో ‘బలుపు’ పెద్ద హిట్ నిలిచినందుకు ఆనందంగా ఉంది. వరుసగా మూడు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, ప్రేక్షకులు నా నుంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్‌ని ఎదురుచూస్తారు. అందుకే గత మూడు చిత్రాలకన్నా తదుపరి చిత్రాలకు ఇంకా ఎక్కువ కష్టపడాలనుకుంటున్నా’’ అన్నారు. హిందీలో అవకాశాలు వచ్చినప్పటికీ తెలుగులో నిరూపించుకున్న తర్వాతే అని చెబుతూ - ‘‘‘డాన్ శీను’ని హిందీలో సైఫ్ అలీఖాన్, అక్షయ్‌కుమార్‌లతో తీయమని, టిప్స్ అధినేత ఆఫర్ ఇచ్చారు. ఆ తర్వాత ‘తను వెడ్స్ మను’ నిర్మాతలు షాహిద్‌కపూర్ హీరోగా ఓ హిందీ సినిమాకి ఆఫర్ ఇచ్చారు. కానీ ప్రస్తుతానికి నా ఫోకస్ తెలుగు సినిమాల పైనే ఉంది’’ అన్నారు గోపీచంద్. మురుగదాస్ కథ, స్క్రీన్‌ప్లే అందించే చిత్రానికి దర్శకత్వం వహిస్తానని, ప్రేక్షకులకు నచ్చే మాస్ కమర్షియల్ మూవీస్‌కే ప్రాధాన్యం ఇస్తానని గోపీచంద్ తెలిపారు. ప్రేమకథా చిత్రాలకు దర్శకత్వం వహించే ఆలోచన ఉందా? అనడిగితే - ‘‘వాస్తవానికి ఓ మంచి లవ్‌స్టోరీ ద్వారా దర్శకుణ్ణి కావాల్సింది. అయితే ‘ఏ మాయ చేశావె’ రావడంతో నా కథను పక్కన పెట్టేశాను. ఎందుకంటే నేను రాసుకున్న కథకి ఆ సినిమా దగ్గరగా ఉంది. గౌతమ్ మీనన్‌గారికి కూడా నాలానే ఆలోచనలు వచ్చాయేమో అలాంటి కథను రెడీ చేసుకున్నారు. ఏదైతేనేం.. నా ప్రేమకథ మరుగునపడిపోయింది’’ అని చెప్పారు గోపీచంద్.