అమితాబ్‌కు మనోడి గాత్రం

Dubbing Artist Shankar Gives Voice To Amitabh bachchan in Sye raa - Sakshi

డబ్బింగ్‌ కళలో ప్రతిభావంతుడు  

‘సైరా’లో అమితాబ్‌కు గళ దానం

ఆయన పాత్రకు ప్రాణమయ్యాడు.. వెండితెరపై మాటల తూటాలు పేల్చాడు.. ప్రేక్షకుల మది దోచాడు. ఆయనే డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శంకర్‌. కొత్తగూడెం పట్టణానికి చెందిన ఈయన డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలోని బౌద్ధనగర్‌లో నివాసముంటున్న శంకర్‌ ఇప్పటి వరకు 300 సినిమాలు, 70 టీవీ సీరియల్స్‌కు గాత్రం అందించాడు. ఇటీవల విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ పాత్రకు తెలుగులో డబ్బింగ్‌ చెప్పి అందరి మన్ననలు అందుకున్నాడు. అయ్యారే చిత్రంతో ప్రస్థానం ప్రారంభించిన శంకర్‌... రేసుగుర్రం, ఎవడు, పద్మావతి, మణికర్ణిక, ఖైదీ నంబర్‌ 150 తదితర చిత్రాలతో ఫేమస్‌ అయ్యాడు. మమ్ముట్టి, సుమన్, అర్జున్, భానుచందర్, ప్రదీప్‌రావత్, నాజర్‌ తదితరులకు డబ్బింగ్‌ చెప్పాడు.   

నాడు క్షీర సాగర మథనం సందర్భంగా వెలువడిన గరళాన్ని శంకరుడు తన కంఠంలో ఉంచుకుని లోకానికి మేలు చేశాడు. నేడు డబ్బింగ్‌ కళా సాగర మథనంలో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ గళాన్ని తన కంఠంతో పలికించాడు ఈనాటి మన శంకరుడు. ఇటీవల విడుదలై విజయ ఢంకా మోగిస్తున్న ‘సైరా’ నరసింహారెడ్డి సినిమాలో బిగ్‌ బీకి తెలుగులో డబ్బింగ్‌ చెప్పి అదరహో అనిపించాడు రేణికుంట్ల శంకర్‌కుమార్‌. డబ్బింగ్‌ కళాకారుడిగానే కాకుండా సినిమాలు, టీవీ సీరియళ్లు, వ్యాపార ప్రకటనలు, ప్రోమోలు, నేషనల్‌ జియోగ్రఫీ, డిస్కవరీ టీవీ చానెళ్లతో పాటు ప్రభుత్వ పథకాల ప్రకటనలకు వాయిస్‌ ఓవర్‌ చెబుతూ ప్రతిభ చాటుతున్నాడు ఈ గళజీవి. ఓయూ సమీపంలోని బౌద్ధనగర్‌లో సాధారణ జీవితం గడుపుతున్న కంచుకంఠం శంకర్‌కుమార్‌ ‘కళా’త్మక ప్రస్థానంపై ప్రత్యేక కథనం.  
– ఉస్మానియా యూనివర్సిటీ

ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణం 7వ ఇంక్లెయిన్‌కు చెందిన సింగరేణి ఉద్యోగి రేణికుంట్ల మదనయ్య, రాంబాయి దంపతుల కుమారుడు శంకర్‌. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తిలోని ఓయూ అనుబంధంగా ఉన్న సాయికృష్ణ కాలేజీలో ఎంబీఏ పూర్తి చేశాడు. తొలుత ప్రవేటు ఇన్సూరెన్స్, బ్యాంకుల్లో పని చేశాడు. ఆ తర్వాత సొంత వ్యాపారం ప్రారంభించాడు. కొంత కాలం తర్వాత వ్యాపారంలో నష్టం రావడంతో మానేసి డబ్బింగ్‌ వైపు ఆసక్తి పెంచుకున్నాడు. గత పదేళ్లలో 300 సినిమాలు, 70 టీవీ సీరియళ్లకు డబ్బింగ్‌ చెప్పాడు. ఇటీవల  విడుదలైన చిరంజీవి సినిమా ‘సైరా నరసింహరెడ్డి’లో అమితాబ్‌బచ్చన్‌కు తెలుగులో డబ్బింగ్‌ చెప్పి తన ప్రతిభను చాటుకున్నాడు. అమితాబ్‌కు డబ్బింగ్‌ చెప్పడం తొలుత ఎంతో భయమేసిందని, సినిమా పూర్తయిన తర్వాత బంధువులు, స్నేహితులు అభినందించారని శంకర్‌ ఈ సందర్భంగా సంతోషం వెలిబుచ్చాడు.  

తొలి సినిమా ‘అయ్యారే’
రాజేంద్రప్రసాద్‌ నటించిన ‘అయ్యారే’ చిత్రంలో శంకర్‌ తొలిసారిగా డబ్బింగ్‌ చెప్పారు.  రేసుగుర్రం, గౌతంనందా, విన్నర్, నాయక్, ఇంటెలిజెంట్, కురుక్షేత్రం, పద్మావతి, మణికర్ణిక, సత్య–2, జక్వార్, తుఫాన్, ఎవడు, ఖైదీనంబర్‌ 150 తదితర సినిమాల్లో డబ్బింగ్‌ చెప్పాడు. డబ్బింగ్‌ సేవలకు గుర్తింపుగా 2013లో మాటీవీ అవార్డును అందుకున్నాడు.

స్నేహితుల ప్రోత్సాహంతోనే..  
నీ వాయిస్‌ చాలా బాగుంటుంది. సినిమాలో ప్రయత్నించు అని శంకర్‌ స్నేహితులు, బంధువులు చెబుతుండేవారు. తనలోని టాలెంట్‌ను గుర్తించిన శంకర్‌కు డబ్బింగ్‌పై ఆసక్తి కలిగింది. ఈ క్రమంలోనే చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో జరిగిన ఓ కార్యక్రమం ఆయన జీవితాన్ని మలుపుతిప్పింది. ప్రఖ్యాత డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ ఆర్‌సీఎం రాజుతో పరిచయం ఏర్పడింది. ‘నీ వాయిస్‌ బాగుంది’ అని కితాబు ఇచ్చారు. డైరెక్టర్‌ కస్తూరి శ్రీనివాస్‌ వద్దకు పంపించారు. అప్పట్లో ఏపీ మూవీ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ యూనియన్‌ నిర్వహించిన ఆడిషన్స్‌లో 170 మంది పాల్గొన్నారు. శంకర్‌ 2వ స్థానంలో నిలిచాడు. ఇలా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న శంకర్‌కు తూర్పువెళ్లే రైలు టీవీ సీరియల్‌లో డబ్బింగ్‌ చెప్పే అవకాశం వచ్చింది. అదే ఆయన డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ జీవితానికి నాంది పలికింది.

పరకాయ ప్రవేశం చేస్తా..  
డబ్బింగ్‌ చెప్పాలంటే పరకాయ ప్రవేశం చేయాల్సి ఉంటుంది. నటుడి హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌ తదితర అంశాలను నిశితంగా పరిశీలించి డబ్బింగ్‌ చెబితేనే సక్సెస్‌ అవుతుంది.  డబ్బింగ్‌ చెబుతుంటె నటుడే మాట్లాడుతున్నట్లు ప్రేక్షకులకు భ్రమ కల్పించాలి. భాషపై పట్టు ఉండాలి. జీవంలేని బొమ్మకు ప్రాణం పోసే ప్రక్రియే డబ్బింగ్‌. నటనపై నాకు ఆసక్తి లేదు.  – శంకర్‌కుమార్‌  

Election 2024

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top