పుట్టినింటి తెరపై... సుస్మితా సేన్ | Doing Bengali film is like homecoming, says Sushmita Sen | Sakshi
Sakshi News home page

పుట్టినింటి తెరపై... సుస్మితా సేన్

Jul 17 2014 1:14 AM | Updated on Sep 2 2017 10:23 AM

పుట్టినింటి తెరపై... సుస్మితా సేన్

పుట్టినింటి తెరపై... సుస్మితా సేన్

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ ఎట్టకేలకు ఇప్పుడు సొంత భాష, సొంత రాష్ట్రం వైపు దృష్టి పెట్టారు.

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ ఎట్టకేలకు ఇప్పుడు సొంత భాష, సొంత రాష్ట్రం వైపు దృష్టి పెట్టారు. అదేమిటంటారా? అవునండీ! ఇప్పటి దాకా ఇతర భాషా చిత్రాల్లోనే నటిస్తూ వచ్చిన ఆమె ఇన్నాళ్ళకు తొలిసారిగా తన మాతృభాష అయిన బెంగాలీలో వెండితెర మీద మెరవనున్నారు. ఈ వారంలో సెట్స్ మీదకు వెళుతున్న బెంగాలీ చిత్రం ‘నిర్బాక్’తో పుట్టింటికి వచ్చినట్లుగా ఉందని సుస్మితా సేన్ వ్యాఖ్యానించారు. ‘‘నా తొలి చిత్రం షూటింగ్ నిమిత్తం కోల్‌కతాకు వెళుతున్నాను. నాకెంతో ఉద్వేగంగా ఉంది. నా మూలాలు వెతుక్కుంటూ వెళుతున్నట్లుగా అనిపిస్తోంది’’ అని 38 ఏళ్ళ ఈ మాజీ మిస్ యూనివర్స్ మెరుస్తున్న కళ్ళతో చెప్పారు.

గతంలో బెంగాలీ సినీ అవకాశాలు వచ్చినప్పటికీ, భయపడి ఆగిపోయిన ఆమె ఇప్పుడు దాన్ని అధిగమించి, ఈ సినిమా ఒప్పుకున్నారు. ‘‘తెలుగు, తమిళం, ఇంకా ఇతర భాషల్లో నటించిన నేను బెంగాలీ అనగానే భయపడేదాన్ని. కానీ, ఇప్పుడు ఆ భయం వదిలించుకున్నాను. ఈ చిత్రంలో కొందరు అద్భుతమైన నటీనటులతో కలసి నటించనున్నాను’’ అని ఆమె చెప్పారు.

జాతీయ అవార్డు గ్రహీత సృజిత్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. అలాగే, ఐశ్వర్యారాయ్‌తో కలసి నటించనున్నట్లు చాలా కాలంగా వినిపిస్తున్న వార్తల గురించి కూడా సుస్మితా సేన్ వివరణ ఇచ్చారు. ‘‘ఓ స్క్రిప్టు గురించి మేమిద్దరం ఆలోచిస్తున్న మాట నిజం. అది ఎప్పుడు కార్యరూపం ధరిస్తుందన్నది మాత్రం నిర్మాత గౌరాంగ్ దోషీయే చెప్పాలి’’ అని ఈ అందాల నటి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement