ఆ సినిమాతో పోలిక లేదు

Director Thiru Byte On Chanakya Movie - Sakshi

‘‘మాది ఆంధ్ర–తమిళనాడు బోర్డర్‌లోని ఓ గ్రామం. మాకు చిత్తూరు కేవలం 29 కిలోమీటర్లు. దీంతో చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూస్తూ పెరిగాను. ముఖ్యంగా చిరంజీవిగారి సినిమాలు చాలా చూశాను’’ అని దర్శకుడు తిరు అన్నారు. గోపీచంద్, మెహరీన్‌ జంటగా తిరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చాణక్య’. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా తిరు మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్‌ శివ, నేను ఓ తమిళ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌గా చేశాం. శివ దర్శకత్వం వహించిన ‘శౌర్యం’ చిత్రం నుంచి గోపీగారితో నాకు పరిచయం ఉంది.

‘శౌర్యం’ టైమ్‌లోనే గోపీగారితో ఒక మంచి యాక్షన్‌ మూవీ చేయాలనుకున్నాను. ‘చాణక్య’ కథ ఆయనకు నచ్చడంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం స్క్రీన్‌ప్లే రాసుకోవడానికి ముందు కొన్ని గూఢచారి సంస్థలైన ‘ఐ ఎస్‌ఐ, సీఐఏ, రా’ వంటి వాటి గురించి బాగా చదివాను. స్పై ఏజెంట్స్‌ ఎలా ఉంటారు? వారి బాడీ లాంగ్వేజ్‌ ఏంటి? ఇలాంటి చాలా విషయాలపై పరిశోధన చేసి కథ రాసుకున్నా. ఓ రకంగా ఈ సినిమా చేయడానికి రవీంద్ర అనే ఒక స్పై నాకు స్ఫూర్తి. వాస్తవికతకు దగ్గరగా, వాణిజ్య అంశాలు మిస్‌ కాకుండా తెరకెక్కించాను.

రా ఏజెంట్‌ చూసినా సంతప్తి పడేలా ఈ చిత్రం ఉంటుంది. మా సినిమాని సల్మాన్‌ ఖాన్‌ ‘ఏక్తా టైగర్‌’ చిత్రంతో పోల్చుతున్నారు. నిజానికి ఇది కొత్త కథ, సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమా చివరి రోజు ఫైట్‌ సన్నివేశంలో గోపీగారికి పెద్ద గాయం అయినా చాలా ధైర్యంగా ఉన్నారు. నిర్మాతలు, నేను ఈ చిత్రం  విజయం పట్ల చాలా ఆశాభావంతో ఉన్నాం. తెలుగు, తమిళ భాషల్లో కొన్ని ఆఫర్స్‌ ఉన్నాయి. కానీ, ‘చాణక్య’ రిలీజ్‌ తర్వాత వాటి గురించి ఆలోచిస్తా’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top