దేనికైనా ఎమోషనే ముఖ్యం

Director Ramana Teja Emotional Speech at Ashwathama - Sakshi

‘‘మన దగ్గర థ్రిల్లర్‌ జానర్‌కి ఆడియన్స్‌ తక్కువ. మన ప్రేక్షకులకు ఎలివేషన్‌ కన్నా ఎమోషన్‌ ముఖ్యం. ఒక ఎమోషనల్‌ కథకు థ్రిల్లర్‌ అంశాలు జోడిస్తే అదే ‘అశ్వథ్థామ’ చిత్రం’’ అన్నారు దర్శకుడు రమణ తేజ. ఆయన దర్శకత్వంలో నాగశౌర్య, మెహరీన్‌ జంటగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. ఉషా మూల్పూరి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రమణ తేజ మాట్లాడుతూ – ‘‘మాది చిత్తూరులో మదనపల్లి. చిన్నప్పుడు చదువుకుంది మదనపల్లిలోనే.

మా ఫ్యామిలీలో అందరం ఎక్కువగా సినిమాలు చూసేవాళ్లం. నాన్నగారికి చిరంజీవిగారంటే విపరీతమైన అభిమానం. నన్ను ఎక్కువగా సినిమాలకు తీసుకెళ్లేవారు. చిన్నప్పుడు చదువుల్లో చాలా చురుకుగా ఉండేవాణ్ణి. తమిళనాడులో ఇంజనీరింగ్‌ చేశాను. కాలేజ్‌లో ఉన్నప్పుడే సినిమాల్లోకి వెళ్లాలని బలంగా కోరిక కలిగింది. కాలేజీ రోజుల్లో తీసిన ఓ షార్ట్‌ ఫిల్మ్‌కి స్క్రీన్‌ప్లే వీక్‌ అనే కామెంట్స్‌ వచ్చాయి. ఆ తర్వాత అమెరికాలో ఎంబీఏ చేయడానికి వెళ్తున్నాను అని ఇంట్లో చెప్పి వెళ్లి ఫిల్మ్‌ కోర్స్‌ చేశాను.

అక్కడ స్క్రీన్‌ రైటింగ్‌లో డిగ్రీ చేశాను. స్క్రీన్‌ ప్లే మీద అవగాహన సంపాదించాను. ‘టెడ్‌ 2’ అనే హాలీవుడ్‌ సినిమాకు అప్రెంటిస్‌గా వర్క్‌ చేశాను కూడా. తిరిగొచ్చాక ఓ సినీ ప్రమోషన్‌ కంపెనీలో వర్క్‌ చేస్తుండగా ‘ఛలో’ ప్రమోషన్స్‌లో నాగశౌర్య అన్న పరిచయమయ్యారు. అలా మా ప్రయాణం మొదలైంది. అప్పుడే శౌర్య అన్న ‘అశ్వథ్థామ’ కథ రాస్తున్నారు. అది పూర్తయ్యాక నువ్వే దర్శకుడిని అన్నారు. దర్శకుడిగా నాకు కావాల్సినంత ఫ్రీడమ్‌ ఇచ్చారు. శౌర్య అన్నయ్యతో ఈ ప్రయాణాన్ని మర్చిపోలేను’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top