పద్మావతికి భద్రత పెంపు

Deepika Padukone's security tightened after 'Rs 5-crore offer' to behead actress - Sakshi - Sakshi

సాక్షి,ముంబయి: వివాదాస్పద పద్మావతి మూవీ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న దీపికా పదుకోన్‌కు ముంబయి పోలీసులు భద్రత పెంచారు. రాజ్‌పుత్‌ కర్ణి సేన హెచ్చరికల నేపథ్యంలో ఆమెకు భద్రతను కట్టుదిట్టం చేశారు. పద్మావతి సినిమాను చరిత్రను వక్రీకరించేలా తెరకెక్కించారని, ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని రాజ్‌పుత్‌ సంఘాలతో పాటు హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. రాణీ పద్మినిగా పద్మావతిలో నటించిన దీపికా పదుకోన్‌కు నిరసనకారుల నుంచి తీవ్ర హెచ్చరికలు ఎదురయ్యాయి.

ఆమెను హతమార్చిన వారికి రూ 5 కోట్లు ఇస్తామని..దీపిక ముక్కు కోస్తామని ఆందోళనకారులు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో దీపిక నివాసం, ముంబయిలోని ఆమె కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీపిక ముక్కు కోస్తామని హిందూ గ్రూప్‌లు హెచ్చరించిన అనంతరం ముంబయి పోలీసులు ఆమెకు భద్రత పెంచారని నగర పోలీస్‌ జాయింట్‌ కమిషనర్‌ (శాంతిభద్రతలు) దెవెన్‌ భారతి చెప్పారు. మరోవైపు దీపిక ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే ఆమెపై భౌతిక దాడులకు దిగుతామని రాజ్‌పుట్‌ కర్ణి సేన నేత మహిపాల్‌ సింగ్‌ మాకర్ణ హెచ్చరించారు.

పద్మావతి మూవీని నిషేధించకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని పునరుద్ఘాటించారు. ఇక పద్మావతి డైరెక్టర్‌ సంజయ్‌ లీలా భన్సాలీ, దీపికా పదుకోన్‌ల తలనరికిన వారికి రూ 5 కోట్లు ఇస్తామని యూపీకి చెందిన చైతన్య సమాజ్‌ పేర్కొంది. సర్వ్‌ బ్రాహ్మణ మహాసభ కూడా పద్మావతిపై సీబీఎఫ్‌సీకి ఫిర్యాదు చేస్తామని ప్రకటించింది. ఇక పద్మావతి మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొస్తున్న డిసెంబర్‌ 1న రాజ్‌పుట్‌ కర్ణిసేన భారత్‌ బంద్‌కు పిలుపు ఇచ్చింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top