
హాస్య నటుడు గుండు సుదర్శన్
హాస్య నటుడు గుండు సుదర్శన్
పశ్చిమగోదావరి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): త్వరలోనే తాను ఒక చిత్రానికి దర్శకత్వం వహిస్తానని, ఇందుకు సంబంధించిన స్క్రిప్టు సిద్ధం చేసుకుంటున్నానని సినీ హాస్య నటుడు గుండు సుదర్శన్ తెలిపారు. సొంతపని మీద ఏలూరుకు వచ్చిన ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 1992లో తాను శ్రీనాథకవి సార్వభౌమ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టానని, ఐతే మొదటి చిత్రంగా మిస్టర్ పెళ్లాం విడుదలైందని వెల్లడించారు. తాను దర్శకత్వం వహించబోయే చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఉంటుందన్నారు.
అలాగే తాను ప్రధానపాత్రగా ఒక చిత్రాన్ని త్వరలోనే చేయబోతున్నానని, దానికి సంబంధించిన దర్శకుడు, నిర్మాత తదితర వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు. తాను నటించిన చిత్రం, అతడు, ఎలా చెప్పను, మల్లీశ్వరి చిత్రాల్లో పాత్రలు ప్రజాదరణ పొందాయన్నారు. దాదాపు 350 చిత్రాల్లో నటించినట్టు చెప్పారు. ప్రస్తుతం వస్తున్న హీరోలలో నాని, విజయ్ దేవరకొండ మంచి ట్యాలెంట్ కనిపిస్తోందన్నారు. తమన్నా డ్యాన్స్, అనుష్క నటన అంటే తనకు ప్రత్యేక అభిమానమన్నారు. అలాగే దర్శకుల్లో ఈవీవీ సత్యనారాయణ, త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్, శ్రీనువైట్ల తదితరులు తనకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. పరిశమ్రలో ప్రతిభకన్నా అవకాశమే గొప్పదని, ఎంతటి ప్రతిభావంతుడైనా అవకాశాలు లేకపోతే చేయగలిగిందేమీ ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మహేష్ బాబు చిత్రంతో పాటు మరో 10 చిత్రాల్లో నటిస్తున్నానని వెల్లడించారు.