
డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యానని చాలా మంది అంటుంటారు. కానీ నిజంగానే ఓ డాక్టర్ యాక్టర్‌గా మారితే.. అందులోనూ కమేడియన్‌గా ప్రేక్షకులను కడుపుబ్బా
నవ్విస్తే.. గొప్ప విషయమే కదా. ‘అల్లుడు గారు మామూలుగా లేరండీ..’, ‘అల్లుడు గారికి సరసం బాగా ఎక్కువండీ బాబూ..’ అంటూ మహానుభావుడు సినిమాలో జిడ్డేశ్ పాత్రలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న హాస్యనటుడు భద్రం. డాక్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, వృత్తిని కొనసాగిస్తూ ప్రవృత్తిలోనూ దూసుకుపోతున్న భద్రం... ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే...
రాజమండ్రిలో పుట్టి పెరిగాను. నాన్న గిరి యుగంధర్ నాయుడు కొన్ని చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా చేశారు. ఆ కోవలోనే నాకూ సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. అయితే నాన్న సలహా మేరకు కెరీర్‌లో స్థిరపడాలని బెంగుళూర్‌లో ఫిజియోథెర పీ పూర్తి చేశాను. ఎర్గొనోమిక్స్ డాక్టర్‌గా హైదరాబాద్‌లో ప్రస్థానం ప్రారంభించాను. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు వృత్తిరీత్యా వచ్చే సమస్యలు పరిష్కరిస్తూ ఫిజియోథెరపీ చేసేవాడిని.
‘పూరి’ పిలుపు... మలుపు
డాక్టర్‌గా రాణిస్తున్న తరుణంలో నా సన్నిహితుడి సలహా మేరకు నా ప్రతిభతో ‘లవ్ పెయిన్’ పేరుతో ఓ చిన్న వీడియో తీశాను. ఇది చాలామంది దర్శకులకు నచ్చింది. దర్శకుడు సుధీర్‌వర్మ సన్నిహితుడు ఫణి సహకారంతో ‘మ్యాంగో’ కంపెనీకి చేరువయ్యాను. ‘పెళ్లితో జరభద్రం’ పేరుతో షార్ట్‌ఫిల్మ్ తీశాం. ఇదే నా లైఫ్‌కి టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఈ వీడియో చూసిన దర్శకుడు పూరి జగన్నాథ్ తన ఫేస్‌బుక్‌లో దీనిని పోస్ట్ చేసి.. ‘ఇలాంటి టాలెంటెడ్ పీపుల్ పరిశ్రమకు అవసరం. నన్ను కలవండి’ అని రాశారు. ఇది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన.
‘జ్యోతిలక్ష్మి’తో స్టార్ట్..
పూరి జగన్నా«థ్ గారు చెప్పినట్టే ‘జ్యోతిలక్ష్మి’ చిత్రంలో బ్రోకర్ భద్రం పాత్రతో అవకాశమిచ్చారు. ఈ పాత్రకు మంచి స్పందన వచ్చింది. నేను చేసిన ‘పెళ్లితో జరభ్రదం’ షార్ట్‌ఫిల్మ్ వైరల్ అయి, దర్శకుడు మారుతి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. ‘భలేభలే మగాడివోయ్’ చిత్రంలో ఆయన అవకాశమిచ్చారు. అలాగే దర్శకుడు సతీష్ వేగేశ్న ‘శతమానం భవతి’ చిత్రంలో గుర్తుండిపోయే పాత్ర ఇచ్చారు. అలా లోఫర్, ఎక్కడికిపోతావు చిన్నవాడా, ప్రేమమ్, పండగచేస్కో, డిక్టేటర్, వైశాఖం, గల్ఫ్ తదితర చిత్రాలతో సుమారు 50 సినిమాల్లో నటించాను.
‘జిడ్డేశ్’.. హిట్
‘భలేభలే మగాడివోయ్’ తర్వాత నాకో టర్నింగ్ క్యారెక్టర్ ఇస్తానన్న డైరెక్టర్ మారుతి... ‘మహానుభావు డు’లో నాజర్‌కు సహాయకు డిగా జిడ్డేశ్ పాత్ర ఇచ్చారు. ఈ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల కు మరింత దగ్గరయ్యా ను. నిర్మాత సి.కళ్యాణ్.. నా ప్రతిభను గుర్తించి ఆయన తెరకెక్కిస్తున్న రెండు చిత్రాల్లో అవకాశమిచ్చారు.
దేవుడిచ్చిన వరం..
డాక్టర్‌గా వైద్యం అందిస్తూ, హాస్య నటుడిగా అందరినీ నవ్విస్తున్నాను. ఇది నాకు దేవుడిచ్చిన గొప్ప వరం. డాక్టర్‌గా, యాక్టర్‌గా జీవితం సాఫీగా సాగుతోంది. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూతుర్ని పెళ్లి చేసుకున్నాను. అలనాటి హాస్యనటుడు అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, అలీ నాకు స్ఫూర్తి.