మోహన్‌లాల్‌కు భారీ షాక్‌

Charge sheet filed against actor Mohanlal in elephant tusk case - Sakshi

ఏనుగుదంతాల కళాఖండం కేసులో చార్జిషీటు

మలయాళ సూపర్ స్టార్  మోహన్‌లాల్కు అటవీ శాఖ అధికారులు షాక్‌ ఇచ్చారు. తన ఇంట్లో అక్రమంగా ఏనుగు దంతపు కళాఖండాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఎర్నాకుళంలోని కోర్టులో అతనిపై చార్జిషీట్ దాఖలు చేసింది. పెరుంబవూరులోని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో శుక్రవారం అటవీ శాఖ ఈ చార్జ్‌షీటు నమోదు చేసింది. కోదనాడ్ రేంజ్‌లోని మేకప్పల ఫారెస్ట్ స్టేషన్‌లో మోహన్‌లాల్‌పై 2012లో క్రిమినల్ కేసు నమోదైన ఏడు సంవత్సరాల తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. 

కేసు నమోదైన  అనంతరం ఈ కళాఖండాలను కలిగి వుండేందుకు  ధృవీకరణ పొందినట్టు  కోర్టుకు తెలిపారు. కె కృష్ణన్‌ అయ్యర్‌ అనే వ్యక్తినుంచి 65వేల రూపాయలకు కొనుగోలు చేశానని మోహన్‌లాల్‌ వివరణ ఇచ్చారు. అయితే అతనికి ఈ అనుమతి ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ ఎర్నాకుళంకు చెందిన  పౌలోస్ అనే పిటిషనర్  హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై స్పందించిన కేరళ ప్రభుత్వం దంతపు కళాఖండాలను ఉంచుకునేందుకు మోహన్‌లాల్‌కు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్‌లైఫ్) ఎటువంటి అనుమతి ఇవ్వలేదని కేరళ ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో కోర్టుకు తెలిపింది. దీంతో వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ 39 (3) తో మోహన్‌లాల్‌పై అభియోగాలు మోపవచ్చని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా పిటిషనర్‌  హైకోర్టును అభ్యర్థించారు.

కాగా 2012లో ఆయన ఇంట్లో సోదాలు జరిపిన ఐటీ అధికారులు  వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మోహన్‌లాల్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసిన అటవీ శాఖ అధికారులు దానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను పెరుంబవూర్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట దాఖలు చేశారు. భారతీయ వన్య ప్రాణి చట్టంలోని సెషన్ 44(6) కింద కేసు నమోదు చేసి, మోహన్‌లాల్‌ను ప్రధాన నిందితుడుగా  చేర్చిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top