నటరాజు.. ఈ గౌతంరాజు | Character Artist Gowtham Raju Interview | Sakshi
Sakshi News home page

నటరాజు.. ఈ గౌతంరాజు

Sep 15 2014 3:14 AM | Updated on Aug 20 2018 6:18 PM

నటరాజు.. ఈ గౌతంరాజు - Sakshi

నటరాజు.. ఈ గౌతంరాజు

ఘరానామొగుడు, ఇంద్రుడు చంద్రుడు, శంకర్‌దాదా ఎంబీబీఎస్ వంటి సినిమాల్లో హాస్యం పండించటమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో ప్రశంసలు అందుకున్న గౌతంరాజు.. విలక్షణ నటుడిగా పేరు సంపాదించారు.

ఇంటర్వ్యూ
ఘరానామొగుడు,  ఇంద్రుడు చంద్రుడు, శంకర్‌దాదా ఎంబీబీఎస్ వంటి సినిమాల్లో హాస్యం పండించటమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో ప్రశంసలు అందుకున్న గౌతంరాజు.. విలక్షణ నటుడిగా పేరు సంపాదించారు. హాస్యమే కాదు.. బీభత్సం సృష్టించే ప్రతి నాయకుడి క్యారెక్టర్‌లోనూ ఆయన ఇట్టే ఒదిగిపోతారు. ప్రస్తుతం తనయుడు చిరంజీవి కృష్ణంరాజు (కృష్ణ)ను హీరోగా పరిచయం చేసే పనిలో నిమగ్నమయ్యూరు. కౌతవరంలో షూటింగ్ జరుపుకొంటున్న ‘ఈ నేల-ఈ గాలి’ సీరియల్‌లో మైనర్ బాబుగా నటిస్తున్న ఆయన ఆదివారం కొద్దిసేపు ‘సాక్షి’తో మాట్లాడారు.       - గుడ్లవల్లేరు (కౌతవరం)
 
1980లో సినీ రంగప్రవేశం
మాది తూర్పుగోదావరి జిల్లా రాజోలు. నాన్న కృష్ణంరాజుకు ఉన్న వ్యాపార సంబంధాల వల్ల కాకినాడలో స్థిరపడ్డాం. 1980లో శ్రీధర్, సంగీత తారాగణంతో నిర్మించిన ‘పుణ్యభూమి కళ్లు తెరిచింది’ అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాను. నాల్గో తరగతి నుంచే నాటికలు, నాటకాలు వేసేవాళ్లం. స్త్రీ పాత్ర లేని నాటకల్ని ఎన్నుకునేవాళ్లం. నన్నంతా రాజేంద్రప్రసాద్‌లా నటిస్తున్నానంటారు.
 
అవకాశాల కోసం అష్టకష్టాలు
 నుదిటిపై గీత బాగుంటేనే సినీ అవకాశాలు లభిస్తాయి. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డాను. టాలెంట్‌కు తోడు అదృష్టం కూడా ఉండాలి. ఒకర్ని ఒకరు తొక్కేయటం అనేది కొంతకాలమే. ఎక్కువకాలం అది సాధ్యం కాదు.
 
రెండు సినిమాల్లో విలన్‌గా..
హాస్యనటుడిగా మాత్రమే ప్రేక్షకులకు పరిచయమైన నేను ఈ మధ్యనే విడుదలైన ఉదయ్‌కిరణ్ సినిమా ‘జైశ్రీరామ్’లో ప్రతి నాయకుడిగా నటించా. ఆ వేషంలో నన్ను మా ఆవిడ కూడా గుర్తుపట్టలేదు. అలాగే, త్వరలో రాబోయే ‘వేరుు అబద్ధాలు’ సినిమాలో విలన్‌గా నటించనున్నా.
 
హీరోగా మా అబ్బాయి
మా అబ్బాయి చిరంజీవి కృష్ణంరాజు(కృష్ణ) రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. మంచి ఫిజిక్ ఉంది. డ్యాన్సర్‌గా బాగా తర్ఫీదు పొందాడు. ‘లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి’, ‘నాకైతే నచ్చింది’ సినిమాలు ఈ నెలాఖరున విడుదల కానున్నారుు.
 
మరువలేని అక్కినేని మెచ్చుకోలు
1988లో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు, రాధ కాంబినేషన్‌లో ‘వసంతగీతం’ అనే సినిమాలో వేషం వచ్చింది. షూటింగ్ స్పాట్‌లో ఏఎన్నార్‌ను చూడగానే డైలాగ్ బయటకు రాలేదు. ఆ సమయంలో ‘నీ వాయిస్ బాగుంది’ అని అక్కినేని మెచ్చుకోగానే నాలోని నటరాజు విజృంభించాడు. ఆయనే స్వయంగా చప్పట్లు కొట్టి అభినందించారు.
 
పరోపకారమే ఆస్తి
 నాన్నకు 1987లో పక్షవాతం వచ్చింది. సినిమాలకు రెండేళ్లు దూరమయ్యా. ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అన్ని ఇబ్బందుల్లో కూడా నాన్న నేర్పిన పరోపకారం చేసేవాడ్ని. ఇది చచ్చేంత వరకు అమలు చేస్తాను.

‘ఆగడు’లో కనిపిస్తా..
త్వరలో విడుదలకానున్న ఆగడు సినిమాలో నటించాను. అలాగే కరెంట్‌తీగ, ఎన్టీఆర్ ఆర్ట్స్ సినిమాల్లో చేస్తున్నాను. ఇప్పటివరకు 300కుపైగా సినిమాల్లో నటించాను. సీరియల్‌కు మాత్రం బెస్ట్ హీరోగా నంది అవార్డు వచ్చింది.  హాస్యానికి రేలంగి అవార్డు లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement