
‘యాక్టింగ్ అనేది ఎడిక్షన్’లాంటిది అని చాలామంది స్టార్స్ అంటుంటారు. అందుకే లైట్స్ ఆన్, స్టార్ట్ కెమెరా, టేక్... ఈ మాటలకు దూరం కావాలని అనుకోరు. అవకాశాలు వచ్చినంతవరకు, ఓపిక ఉన్నంతవరకు నటించాలనుకుంటారు. అఫ్‌కోర్స్ కొంతమంది సినిమాలకు దూరంగా వెళ్లిపోతారనుకోండి. అయితే ఆ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.
ఇక వ్యక్తిగత కారణాల వల్ల సిల్వర్ స్క్రీన్‌కి దూరమై, ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించినప్పుడు రీ ఎంట్రీకి రెడీ అయిపోతారు కొందరు స్టార్స్. అలా ఈ ఏడాది ఇప్పటికే ఒకప్పటి కథానాయికలు తెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా రీ ఎంటర్ అయ్యారు. మరికొందరు స్టార్స్ ‘యాక్షన్ షురూ’ అంటూ రీ ఎంట్రీకి రెడీ అయిపోయారు. ఆ విశేషాలు తెలుసుకుందాం.
తొమ్మిదేళ్ల తర్వాత...
వడ్డే నవీన్ పేరు తలచుకోగానే 20 ఏళ్ల క్రితం నాటి ప్రేక్షకులకు గుర్తొచ్చే పాట ‘జాబిలమ్మ నీకు అంత కోపమా...’. నవీన్ హీరోగా నటించిన రెండో చిత్రం ‘పెళ్లి’లోని పాట ఇది. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నిజానికి ‘క్రాంతి’ అనే సినిమా ద్వారా నవీన్ హీరోగా పరిచయం కావాల్సింది. అయితే ఆ సినిమా ఆగిపోవడంతో ‘కోరుకున్న ప్రియుడు’ (1996) ద్వారా హీరోగా సిల్వర్ స్క్రీన్‌కి పరిచయం అయ్యారు. ఆ తర్వాత 2016 వరకూ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశారు.
అది కూడా 2010 తర్వాత ఆరేళ్లకు ‘ఎటాక్’ (2016) చిత్రంలో విలన్‌గా నటించారు నవీన్. ఇప్పుడు తొమ్మిదేళ్లకు ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. కాగా గతంలో వడ్డే నవీన్ తండ్రి వడ్డే రమేశ్ నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ఇప్పుడు రీ ఎంట్రీలో వడ్డే క్రియేషన్స్ బేనర్ ఆరంభించి, టైటిల్ రోల్ చేయడంతో పాటు ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు వడ్డే నవీన్. కమల్ తేజ నార్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
‘ప్రేమ దేశం’ హీరో ఎంట్రీ
‘ప్రేమ దేశం’ (1996) ఎవర్ గ్రీన్ లవ్‌స్టోరీ మూవీ. ఈ సినిమాలో హీరోలుగా నటించిన వినీత్, అబ్బాస్ కెరీర్స్‌కి బ్లాక్ బస్టర్ మూవీ ఇదే అని చె΄÷్పచ్చు. ఇక హీరోయిన్ టబుకి ఈ సినిమా స్పెషల్. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకూ అంటే... ఈ చిత్రం తర్వాత పలు చిత్రాల్లో నటించిన అబ్బాస్ 2014లో ‘అలా జరిగింది ఒక రోజు’ సినిమా తర్వాత తెలుగులో కనిపించలేదు. అటు తమిళ్, మలయాళం వంటి ఇతర భాషల్లోనూ సినిమాలు చేయలేదు. ఇప్పుడు పదకొండేళ్లకు అబ్బాస్ రెండు తమిళ చిత్రాలు అంగీకరించారు. ఒకటి శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ‘పరాశక్తి’, మరొకటి జీవీ ప్రకాశ్‌కుమార్ హీరోగా రూపొందుతున్న సినిమా. ఇలా రీ ఎంట్రీలో రెండు సినిమాలు అంగీకరించిన అబ్బాస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అవుతారని ఊహించవచ్చు.
కమ్‌బ్యాక్‌లోనూ హీరోయిన్‌గా...
2002లో ప్రభాస్ హీరోగా పరిచయమైన ‘ఈశ్వర్’ చిత్రం ద్వారానే హీరోయిన్‌గా పరిచయం అయ్యారు ప్రముఖ క్యారెక్టర్ నటుడు విజయ్‌కుమార్ కుమార్తె శ్రీదేవి. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన శ్రీదేవి ‘వీర’ (2011) సినిమా తర్వాత టాలీవుడ్‌లో కనిపించలేదు. వేరే భాషల్లోనూ సినిమాలు చేయలేదు. కన్నడంలో మాత్రం 2016లో ‘లక్ష్మణ’ చిత్రంలో నటించారు. ఇక ఈ ఏడాది ‘సుందరకాండ’ చిత్రంతో శ్రీదేవి తెలుగు తెరపై మళ్లీ కనిపించనున్నారు.
నారా రోహిత్ హీరోగా వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. అయితే విశేషం ఏంటంటే... ఈ కమ్‌బ్యాక్‌లోనూ ఆమె హీరోయిన్‌గానే నటించారు. ఇక మధ్యలో సినిమాలకు బ్రేక్ తీసుకోవడానికి కారణం పెళ్లి. 2009లో నిజామాబాద్‌కి చెందిన వ్యాపారవేత్త రాహుల్‌తో శ్రీదేవి పెళ్లి జరిగింది. ఆ తర్వాత పాప పుట్టింది. పాపని చూసుకోవడానికి సినిమాలకు బ్రేక్ తీసుకున్న శ్రీదేవి టీవీ షోస్‌లో మాత్రం కనిపించారు. ఇక వరుసగా సినిమాల్లోనూ నటించాలనుకుంటున్నారు.
28 ఏళ్లకు...
‘బంగారు కోడి పెట్ట వచ్చెనండి’... పాట ఇప్పటికీ పాపులర్. ‘ఘరానా మొగుడు’ (1992) సినిమాలోని ఈ స్పెషల్ సాంగ్‌కి చిరంజీవితో కలిసి డిస్కో శాంతి వేసిన స్టెప్స్ మాస్‌ని ఓ రేంజ్‌లో ఉర్రూతలూగించాయి. స్పెషల్ సాంగ్స్‌లో శాంతి ఎనర్జిటిక్ డ్యాన్స్ ఆమెకు ‘డిస్కో’ శాంతి అని పేరు తెచ్చింది. డిస్కో డ్యాన్స్ అదరగొట్టిన శాంతి పలు చిత్రాల్లో కొన్ని కీలక పాత్రలు కూడా చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ... ఇలా పలు భాషల్లో దాదాపు 900 చిత్రాలు చేశారు శాంతి. 1996లో నటుడు శ్రీహరిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టారు.
1997 తర్వాత ఆమె తెరపై కనిపించలేదు. ఇద్దరు కుమారుల ఆలనా పాలనా చూసుకుంటూ శ్రీహరితో చక్కని జీవితాన్ని చవి చూశారు శాంతి. 2013లో శ్రీహరి చనిపోయాక బయట కనిపించడం మానేశారామె. ఇప్పుడు 28 ఏళ్లకు మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనున్నారు శాంతి. లారెన్స్, ఆయన తమ్ముడు ఎల్విన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ‘బుల్లెట్ బండి’ చిత్రంలో శాంతి ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె జోస్యం చెప్పే పాత్రలో కనిపిస్తారని టీజర్ స్పష్టం చేస్తోంది. ఇన్నాసి పాండియన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కదిరేశన్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
పుష్కరకాలం పూర్తయ్యాక...
‘నరసింహుడు, జై చిరంజీవ, అశోక్’ వంటి చిత్రాల్లో కథానాయికగా నటించి, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ (2012)లో స్పెషల్ సాంగ్ చేశారు సమీరా రెడ్డి. ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు. ఎక్కువగా హిందీ చిత్రాల్లో నటించిన సమీరా 2013లో చేసిన కన్నడ చిత్రం ‘వరద నాయక’ తర్వాత పూర్తిగా సిల్వర్ స్క్రీన్‌కి దూరం అయ్యారు. 2014లో అక్షయ్ వర్దేని పెళ్లి చేసుకుని, ఒక బాబు, పాపకి జన్మనిచ్చారామె. కుటుంబం కోసం నటనకు కాస్త బ్రేక్ ఇచ్చారు. పిల్లలు కాస్త పెద్దవాళ్లు కావడం, సమీరా గతంలో నటించిన ‘రేస్’ మూవీ చూసి, ఆమె కుమారుడు ఎందుకు సినిమాలు చేయడంలేదని అడగడంతో ఆమె రీ ఎంట్రీకి రెడీ అయ్యారు.
ప్రస్తుతం హిందీలో ‘చిమ్నీ’ అనే హారర్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు సమీరా. పుష్కర కాలం పూర్తయ్యాక కెమెరా ముందుకు రావడం ఏదో కొత్తగా అనిపించిందని, టెక్నాలజీలో, సినిమా టేకింగ్‌లో వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపించాయని సమీరా పేర్కొన్నారు. ‘చిమ్నీ’లో తన కుమార్తెను ఆవహించిన దుష్ట శక్తితో పోరాడి, కాపాడుకునే కాళీ అనే తల్లి పాత్ర చేస్తున్నారు సమీరా. కాగా ఈ చిత్రంలో సమీరా యువ పెళ్లికూతురు, తల్లి, 60 ఏళ్ల వృద్ధురాలు... ఇలా మూడు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారు. కమ్‌బ్యాక్‌కి ఇది సరైన పాత్ర అని భావిస్తున్నారామె. గగన్ పురి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే... గత ఏడాది సమీరా రెడ్డి ‘నామ్’ అనే హిందీ చిత్రంలో కనిపించారు. అయితే 2004లో షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం పలు సమస్యల వల్ల 20 ఏళ్లకు విడుదలైంది.
ముందుగా చిన్ని తెరపై...
1990లలో హీరోయిన్‌గా పరిచయమై దాదాపు పదేళ్లకు పైగా గ్లామరస్ స్టార్‌గా ఓ వెలుగు వెలిగారు రంభ. ప్రత్యేక పాటల్లోనూ ఆమె ఆకట్టుకున్నారు. 2008 తర్వాత తెలుగులో, 2010 తర్వాత తమిళంలో బ్రేక్ తీసుకున్నారు రంభ. కెనడాలో స్థిరపడ్డ శ్రీలంకన్ తమిళ వ్యాపారవేత్త ఇంద్రకుమరన్‌ని 2010లో ప్రేమ వివాహం చేసుకున్నారు రంభ. ఆ తర్వాత భర్తతో కలిసి టొరెంటోలో సెటిలయ్యారామె. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. పిల్లల కోసం కెరీర్‌కి బ్రేక్ ఇచ్చిన రంభ ఇప్పుడు రీ ఎంట్రీకి రెడీ అయ్యారు.
అయితే పెద్ద తెరపై కనిపించే ముందు చిన్ని తెరపై గెస్ట్‌గా కనిపించారామె. జీ తెలుగులో ప్రసారమైన ఓ రియాలిటీ షోలో అతిథిగా మెరిశారు రంభ. ఆ షోలో దక్కిన ఆదరణ చూసి తనకు చాలా ఆనందం అనిపించిందని ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారామె. పిల్లలు పెద్దవాళ్లు కావడంతో మళ్లీ కెమెరా ముందుకు రావాలనుకుంటున్నానని మనసులో మాటని బయటపెట్టారు. కాగా.. రంభకు కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయట. రీ ఎంట్రీలో తాను చేయనున్న తొలి సినిమా గురించి అధికారికంగా ప్రకటిస్తానని అంటున్నారామె. మరి... తెలుగు అమ్మాయి రంభ ఎంట్రీ తెలుగు చిత్రంతోనా లేక వేరే భాషలోనా? అనేది వేచి చూడాల్సిందే.
ఒకప్పటి తారలు కొంత బ్రేక్ తర్వాత మళ్లీ తెరపై కనిపిస్తే వారి అభిమానులకు మాటల్లో చెప్పలేనంత ఆనందం కలగడం సహజం. ఈ స్టార్స్ రీ ఎంట్రీ పట్ల ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఈ తారలు మాత్రమే కాదు... ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన మరికొందరు స్టార్స్ కూడా రీ – ఎంట్రీకి రెడీ అవుతున్నారు.
2025లో రీ ఎంట్రీ అయిన తారలు వీరే
→ అర్చన పేరు వినగానే 1980–1990ల ప్రేక్షకులకు తులసి అనే గిరిజన యువతి గుర్తొస్తుంది. ‘నిరీక్షణ’ చిత్రంలో అర్చన ఆ పాత్రలో ఎంతలా ఒదిగిపోయారో చూసినవాళ్లకు తెలుసు. ఈ సహజ నటి తెలుగు తెరపై కనిపించి, 2022కి దాదాపు పాతికేళ్లయింది. ‘చోర్ బజార్’ (2022) చిత్రంతో క్యారెక్టర్ నటిగా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత మూడేళ్లకు ఈ ఏడాది ‘షష్టిపూర్తి’ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌కి జోడీగా నటించారామె. విశేషం ఏంటంటే... 37 ఏళ్ల తర్వాత రాజేంద్రప్రసాద్–అర్చన కలిసి నటించిన చిత్రం ఇది. హిట్ మూవీ ‘లేడీస్ ట్రైలర్’లో జంటగా నటించిన ఈ ఇద్దరూ మళ్లీ ‘షష్టిపూర్తి’లో నటించారు.
→ దాదాపు పదేళ్లకు ఈ ఏడాది రాశి వెండితెరపై కనిపించిన చిత్రం ‘ఉసురే’. తమిళ్, తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఈ సినిమాలో కనిపించక ముందు 2020 నుంచి 2023 వరకూ రాశీ ‘గిరిజా కల్యాణం’, ‘జానకి కలగనలేదు’ సీరియల్స్‌లో నటించారు.
→ ‘గుండెల్లో ఏముందో...’ అంటూ ‘మన్మథుడు’ (2002) లో ఓ కథానాయికగా నాగార్జునతో ఆడి పాడిన అన్షు అప్పట్లో చాలా పాపులర్ అయ్యారు. అయితే ఆ తర్వాత రెండు మూడు చిత్రాల్లో నటించి, విదేశాలకు వెళ్లిపోయారు. 23 ఏళ్లకు మళ్లీ ఆమె సిల్వర్ స్క్రీన్‌పై కనిపించిన చిత్రం ‘మజాకా’. సందీప్ కిషన్ హీరోగా రూపొందిన ఈ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో అన్షు రీ ఎంట్రీ హాట్ టాపిక్ కాలేదు.
→ హోమ్లీ హీరోయిన్ లయకి కూడా రీ ఎంట్రీ పెద్దగా కలిసి రాలేదు. దాదాపు 20 ఏళ్లకు ‘తమ్ముడు’ సినిమాతో ఆమె రీ ఎంట్రీ జరిగింది. ఈ చిత్రంలో హీరో నితిన్‌కి అక్కగా నటించారు లయ. ఈ చిత్రం అంచనాలు అందుకోలేపోయింది.
→ ఇక ‘బొమ్మరిల్లు’ చిత్రంలో చేసిన పాత్ర పేరు (హాసిని)తో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన జెనీలియా ఈ ఏడాది తెలుగులో ‘జూనియర్’ చిత్రంతో పదమూడేళ్లకు మళ్లీ తెరపై కనిపించారు. ఈ సినిమా కూడా అంచనాలు అందుకోలేక పోయింది. అటు బాలీవుడ్‌లో కీలక పాత్రలు చేస్తున్నారు జెనీలియా.
ఇలా రీ ఎంట్రీలో ఒకప్పటి ఈ ఐదుగురు కథానాయికలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కనిపించి, తమ నటనతో ఆకట్టుకున్నారు. అయితే ఈ నలుగురూ చేసిన సినిమాలు ఆశించిన ఫలితాన్నివ్వకపోవడం ఓ చేదు అనుభవంగా చెప్పొచ్చు.
– డి.జి.భవాని