పువ్వులా  పరిమళిద్దాం.. సుద్దాల అశోక్‌ తేజ | suddala ashok teja interview Bathukamma festival 2025 | Sakshi
Sakshi News home page

పువ్వులా  పరిమళిద్దాం.. సుద్దాల అశోక్‌ తేజ

Sep 21 2025 6:33 AM | Updated on Sep 21 2025 6:47 AM

suddala ashok teja interview Bathukamma festival 2025

‘‘ప్రతి మనిషి ఒక పువ్వులాంటివాడే. పువ్వు ఉన్నంతసేపు పరిమళాన్నిస్తుంది. మనిషి కూడా ఉన్నన్ని రోజులు ప్రపంచానికి, భూమికి, తన కుటుంబానికి, ఇరుగు పొరుగు వారికి ప్రేమగా, బాధ్యతగా ఉండాలన్నది మానవ జీవితం  అయినప్పుడు.. పువ్వు కూడా అంతే. 

పూస్తుంది...  పరిమళాలు పంచుతుంది.. వాడి పోయి రాలి పోతుంది. పూల జీవన తాత్పర్యం,  జీవన తాత్వికత అదే.  మనిషి కూడా మంచి చేయక పోయినా పర్వాలేదు కానీ, చెడు చేయకూడదు. ఇలా ఓ మంచి సందేశం ఇచ్చే పండుగ బతుకమ్మ’’ అని ప్రముఖ రచయిత సుద్దాల అశోక్‌ తేజ చెప్పారు. నేడు ‘బతుకమ్మ’ పండుగ ఆరంభం సందర్భంగా ‘సాక్షి’తో  ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలు.

‘‘నాకు ఊహ తెలిసీ తెలియని వయసులోనే మా అమ్మ, అక్కతో పాటు మా నాన్న కూడా బతుకమ్మ కోసం పూలను తీసుకొచ్చేవారు. అలా ఈ పూల పండుగ అయిన బతుకమ్మకి ఇచ్చే ప్రాధాన్యం చిన్న వయసులో నాకు అర్థం అయింది. బతుకమ్మ అనే పేరు పెట్టడంలోనే ప్రజలు చాలా గొప్ప ప్రతిభ పాటించారనిపిస్తోంది. పూలతో అలంకరించి చేస్తారు కాబట్టి పూలమ్మ పండుగ అని కూడా అనొచ్చు కదా? కానీ, అనలేదు. 

గౌరమ్మ పండుగ, పార్వతీదేవి పండుగ, లక్ష్మీదేవమ్మ పండుగ అనలేదు. ఇవన్నీ పాటలు పాడుతుంటారు. కానీ, బతుకుకు సంబంధించిన ప్రకృతిని పూజించి, ప్రార్థించి, గౌరవించి, ఆరాధించేటటువంటి ఒక పండుగేమో అని అర్థం వచ్చేటట్లు బతుకమ్మ అని పేరు పెట్టారేమో అనిపిస్తుంది. మనిషి బతకాలంటే పంచభూతాలు బాగుండాలి. అది మన శరీరం కావొచ్చు, ఈ ప్రపంచం కావొచ్చు. అసలు మన పండుగలన్నీ వ్యవసాయమే ప్రధాన వృత్తిగా బతుకుతున్న ప్రజలు చేసుకునే పండుగలే. అది దసరా అయినా, సంక్రాంతి అయినా, ఉగాది అయినా. అందులో భాగంగా దసరాకి ముందు వచ్చేదే ఈ బతుకమ్మ పండుగ.  

→ సామాన్యుల పండుగ 
బతుకమ్మ పండుగలో ఒక గమ్మత్తయిన ఆచారం ఉంది. ఖరీదైన  పూలు బతుకమ్మలో వాడరు. పేదవాళ్లు తమ  పొలాల్లో,  పొలం గట్లల్లో, చెలకల్లో, ఆరు బయట ఊరు చివర ఉన్న ఎక్కడపడితే అక్కడ దొరికే గడ్డి పోగులను, పూలను మాత్రమే వాడతారు. ఈ పూలన్నింటినీ పేర్చినప్పటికీ.. గణపతిని నీళ్లల్లో నిమజ్జనం చేసినట్లు చేయరు. ఒక కార్తీక దీపంలాగా అలల మీద పెట్టి తోస్తారు. ఈ గట్టు నుంచి ఆ గట్టుకు చేరుకోమని. వాళ్ల బతుకులు కూడా ఒక గట్టు మీద నుంచి మరో గట్టుకి చేరడంలోనే జీవితానికి సార్థకత ఉందని భావించడానికే చెరువులో వేసి ‘ పోయిరా బతుకమ్మా..’ అంటుంటారు. 

ఇలా తమ బతుకులకు తామే ధైర్యం చెప్పుకుంటున్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఈ గట్టు అనేది పుట్టక అయితే ఆ గట్టు అనేది చివర. మధ్యలో అనేకమైన అల్లకల్లోలాలు, గాలులు, అలలు, తుఫానులు, అభ్యంతరాలు, ఆటంకాలు, ఆశాభంగా లు ఉంటాయి జీవితంలో. ఈ పండుగలో కూడా బతుకమ్మని పేర్చి, ఈ చివరి నుంచి అటు తోస్తే అది మెలమెల్లగా వెళుతూ మధ్యలో మునిగి పోతుందా? ఆ గట్టుకు చేరుకుంటుందా? అనేది మనకు తెలియదు కానీ, తమ జీవితాలను తామే ఒక సాంకేతికమైన మార్గంగా సృష్టించుకుని చేసుకుంటారేమో అనిపిస్తుంది నాలాంటివాళ్లకి.  

→ మా ఇంట్లో మనవరాళ్ల దాకా... 
బతుకమ్మ అనేది ఆడపడుచుల పండుగ. అత్తగారింటికి వెళ్లిన ఆడబిడ్డలందరూ అమ్మగారింటికి వచ్చి బతుకమ్మ, దసరా పండుగ చూసుకుని వెళ్లి పోతుంటారు. ఈ పండుగ గురించి మాకు గుర్తొచ్చేది ఏంటంటే.. పూలను తీసుకురావాలి, పేర్చాలి.. అమ్మ ప్రసాదం చేస్తే తినాలి.. ఇరుగు  పొరుగువారికి ఇచ్చిపుచ్చుకోవడం అన్నమాట. ఈ సంప్రదాయం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకూ సాగుతూనే ఉంది. మా అమ్మ, అక్కలు, చెల్లెళ్లు్ల, కూతుళ్లు, కోడళ్లు... ఇప్పుడు నా మనవరాళ్ల దాకా వచ్చింది.   

→ చప్పట్ల పండగ 
బతుకమ్మ అంటే చప్పట్ల పండుగ. ఈ పండుగనాడు సన్నాయిలు, వాయిద్యాలు, మృదంగాలు, డప్పులు కొడుతుంటే మహిళలు బతుకమ్మని చెరువుదాకా తీసుకెళ్లేవారు. కాలప్రవాహంలో మనం చూస్తున్న ఈ దాండియా, డీజేలు మన సంప్రదాయం కాదు. బతుకమ్మ పండుగలో కాలక్రమేణా వస్తున్న మార్పులు సంప్రదాయబద్ధంగా ఉంటే పర్వాలేదు. కానీ, అందులోకి ఈ ఐటెమ్‌ సాంగ్‌లను వాయించే వాయిద్యాలు చొరబడొద్దు.. అది కరెక్ట్‌కాదు..

→ ఆ అనుభూతితో పాటలు రాశా! 
బతుకమ్మ పండుగపైన నేను కూడా చాలా పాటలు రాశాను. చిన్నప్పుడు మా అమ్మ బతుకమ్మ ఆడుతుంటే చూసినవాణ్ణి. అలాగే మా అక్కలు, చెల్లెళ్లు, కూతుళ్లు, మనవరాళ్లు ఆడుతుంటే చూసినప్పుడు ఒక అనుభూతి ఉంటుంది. ఆ అనుభూతి, సంప్రదాయం, వారు పాడే పాటల్లోని జానపదం కలిపి ఆ పాట రాస్తున్నప్పుడు ఒక గొప్ప అనుభూతి కలిగింది. ఆ అనుభూతితోనే పాటలు రాశాను. 

→ తాత్త్విక సందేశం ఇచ్చే పండుగ
బతుకమ్మ పండుగ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే... మన సంప్రదాయం, మన పూర్వీకులు ఆచరిస్తున్న పద్ధతులు, ప్రేమ, మానవ సంబంధాలు, రక్తసంబంధాలు, ఆడపడుచులు పుట్టింటికి రావడం, ఆ ప్రేమలు ఉన్నాయి. అదే విధంగా మనం పూలను గౌరవించాలి.. పూజించాలి.. పువ్వులకు నమస్కారం చేయాలి. పువ్వులు ఉండాలంటే చెరువులుండాలి.. చెరువులు ఉండాలంటే వానలు ఉండాలి.. వానలు ఉండాలంటే చెట్లు ఉండాలి. 

చెట్లు పిలిస్తే వాన–వాన కురిస్తే చెట్టు అయినప్పుడు ఈ రెండూ లేకుండా బతుకమ్మ పండుగ లేదు. ప్రకృతి, పర్యావరణం బాగుంటేనే బతుకమ్మ బాగుంటుంది.. బతుకమ్మ బాగుంది అంటే బతుకులు బాగున్నట్టు లెక్క. ఇలా ఓ మంచి సందేశం ఇచ్చే పండుగ బతుకమ్మ. జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, గండాలు, సుడిగుండాలు ఉంటాయి.. వాటన్నింటినీ తప్పించుకుంటూ, అధిగమించుకుంటూ మనుషుల్లో అందరం బాగుండడం.. అందులో మనం కూడా ఉండటం అనే తాత్త్విక సందేశం ఇచ్చేదే బతుకమ్మ. 

→ ఆ సంబరం... ఆ సందడి 
బతుకమ్మ పండుగప్పుడు గతంలో మా అక్కలు, చెల్లెళ్లు ఇంటికొచ్చేవారు. ఇప్పుడైతే నా కూతురు వస్తుంది.. మనవరాళ్లు వస్తారు. మా కోడళ్లు కుదిరితే తల్లిగారి ఇంటికి వెళతారు.. లేదంటే మా ఇంట్లోనే ఉంటారు. నా భార్య కూడా బతుకమ్మ పేర్చడం, ఇరుగు  పొరుగువారితో బతుకమ్మ ఆడటం, మా కాలనీలో తాత్కాలిక నీటి కొలను ఏర్పాటు చేసుకుని అందులో బతుకమ్మని వేయడం జరుగుతుంటుంది. లేదా అవకాశం ఉంటే ఎవరితోనైనా పంపించి, నదిలోనో, చెరువుల్లోనో వేయిస్తాం. మా ఊరు సుద్దాలకి వెళ్లి బతుకమ్మ చేసుకుంటే మాత్రం పక్కాగా బతుకమ్మ కుంటలో వేస్తాం.

 పిత్రమాస నాడు కుంటలో వేస్తాం, సద్దుల బతుకమ్మనాడు చెరువు వద్దకు అందరూ వెళతారు. ఆట పాటల్లో మహిళలు మాత్రమే పాల్గొంటారు. కానీ, పురుషులు మాత్రం వారి వెంట వెళతారు. బతుకమ్మలను అవసరమైతే చెరువు మధ్యలోకి వెళ్లి వదలాల్సి వచ్చినప్పుడు పురుషులు వెళ్లి వదిలే సంప్రదాయం మాత్రం ఉంది.. వాటన్నింటిలో మేము పాల్గొన్నాం. ఇప్పుడైతే మా అబ్బాయిలు, అల్లుళ్లు, మనవళ్లు ఉన్నారు.. వాళ్లు చూసుకుంటారు కానీ, నేను పాల్గొనటం లేదు. నాకు ఐదుగురు మనవరాళ్లు, ఒక మనవడు ఉన్నారు. వీరందరూ బతుకమ్మ పండగకి తప్పకుండా వస్తారు. అది పిత్రమాస రోజు అయినా లేదంటే సద్దుల బతుకమ్మనాడు అయినా వస్తుంటారు. ఆ సంబురం, ఆ సందడి వేరుగా ఉంటుంది. అది బతుకమ్మలో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకే నా దృష్టిలో అమ్మాయిలు లేని బతుకమ్మ పండుగ చంద్రుడు లేనటువంటి పౌర్ణమిలాంటిది’’ అని చెప్పారు సుద్దాల అశోక్‌ తేజ. 
– డేరంగుల జగన్‌ మోహన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement