కళాకారుల ఆనందమే సుబ్బరామి రెడ్డి ఆహారం – బ్రహ్మానందం

Brahmanandam Speech @ Hasya Nata Brahma Title Presentation - Sakshi

‘‘లలిత కళలంటే లలితాగాయత్రి యొక్క అంశ కలిగిన కళలు. ఈ కళలు అబ్బటం ఆ దేవత ఆశీర్వచనం. అటువంటి కళాకారులు ఎక్కడ పుట్టినా గౌరవించేవాళ్లు కొందరు ఉంటారు. అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు. ఆయన చిరస్థాయిగా ఉన్నారంటే కళలకు, కళాకారులకు ఆయన చేసిన సేవే. ఆయన పేరు వినగానే మనకు ‘భువనవిజయం’ గుర్తొస్తుంది. కళలకు ఉన్న గొప్పతనం అలాంటిది. సుబ్బరామి రెడ్డి మనసెప్పుడూ కళల మీద, కళాకారుల మీదే ఉంటుంది. వాళ్లను గౌరవించటం. వాళ్ల ఆనందమే ఈయన ఆహారం.

నా పూర్వ జన్మ సుకృతం వల్ల రేపు కాకతీయ కళలను గుర్తు చేసుకుంటూ తీసుకోబోయే ఈ అవార్డు నాకు ప్రత్యేకమైంది. ఆలీ నాకంటే నటనలో సీనియర్‌. పరిశ్రమలో నటించటం పక్కన పెడితే, అసలు ఉండటమే కష్టం. అందుకే ఆలీ ‘ఏ’ నేను ‘బీ’’ అన్నారు బ్రహ్మానందం. ‘కాకతీయ లలిత కళా పరిషత్‌’ ఏర్పాటు చేసి, కళాకారులను సన్మానిస్తున్నారు సుబ్బరామి రెడ్డి. మార్చి 11న మహబూబ్‌నగర్‌లో జరగనున్న ఈ ఉత్సవాల్లో బ్రహ్మానందానికి ‘హాస్య నట బ్రహ్మ’ బిరుదును ప్రదానం చేయనున్నారు.

ఈ వివరాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టీయస్సార్‌ మాట్లాడుతూ– ‘‘కళలోనే దైవత్వం ఉంది. అందుకే కళాకారులను గౌరవించినా, అభినందించినా, సత్కరించినా.. మనకు ఆ శక్తి వస్తుంది. 700 సంవత్సరాల క్రి తం పరిపాలించిన కాకతీయ చక్రవర్తుల వైభవం, కళల సంపద అపూర్వం. ఆ తర్వాత మనకు గుర్తు వచ్చేది శ్రీకృష్ణ దేవరాయలు. కాకతీయ కళా పరిషత్‌ను  2 నెలల క్రితం ప్రారంభించినప్పుడు మోహన్‌బాబును సత్కరించాం.

ఇప్పుడు రూరల్‌ ఏరియాస్‌లో కూడా ఈ కళా వైభవోత్సవాలు నిర్వహించాలనుకుంటున్నాం. తెలంగాణాలో మొట్టమెదటిగా æమహబూబ్‌నగర్‌ జిల్లాలో ఈ కార్యక్రమం స్టార్ట్‌ చేస్తున్నాం. కళాకారులను, స్థానిక కళాకారులను, సినీ కళాకారులని ఇందులో సన్మానించదలిచాము. ఈ కార్యక్రమంలో 1100 చిత్రాల్లో నటించి, హాస్యాన్ని పంచిన బ్రహ్మానందంకు ‘హాస్య నట బ్రహ్మా’ అనే బిరుదు ప్రదానం చేయనున్నాం. దాదాపు 40 ఇయర్స్‌ కెరీర్‌ ఉన్న ఆలీకు కూడా అవార్డ్‌ ఇవ్వబోతున్నాం.

పలువురు సినీరంగ ప్రముఖులను, స్థానిక కళాకారులను ‘‘కాకతీయ అవార్డు’తో సత్కరిస్తాం’’ అన్నారు. ‘‘బ్రహ్మానందం గారు తెలియని తెలుగువారుండరు. సుబ్బరామిరెడ్డి గారు పార్లమెంట్‌ సభ్యుడి కంటే గొప్ప భక్తుడు,కళా పోషకుడు, కళా బంధువు’’ అన్నారు శాసన సభ సభ్యుడు శ్రీనివాస్‌ గౌడ్‌. ‘‘నటరాజుకి కళాకారులంటే ఇష్టం. ఆ నటరాజే సుబ్బరామిరెడ్డి గారు. కేవలం 33 సంవత్సరాల్లో 1100 సినిమాలు పూర్తి చేసిన బ్రహ్మానందంగారిని సన్మానించటం ఆనందం’’ అన్నారు ఆలీ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top