బిగ్‌బాస్‌: బ్యాగు సర్దుకో మహేశా!

Bigg Boss 3 Telugu: Mahesh Will Be Eliminated - Sakshi

బిగ్‌బాస్‌ పన్నెండో వారం ముగింపుకు వచ్చినప్పటికీ అసలైన మజా రావటం లేదు. షో చూస్తే నిద్ర వస్తుందే తప్ప ఇంట్రస్ట్‌ అన్న మాట మచ్చుకైనా కనిపించటం లేదని ప్రేక్షకుల వాదన. ఇప్పటివరకు తొమ్మిది మంది ఇంటిని వీడగా మరొకరు తట్టాబుట్టా సర్దుకోనున్నారు. అయితే ఎప్పటిలానే ఈ సారికూడా ఎలిమినేషన్‌లో పెద్ద సస్పెన్స్‌ ఉన్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే మహేశ్‌ బిగ్‌బాస్‌ హౌస్‌ను వీడనున్నాడని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్‌ మీడియా జోస్యమే నూటికి నూరుపాళ్లు నిజమయ్యేట్టు కనిపిస్తోంది. ఇక చెరపకురా చెడేవు అన్న సామెత మహేశ్‌ విషయంలో అక్షరాలా నిజం కానుంది. అందరితో కలిసి ఉన్నానంటూనే వారి వెనక గోతులు తీశాడు. ఇక్కడివి అక్కడ అక్కడివి ఇక్కడ చెప్తూ పూటకో ఊసరవెల్లిలా రంగులు మార్చాడు. దీంతో అతని నిజ స్వరూపం ఇంటి సభ్యులందరికీ అర్థమయి కాస్త దూరం పెట్టారు. దీంతో  అందరితో కలిసిపోయానంటున్న మహేశ్‌ ఇంట్లో చివరికి ఏకాకిగా మారిపోయాడు. అయినప్పటికీ నారద వేషాలు మానుకోలేదు.

ఇక నామినేషన్‌ రౌండ్‌లో వరుణ్‌, రాహుల్‌ ఉన్నందున బాబా భాస్కర్‌, శ్రీముఖి ఫ్యాన్స్‌ ఓట్లు మహేశ్‌కు పడే అవకాశాలు ఎక్కువ. కానీ మహేశ్‌.. శ్రీముఖిని టార్గెట్‌ చేశాడని తెలియడంతో ఆమె ఫ్యాన్స్‌ అతనికి ఓట్లు వేయాలా వద్ద అన్న సందిగ్ధంలో ఉండిపోయారు. అటు బాబాతోనూ సఖ్యతగా ఉండకపోవటం వల్ల అతని అభిమానులు కూడా అదే పరిస్థితిలో కొట్టుమిట్టాడారు. ఈ ఊగిసలాటలోనే వారం అంతా గడిచిపోయింది. మరి ఈ లెక్కన చూస్తే మహేశ్‌కు ఓట్లు తగ్గినట్టేగా! గతంలోనూ నాగ్‌ ఒకసారి మహేశ్‌ను ఎలిమినేట్‌ చేశాడు. కానీ అది టాస్క్‌లో భాగంగా! ఈ సారి మాత్రం ఊరికే కాకుండా నిజంగానే గుడ్‌బై చెప్తారని టాక్‌.. సో ఈ విషయం మహేశ్‌కు కూడా ఈపాటికే అర్థమై ఉంటుంది. అందుకే డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందేమో అని లెక్కలు వేసుకున్నాడు.  ఒకవేళ వెళ్లిపోయినా నాతోపాటు ఇంకొకరు రావాల్సిందేనని మంకు మీద ఉన్నాడు. మరి మహేశ్‌ చెప్పినట్టు డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందా? లేక మహేశ్‌ బిగ్‌బాస్‌కు గుడ్‌బై చెప్పాల్సిన సమయం దగ్గరపడిందా! అన్నది నేటి ఎపిసోడ్‌లో తేలనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top