బి అవేర్‌: కపిల్‌ శర్మ చాలా డేంజర్‌ | Sakshi
Sakshi News home page

బి అవేర్‌: కపిల్‌ శర్మ చాలా డేంజర్‌

Published Wed, Oct 11 2017 11:30 AM

Beware fans! Your love for Kapil Sharma can be dangerous for you

కపిల్‌ శర్మ.. ప్రముఖ భారతీయ స్టాండప్ కమెడీయన్‌గా, నటుడిగా, టివి వ్యాఖ్యాతగా, నిర్మాతగా చాలా సుపరిచితం. భారత అతిపెద్ద కామెడీ షో కామెడీ నైట్స్ విత్ కపిల్‌తో ఆయన పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. అంత పెద్ద సెలబ్రిటీ అయిన కపిల్‌ శర్మ మాత్రం తన అభిమానులకు చాలా ప్రమాదకరమట. కపిల్‌ శర్మ మీకు ప్రమాదకరమంటూ ఆయన అభిమానులను సైబర్‌ సెక్యురిటీ సంస్థ మెకాఫీ హెచ్చరిస్తోంది. అసలు ఆయనెందుకు డేంజరో తెలుసా? కపిల్‌ శర్మ గురించి ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేసేటప్పుడు అనుమానిత లింకులు, ప్రమాదకర వెబ్‌సైట్లు, మాల్‌వేర్‌ వంటివి వెలుగు చూస్తున్నాయని మెకాఫీ తెలిపింది. 2017లో కపిల్‌ శర్మనే 'రిస్కీస్ట్‌ సెలబ్రిటీ సెర్చ్‌డ్‌ ఆన్‌లైన్‌'గా నిలిచినట్టు వెల్లడించింది.

ఇటీవల కాలంలో డిజిటల్‌ ప్రపంచం ఎక్కువగా పెరుగుతుండటంతో, అభిమానులు తమకు నచ్చిన సెలబ్రిటీ గురించి తెలుసుకోవాలంటే ఆన్‌లైన్‌నే ఆశ్రయిస్తున్నారు. ఇలా సెర్చ్‌ చేసేటప్పుడు అనుమానిత లింక్‌లను క్లిక్‌ చేయాల్సి వస్తుందని, వాటివల్ల ఏర్పడే ప్రమాదాన్ని మెకాఫీ వెల్లడించింది. సోనాక్షి సిన్హాను వెనక్కి నెట్టేసి మెకాఫీ మోస్ట్‌ సెన్సేషనల్‌ సెలబ్రిటీల జాబితా 2017లో తొలి స్థానంలో శర్మ నిలిచారు. శర్మ గురించి ఆన్‌లైన్‌లో వెతికేటప్పుడు 9.58 శాతం ప్రమాదకర వెబ్‌సైట్‌లోకి వెళ్తున్నారని పేర్కొన్నారు. కపిల్‌ తర్వాత సల్మాన్‌ ఖాన్‌ రెండో స్థానంలో, అమీర్‌ ఖాన్‌ మూడో స్థానంలో ఉన్నారు. 8.75 శాతం ప్రమాదకరంతో ప్రియాంక చోప్రా నాలుగో స్థానంలోకి ఎగిశారు. గతేడాది ఆమె ఏడో స్థానంలో ఉండేవారు. కపిల్‌ శర్మ కామెడీ షోలు కావాలంటే, అధికారిక ప్రసారాలు వచ్చేంత వరకు వేచిచూడాలని లేదా టెలివిజన్‌, అధికారిక వెబ్‌సైట్లలో మరోసారి ప్రసారం చేస్తారని మెకాఫీ ఆర్‌ అండ్‌ డీ ఆపరేషన్ల అధినేత వెంకట్‌ క్రిష్ణపుర్‌ చెప్పారు. థర్డ్‌ పార్టీల ద్వారా సందర్శిస్తే మాల్‌వేర్‌ చొచ్చుకుని వచ్చే ప్రమాదముందన్నారు. 

Advertisement
Advertisement