భల్లాలదేవ... బిజ్జలదేవ... కట్టప్ప... మళ్లీ కలిశారప్పా!

 bahubali team up  once again  with 1945  movie - Sakshi

మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టు బానిస ఎవరు? కట్టప్ప. కుట్ర, కుతంత్రాలతో మాహిష్మతి మహారాజుగా పట్టాభిషేకం చేసింది ఎవరు? భల్లాలదేవ. అతని తండ్రి బిజ్జలదేవ. మహారాజుఆజ్ఞలు శిరసావహించినా... భల్లాలదేవ, బిజ్జలదేవ అంటే కట్టప్పకు కోపమే. అటువంటి వ్యక్తులతో కట్టప్ప మళ్లీ చేతులు కలిపాడు! ఈ ముగ్గురూ మళ్లీ కలిశారు. అయితే... ఇదేదో‘బాహుబలి–3’ కథ అనుకుని ‘కటప్పా... ఇదేంటప్పా’ అనుకోవద్దు. అసలు విషయం ఏంటంటే... సత్యశివ దర్శకత్వంలో ‘1945’ అనే సినిమాలో రానా హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో బిజ్జలదేవ అలియాస్‌ నాజర్, కట్టప్ప అలియాస్‌ సత్యరాజ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వాళ్లిద్దరి పాత్రలు ఎలా ఉంటాయనేది సస్పెన్స్‌.కొన్ని రోజులుగా కొచ్చిలో జరుగుతున్న షూటింగులో ముగ్గురూ పాల్గొంటున్నారట! ‘ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ’ అని ఓ సినిమాలో హీరో హీరోయిన్లు పాడుకున్నట్టు... ‘ఎన్నెన్ని సినిమాల బంధమో మనది’ అని ముగ్గురూ పాడుకుంటున్నారేమో! ఇక్కడ మరో విశేషం ఏంటో తెలుసా? మొన్నటి ‘బాహుబలి’, ఇప్పుడీ ‘1 945’... రెండూ యుద్ధ నేపథ్యంలో సినిమాలే.

రాజులు, యుద్ధాల కథతో ‘బాహుబలి’ తెరకెక్కితే... రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో 1945లో జరిగిన ప్రేమకథగా ‘1945’ రూపొందుతోంది. ‘బాహుబలి’లో భల్లాలదేవ ప్రేమకథ సక్సెస్‌కాలేదు. ఎందుకంటే... విలన్‌ కదా! ‘1945’లో రానా హీరో. సో, ఈ ప్రేమకథకు హ్యాపీ ఎండింగే ఉంటుంది. కానీ, ఆ ప్రేమ యుద్ధం ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. ఇందులో రెజీనా హీరోయిన్‌. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను త్వరలో విడుదల చేస్తామని రానా పేర్కొన్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.

రానా రాయల్‌ రైడ్‌!
1945 కాలంనాటి కథతో సినిమా అంటే... సినిమాలో ప్రతి సీన్‌ 1945లో తీసినట్టుండాలి. అంటే... హీరో లుక్, హెయిర్‌ స్టైల్‌ దగ్గర్నుంచి హీరో ఉపయోగించే ప్రతి వస్తువూ, సినిమాలోకనిపించే ప్రతి ఏరియా 1945ను తలపించాలి. అందుకోసం చిత్రబృందం కృషి చేస్తుందనడానికి ఉదాహరణే... మీరు చూస్తున్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బండి. ‘1945’లో రానా రైడ్‌ చేయనున్న బండి ఇదే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top