అంతేనా.. ఎమీ?

Amy Jackson quits Queen south remakes for Supergirl - Sakshi

తమిళసినిమా: అంతేనా ఎమీ? కుదిరితే కొన్ని చిత్రాలు, అందులో మరికొన్ని రొమాన్స్‌ సీన్స్‌ అందించే అవకాశం ఉండదా? ఇది ఇంగ్లిష్‌ బ్యూటీ ఎమీజాక్సన్‌ గురించి ఆమె అభిమానుల అభిప్రాయం. ఇంతకీ ఏమిటీ ఎమీ గోల అనేగా మీ ఆసక్తి. మదరాసుపట్టణం చిత్రంతో కోలీవుడ్‌కు, ఇంకా చెప్పాలంటే భారతీయ వెండి తెరకు పరిచయమైన నటి ఎమీజాక్సన్‌. ఆ చిత్రం ఒక్కటే ఈ అమ్మడికి సరైన సక్సెస్‌ ఇచ్చింది. ఆ తరువాత బహుళ ప్రాచుర్యం పొందిన చిత్రం ‘ఐ’. ఆ చిత్రం ప్రేక్షకుల మధ్య మిశ్రమ ఆదరణ అందుకుంది. అయితే ఆ చిత్రంలో హద్దుల అంచుల వరకూ అందాలను ఆరబోసి అభిమానులను ఖుషీ పరిచింది. అందుకే  ఎమీ కోలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. అంతే కాదు కోలీవుడ్‌నే నమ్ముకుని ఇక్కడే మకాం పెట్టింది. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు జంటగా నటించిన 2.ఓ చిత్రంలో నటించింది.

ఈ చిత్రం కోసం రజనీకాంత్‌ సహా చిత్ర వర్గాలు, సినీ వర్గాలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎమీ కూడా 2.ఓ చిత్రం అందించే విజయం కోసం ఎదురు చూస్తోందని అందరూ అనుకుంటున్నారు. నిజమే ఇంతకు ముందు తనూ అలాంటి స్టేట్‌మెంటొకటి చేసింది. ఈ చిత్రం విజయం ఎమీకి చాలా అవసరం కూడా. ఎందుకంటే ఈ జాణకు చేతిలో ఏ భాషలోనూ ఒక్క చిత్రం కూడా లేదు. అయినా ఇలాంటివేవీ పట్టించుకోకుండా హాలీవుడ్‌ సూపర్‌ గర్ల్‌ సీరీస్‌లో నటించడానికి అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌కు పరిగెత్తింది. అంత వరకూ బాగానే ఉంది. అమ్మడు ఇక 2018 వరకూ ఇదే నా ఇల్లు అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి ఇండియన్‌ అభిమానులకు పెద్ద షాక్‌ ఇచ్చింది. దీంతో అంతేనా కుదిరినప్పుడైనా కోలీవుడ్‌లో కొన్ని చిత్రాలు లేదా సింగిల్‌ సాంగ్స్‌లో రొమాన్స్‌  చేసే అవకాశం లేదా అంటూ ఎమీ అభిమానులు ట్విట్టర్‌లో అడుగుతున్నారు. మరి వారి కోసం అయినా ఎమీ మనసు మార్చుకుంటుందో, లేదో చూడాలి.

Back to Top