'రిటైర్‌మెంట్‌ ఉద్యోగానికి మాత్రమే’

Actor Ali Attends his Friend Retirement Function in Hyderabad - Sakshi

సైబరాబాద్‌లో సినీ సందడి

రిటైర్‌మెంట్‌ ఫంక్షన్‌కు వచ్చిన ప్రముఖ నటుడు అలీ

రాచకొండ, సిటీల్లోనూ పలువురు పదవీ విరమణ

సాక్షి, సిటీబ్యూరో: నెలలో ఆఖరి పనిదినం కావడంతో బుధవారం మూడు కమిషనరేట్ల నుంచి పలువురు అధికారులు పదవీ విరమణ చేశారు. వీరిని కుటుంబీకులతో సహా కమిషనరేట్లకు పిలిపించిన ఉన్నతాధికారులు ఘనంగా సత్కరించారు. పోలీసు విభాగంలో సుదీర్ఘకాలం అంకితభావంతో పని చేసిన వారికి ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా తమను సంప్రదించవచ్చని హామీ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్‌లో 29 మంది, సైబరాబాద్‌లో నలుగురు, రాచకొండలో ఐదుగురు రిటైర్‌ అయ్యారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో జరిగిన కార్యక్రమానికి సినీ నటుడు అలీ స్పెషల్‌ గెస్ట్‌గా హాజరయ్యారు. అక్కడి సీఏఆర్‌ హెడ్‌–క్వార్టర్స్‌లో ఏసీపీగా పని చేస్తూ పదవీ విరమణ పొందిన జి.విద్యాసాగర్‌కు అలీ సన్నిహితుడు.

దీంతో ఆయన ఈ రిటైర్‌మెంట్‌ ఫంక్షన్‌కు స్వయంగా వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసులకు రిటైర్‌మెంట్‌ అనేది ఉద్యోగానికి మాత్రమే అని, ఎన్నేళ్ళయినా వారి గుండెల నిండా ధైర్యం, తెగువ, అంకితభావం మాత్రం అలానే ఉంటాయని అన్నారు. అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ సమాజాన్ని రక్షించడంలో నిమగ్నమై ఉండే  నాలుగో సింహమే పోలీస్‌ అని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగులు 30 ఇయర్స్‌ ఇన్‌ ఇండస్ట్రీ అయితే తాను 40 ఇయర్స్‌ ఇన్‌ ఇండస్ట్రీ అని అంటూ నవ్వించారు.  సినీ దర్శకుడు ముప్పలనేని శివ మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన వారు సైతం పోలీసు విభాగానికి అనుబంధంగా పని చేసే ఆస్కారం ఉందని అన్నారు. ప్రస్తుతం తాను 60వ వసంతంలోకి అడుగుపెట్టినా... జీవితంలో మంచి సినిమాలు తీయడం, గొప్ప నటులతో పనిచేయడం సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. వీరిద్దకీ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top