రజనీ అడిగినా ‘2.0’ చేయనన్నా! | Aamir Khan reveals he was offered Rajinikanth's role in 2.0 | Sakshi
Sakshi News home page

రజనీ అడిగినా ‘2.0’ చేయనన్నా!

Oct 20 2017 11:16 PM | Updated on Oct 21 2017 3:35 AM

Aamir Khan reveals he was offered Rajinikanth's role in 2.0

లడ్డూ లాంటి ఛాన్స్‌ చేతిదాకా వస్తే చటుక్కున లాగేసుకోవాలని ఎవరైనా అనుకుంటాం. లూస్‌ చేసుకుంటే లాస్‌ అవుతాం కదా! కానీ, ఆ లడ్డూ ఆఫర్‌కి మనం అర్హులమా? కాదా? అని ఆలోచించేవాళ్లు మాత్రం లాస్‌ గురించి ఆలోచించకుండా వదిలేసుకుంటారు. ఆమిర్‌ ఖాన్‌ అదే చేశారు. మరి... దాదాపు 400 కోట్ల సినిమాని వదులుకోవడం అంటే నటుడిగా నష్టమే కదా? రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ ‘2.0’ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.

‘‘ఈ సినిమాలో మీరు యాక్ట్‌ చేస్తే బాగుంటుంది’’అని ఆమిర్‌ ఖాన్‌కి స్వయంగా రజనీ ఫోన్‌ చేశారట. కానీ, ఆమిర్‌ చాలా వినయంగా ఆ అవకాశాన్ని తిరస్కరించారు. ఆయనకు ‘2.0’ స్క్రిప్ట్‌ మొత్తం తెలుసు. వసూళ్ల రికార్డులు బద్దలు కొడుతుందని కూడా అనుకున్నారట. మరి.. ఎందుకు చేయకూడదనుకున్నారో ఆమిర్‌ మాటల్లో తెలుసుకుందాం. ‘‘నిజానికి ‘2.0’ ప్లాన్‌ చేసినప్పుడు రజనీకి కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దాంతో ఆ సినిమా చేయలేనేమోననుకుని నన్ను చేయమన్నారు.

‘ఏ సమస్య ఉన్నా ఫర్వాలేదు.. మీరే చేయాలి’ అన్నాను. ఎందుకంటే, రజనీలా నేను మేజిక్‌ చేయలేను. ఆయనలా నేను యాక్ట్‌ చేయలేను. ఆ స్క్రిప్ట్‌ గురించి ఎప్పుడు తలుచుకుని కళ్లు మూసుకున్నా... నాకు రజనీయే కనిపించేవారు. దాంతో శంకర్‌ దగ్గర ‘నేను చేయలేను. ఈ సినిమా రజనీ మాత్రమే చేయగలరు’ అని చెప్పాను. నేను రజనీ అభిమానిని. ఫస్ట్‌ పార్ట్‌ (‘రోబో’) చూశాను. ఆయన అద్భుతంగా నటించారు. ఆ నటన నా మనసులో నాటుకుపోయింది. ‘2.0’ ఎన్ని భాషల్లో విడుదలైతే అన్ని భాషల్లోనూ సూపర్‌ హిట్‌ అవుతుంది’’ అని ఆమిర్‌ పేర్కొన్నారు. జనవరి 25న ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement