మహానటి కోసం.. ప్రత్యేకంగా

15 Karigars Worked For Eight Months For Savitri Biopic - Sakshi

అందం, అభినయానికి చిరునామా సావిత్రి. ఆమె విలక్షణ నటనకే కాదు.. ఆమె ధరించే దుస్తులు, నగలకు కూడా ఎంతో మంది అభిమానులు ఉంటారు. అటువంటి లెజండరీ నటి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రం విషయంలో.. ప్రతీ అంశంలోనూ ఎంతో జాగ్రత్త వహించారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. పాత్రధారుల ఎంపికకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో.. సావిత్రి పాత్ర పోషిస్తున్న కీర్తి సురేశ్‌ దుస్తులు, నగల విషయంలోనూ అంతే ప్రాధాన్యం ఇచ్చారు. సావిత్రి ధరించిన నగలను పోలిన డిజైన్లను రూపొందించడానికి ప్రత్యేకంగా డిజైనర్‌ను నియమించారు.

ఈ సినిమా కోసం ఢిల్లీలోని ఎల్‌ భజరంగ్‌ పెర్షాద్‌ జువెల్లరీస్‌కు చెందిన నవీన్‌ సింగ్లీ, ఆయన టీమ్‌ 8 నెలల పాటు కష్టపడ్డారట. సావిత్రి నగలను రీక్రియేట్‌ చేయడానికి ఆమె నటించిన మాయాబజార్‌, దేవదాస్‌, పెళ్లిచేసి చూడు, మిస్సమ్మ వంటి సినిమాలను రెఫరెన్స్‌గా తీసుకున్నామని నవీన్‌ సింగ్లీ తెలిపారు. 60 ఏళ్ల క్రితం నాటి చందమామ, సూర్యుడు, వడ్డాణం డిజైన్లను రూబీలతో రూపొందించామన్నారు సింగ్లీ. ఈ డిజైన్ల కోసం ప్రత్యేకంగా 15 మంది స్వర్ణకారులు పనిచేసినట్లు తెలిపారు.

బంగారం, కుందన్లు, వజ్రాలతో కూడిన నగలకు నగిషీలు దిద్దేందుకు ఐదుగురు చేతివృత్తి కళాకారులను ప్రత్యేకంగా నియమించామన్నారు. సుమారు 70 డిజైన్లను రూపొందించామని.. అందులో 35 డిజైన్లను దర్శకుడు ఫైనలైజ్‌ చేశారని డిజైనర్లు తెలిపారు. దుస్తులు, నగల ఎంపికలో వైవిధ్యంతో ప్రతీ వేడుకలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సావిత్రి వంటి మహానటి పాత్ర కోసం ఆభరణాలు తయారు చేయడం సవాలుగా భావించామని.. పర్ఫెక్షన్‌ కోసం ఆమె కుటుంబ సభ్యులను కూడా సంప్రదించామని నవీన్‌ సింగ్లీ తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top