వెలగని దీన్‌దయాల్‌

deen dayal yojana families are not getting power supply to homes - Sakshi

అందని విద్యుత్‌ మీటర్లు

కనెక్షన్ల మాట ఎరగని విద్యుత్‌ శాఖ

నెన్నెలలో 1066 దరఖాస్తులు

నెన్నెల : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీన్‌ దయాల్‌ యోజన పథకం ప్రచార ఆర్భాటంగానే మిగులుతోంది. దారిద్య్ర రేఖకు దిగువనున్న పేద కుటుంబాలకు విద్యుత్‌ వెలుగులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది. నిరుపేదలకు రూ.125కే మీటర్‌ అందించి విద్యుత్‌ సౌకర్యం కలిగించడం దీని ఉద్దేశ్యం. కానీ పథకంపై అధికారులు పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో దరఖాస్తులు చేసుకుని ఆరు నెలలు గడుస్తున్నా ఒక్క కనెక్షన్‌ కూడా అందించకపోవడం గమనార్హం.

 నెన్నెల మండలంలో 15 వేల జనాభా ఉంది. వారిలో దారిద్య్ర రేఖకు దిగువన సుమారు 40 శాతానికిపైగా ఉన్నారు. ఇంకా విద్యుత్‌ వెలుగులు నోచుకోని పేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దీనదయాల్‌ యోజన పథకం కింద నిరుపేద  కుటుంబాలకు ఆధార్‌కార్డు జిరాక్సుతో పాటు రూ.125 చెల్లిస్తే విద్యుత్‌ మీటర్‌ అందజేయాల్సి ఉంది. విద్యుత్‌ బోర్డు, బల్బ్‌ ఏర్పాటుకు హోల్డర్, ఎల్‌ఈడీ బల్బు, అవసరమైన చోట విద్యుత్‌ స్తంభం, విద్యుత్‌ వైర్లు ఏర్పాటు చేస్తారు. ఇలా ప్రచారం చేయడంతో నిరుపేదలు దరఖాస్తు చేసుకున్నారు. మండల వ్యాప్తంగా మొత్తం 1066 దరఖాస్తులు వచ్చాయి.
 
ఎదురుచూపుల్లోనే పేదలు...
పథకం కింద దరఖాస్తు చేసుకుని ఆరు నెలలు గడుస్తున్నా ఇంత వరకూ ఒక్క కనెక్షన్‌ కూడా అందించింది లేదు. అక్కడక్కడ విద్యుత్‌ శాఖ వారు స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. కానీ కనెక్షన్లు, కొత్త మీటర్ల ఊసెత్తడం లేదు. పథకంపై ఎటూ తేల్చకపోవడంతో దరఖాస్తుదార్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. స్తంభాలు ఏర్పాటు చేయడం పూర్తయ్యాక విద్యుత్‌ మీటర్లు అందిస్తామని ట్రాన్స్‌కో అధికారులు గతంలో పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ విషయంపై స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని నిరుపేదలు పేర్కొంటున్నారు. 

పైసలు కట్టించుకున్నరు 
కరెంట్‌ లేకపోవడంతో చీకట్లో పిల్లా, పాపలతో ఉంటున్నాం. అక్రమంగా కరెంట్‌ వేసుకుంటే కేసులు పెడతామని భయపెట్టారు. మాతో రూ.125 మీటర్‌ అని పైసలు కట్టించుకున్నారు. ఇంత వరకు మీటర్‌ జాడ లేదు. 
– అమర్, నెన్నెల 

త్వరలోనే అందజేస్తాం
దీన్‌ దయాల్‌ యోజన పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలో విద్యుత్‌ మీటర్లు ఏర్పాటు చేస్తాం. విద్యుత్‌ మీటర్లు, స్తంభాలు ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్టర్లకు అప్పగించాం. ప్రస్తుతం  స్తంభాలు ఏర్పాటు పనులు జరుగుతున్నాయి.   పనులు పూర్తయ్యాక మీటర్లను ఏర్పాటు చేస్తాం. 
– సదానందం, ట్రాన్స్‌కో ఏఈ(నెన్నెల)
 

Read latest Mancherial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top