డబ్బుకోసమే ఆమె నన్ను ప్రేమించింది!

Sunny Sad Ending Telugu Love Story Hyderabad - Sakshi

సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం మొదలైంది నా తొలిప్రేమ. తన పేరు లక్ష్మీ ప్రియ, మా దగ్గరి బంధువు! మరదలవుతుంది వరుసకు. మా ఇంట్లో ఫంక్షన్‌ జరుగుతుంటే మొదటిసారి చూశాను ప్రియని. చూడగానే నచ్చేసింది. తనతో మాట్లాడాలని, పరిచయం పెంచుకోవాలని ఉండేది. పెళ్లికాని అమ్మాయితో చనువుగా మాట్లాడితే బంధువులు ఏమనుకుంటారోనని ఆగిపోయేవాడిని. కానీ, వీలైనన్ని ఎక్కువసార్లు ఆమెను చూడటానికి ప్రయత్నించేవాడిని. ఎవరికీ అనుమానం రాకుండా ఫాలో అయ్యేవాడిని. నేను ఫాలో అవుతున్నట్లు ప్రియకు తెలిసిపోయింది. తనకూడా నన్ను చూసేది. ‘‘ఫంక్షన్లకు ఎంతో మంది బంధువులు వస్తుంటారు.. పోతుంటారు.. సన్నీగాడు లోకల్‌’ అనుకున్నా మనసులో. ధైర్యం చేసి మొదటిమాట మాట్లాడా‘ మీ అమ్మ పిలుస్తోంది’ అని. ఆ తర్వాత మరింత ధైర్యం తెచ్చుకుని మరో మూడు ముక్కలు మాట్లాడా.

మొదటిది తను టీ నా చేతికిచ్చినపుడు‘‘ థాంక్స్‌’’ అని.. రెండోది భోజనాల సమయంలో అన్నం ఎక్కువగా వడ్డిస్తోంటే.. ‘చాలు’ అని.. చివరగా ఫంక్షన్‌ అయిపోయి ఇంటికి వెళుతూ.. ‘వెళ్లోస్తాను’ అంటే సరేనని. ప్రియ వెళ్లిపోయిన తర్వాత నా మనసు మనసులో లేదు. ప్రతీరోజు తనగురించే ఆలోచించేవాడిని. అలాంటి సమయంలో ఓ రోజు తననుంచి ఫోన్‌ వచ్చింది. నేను మొదట గుర్తు పట్టలేదు. తర్వాత ప్రియ అని తెలిసి, ఊపిరి ఆడనంత పనైంది. ఎలాగోలా మాట్లాడటం మొదలుపెట్టాను. ఆ తర్వాతి నుంచి ప్రతిరోజూ నేను ఫోన్‌ చేసేవాడిని. కొద్దిరోజులకే మా మధ్య స్నేహం బలపడింది. మా రెండు కుటుంబాల ఫంక్షన్లనో తరచూ కలుసుకునేవాళ్లం. నా ప్రేమను ఎలా చెప్పాలా అనుకుంటున్న సమయంలో తనే నాకు ‘ఐ లవ్‌ యూ’ చెప్పింది. ఇక నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రేమలో నాలుగు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి.

ఈ నాలుగు సంవత్సరాలలో ఆర్థికంగా మా కుటుంబం బాగా వెనకబడిపోయింది. అక్కపెళ్లి చేయటంతో అప్పుల్లో కూరుకుపోయాం. వడ్డీలు కట్టడానికి ఉన్న పొలంలో చాలా భాగం అమ్మాల్సి వచ్చింది. బంధువులందరికీ ఈ విషయం తెలిసిపోయింది. తలో రకంగా అనుకోవటం మొదలుపెట్టారు. నేను ఎంబీఏ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డాను. ప్రియతో మాట్లాడటం తగ్గించేశాను. తను కూడా పెద్దగా నా గురించి పట్టించుకునేది కాదు! నేను ఫోన్‌ చేయకపోతే’ ఎందుకు ఫోన్‌ చేయలేదు’ అని అడిగేది కూడా కాదు. ఫోన్‌ చేసినపుడు మాత్రం బాగానే మాట్లాడేది. ఓ రోజు దూరపు చుట్టం ఒకరు మా ఇంటి కొచ్చాడు. మాటల సందర్భంలో ప్రియను తన కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. తను నన్ను కాదని వేరే వాడ్ని చేసుకోదనుకుని పెద్దగా పట్టించుకోలేదు. మేము మాట్లాడుకుంటున్నపుడు ఈ విషయాన్ని ప్రస్తావించలేదు.

కొన్ని రోజుల తర్వాత తనకు పెళ్లి నిశ్చయమైనట్లు తెలిసింది. తనను అడిగితే అలాంటిదేమీ లేదంది. ఆ కొద్దిరోజులకే ప్రియ నిశ్చితార్థానికి మా కుటుంబానికి పిలుపొచ్చింది. నా దిమ్మతిరిగిపోయింది. షాక్‌నుంచి తేరుకోవటానికి చాలా సమయం పట్టింది. వెంటనే తనకు ఫోన్‌ చేశాను. స్విచ్ఛాఫ్‌ వచ్చింది. నిశ్ఛితార్థం అయిపోయిన తర్వాత ఫోన్‌ కలిసింది. నిశ్చితార్థం గురించి అడిగా..సరిగా స్పందించలేదు. క్యాన్సిల్‌ చేసుకోమన్నాను. ‘‘ నీతో కలిసి రోడ్డుమీద అడుక్కుతినమంటావా’’ అంది. నాకేం అర్థం కాలేదు. ఏంటని అడిగా.. ‘‘ ఉన్న ఆస్తి పోయింది. నువ్వే ఇప్పుడు ఉద్యోగం కోసం రోడ్లు పట్టుకు తిరుగుతున్నావు. నేను మీ ఇంట్లో అడుగుపెట్టి సంతోషంగా ఎలా ఉండగలను. నన్ను అర్థం చేసుకో! ఇకపై ఫోన్లు చేయటం మానేయ్‌’’ అని ఫోన్‌ కట్‌ చేసింది. నా మనసు ముక్కలైంది.
- సన్నీ, హైదరాబాద్‌

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top