అన్నయ్యా అంది.. కళ్లల్లో నీళ్లు తిరిగాయ్‌!

Love Stories In Telugu : Satish Sad Love Visakhapatnam - Sakshi

మాది విశాఖ జిల్లా నర్సీపట్నం పక్కన ఒక విలేజ్. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు డైలీ కాలేజ్‌కి బస్‌లో వెళ్లేవాడిని. రోజూ లాగానే ఆ రోజు కూడా కాలేజ్ అయిపోయాక బస్‌లో ఇంటికి వెళ్తున్నా. నా పక్కన సీట్‌లో ఇద్దరు అమ్మాయిలు కూర్చుని ఉన్నారు. అందులో ఒక అమ్మాయి వాళ్ల ఊరు వచ్చిందని దిగిపోయింది. దిగుతున్నపుడు తన ఫొటోస్ బ్యాగ్ నుండి కింద పడిపోయాయి. నేను అవి చూసి తన ఫ్రెండ్‌కు ఇవ్వటానికి ఆమెను పిలిచాను. నేను నిజంగా సర్‌ప్రైజ్‌ అయ్యాను. తను చాలా అందంగా ఉంది. కొంత సేపు తనని అలానే చూస్తూ వుండిపోయాను. తనే గట్టిగా పిలిచి ‘ఏమైంది’ అని అడిగి నవ్వుకుంది. నేను తన ఫ్రెండ్ ఫొటోస్ చూపించి ‘నీ పక్కన కూర్చున్న అమ్మాయి ఫొటోస్’ అని అన్నాను. తను అవి తీసుకుని థాంక్స్ చెప్పి వెళ్లిపోయింది. ఆ రోజంతా తనే గుర్తుకు వచ్చింది. ఆ తర్వాత రోజు సండే కాలేజెస్ సెలవు! సోమవారం తనకోసం చాలా వెతికాను కానీ, కనిపించలేదు. ఒక వారం రోజుల తర్వాత మళ్లీ బస్‌లో కనిపించింది.

తనతో మాట్లాడాలని అనిపించేది. కానీ, ఎందుకో భయం వేసి మాట్లాడలేకపోయాను. ఆ తర్వాత తను నాకు కనిపించలేదు. ఒకరోజు నా ఫ్రెండ్ తన లవర్ కోసం బస్ స్టాప్‌లో ఎదురుచూస్తుంటే నేను వాడికి తోడుగా ఉన్నాను. వాడు తన లవర్‌తో మాట్లాడుతుంటే నేను కొంచెం దూరంగా వెళ్లి నుంచున్నాను. నా ఫ్రెండ్ లవర్‌తో పాటు నేను బస్‌లో చూసిన అమ్మాయి కూడా వచ్చింది. ఇద్దరిదీ ఒకే ఉరంట. వరసకి అక్కాచెల్లెళ్లు అవుతారంట. కానీ నా ఫ్రెండ్ నాకు విలేజ్‌లో బావ అవుతాడు. నేను వాడిని కావాలనే తన ముందు అన్నయ్యా అని పిలిచే వాడిని. అప్పటి నుండి నేను కూడా నా ఫ్రెండ్‌తో పాటు వాళ్ల కోసం వెయిట్ చేసేవాడిని. నా ఫ్రెండ్ వాడి లవర్ ఒకే సీట్‌లో కూర్చునేవారు. తప్పక తను నా పక్కన కూర్చునేది. కానీ ఏమీ మాట్లాడేది కాదు. వాళ్ల ఊరికి బస్‌లు ఉండవు. ఊరికి ఐదు కిమీ దూరంలో బస్ దిగేసి ఆటోకి వెళ్లాలి. ఉదయం టైమ్‌లో నేను నా ఫ్రెండ్ త్వరగా వాళ్లు బస్ ఎక్కే ఊరు వెళ్లి వాళ్ల కోసం వెయిట్ చేసేవాళ్లం.

అలా తనతో పాటు బస్‌లో వెళ్లి రావటం నాకు అలవాటైంది. తను ఒక్క రోజు కనిపించకపోయినా వాళ్ల సిస్టర్‌ని ఏదో ఒక విధంగా తన గురించి అడిగే వాడిని. వాళ్ల సిస్టర్(నా ఫ్రెండ్ లవర్)కి నాపైన డౌట్ వచ్చి వాడిని అడిగితే నేను తనని లవ్ చేస్తున్నట్టు చెప్పేశాడు. కానీ తను వాళ్ల సిస్టర్‌కి చెప్పలేదు. ఆ రోజు జనవరి ఒకటవ తేది! నా చెల్లి అపుడు పదవ తరగతి చదువుతోంది. వాళ్ల ఫ్రెండ్ పుట్టినరోజంటే నేను మా చెల్లిని తీసుకుని వాళ్ల ఊరు వెళ్లాను. లక్కీగా చెల్లి వాళ్ల ఫ్రెండ్ ఊరు నేను లవ్ చేస్తున్న అమ్మాయి ఊరు ఒకటే. తను కనిపిస్తుందేమోనని చాలా సంతోషంతో వెళ్లాను. చెల్లిని వాళ్ల ఫ్రెండ్ ఇంట్లో దింపేసి తను కనిపించేంత వరకు ఆ ఊరంతా ఒక రౌండ్ వెయ్యాలని అనుకున్నాను. చెల్లి వాళ్ల ఫ్రెండ్ ఇంటికి వెళ్లాము. అక్కడ నేను షాక్ అయ్యాను. చెల్లి ఫ్రెండ్ వాళ్ల సిస్టర్ నా లవర్ ఒక్క అమ్మాయే. నేను చాలా ఆనందపడ్డా. చెల్లికి థాంక్స్ చెప్పుకున్నా. అక్కడ చాలా సేపు ఉన్నాము. తను నాకు డ్రింక్ తెచ్చి ఇస్తూ ‘తీసుకో అన్నయ్యా’ అంది.

నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. 5 నిమిషాల తర్వాత అక్కడ నుండి చెల్లిని తీసుకుని వచ్చేశాను. ఆ తర్వాత తనకి కనిపించలేదు. ఒకవేళ కనిపించినా తప్పించుకుని తిరిగేవాడిని. తను నా ఫ్రెండ్‌ని అడిగిందంట నేను ఎందుకు కనిపించటం లేదని. ‘నువ్వు అన్నయ్య అన్నావు కదా! అందుకే వాడు చాలా బాధ పడుతున్నాడు’ అన్నాడంట తనతో. ఆ తర్వాత మేము ఒకరికి ఒకరం ఎదురుపడలేదు. ఒక నెల రోజుల తర్వాత నేను కాలేజ్ అయ్యాక ఫ్రెండ్స్‌తో కలిసి ఫస్ట్ షో సినిమాకి వెళ్లాను. సినిమా అయిపోయాక బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. తనకి ఆ రోజు ప్రాక్టికల్స్ అంట చాలా లేట్ అయిపోయారు. తను వాళ్ల ఫ్రెండ్ వచ్చారు. బస్‌లు చాలా  సేపు రాలేదు. వాళ్లు చాలా కంగారు పడుతున్నారు. బస్‌లు వస్తున్నాయి కానీ, అస్సలు కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండేది కాదు. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్లిపోయారు. కానీ నేను తనకి బాగా లేట్ అయ్యింది కదా తను వెళ్లిన తరువాత వెళ్దాం అని ఉండిపోయాను.

బస్ వచ్చింది! నేను ముందుగా ఎక్కి సీట్‌లో కూర్చున్నాను. తన ఫ్రెండ్‌ని పిలిచి నేను కూర్చున్న సీట్లో కూర్చోమని చెప్పి నేను ఇంకొక దగ్గర నుంచున్నాను. వాళ్ల పక్కన ఇంకొకరు కూర్చోవటానికి ప్లేస్ ఉంది. కానీ, నేను కూర్చోలేదు నుంచున్నా. బస్ స్టార్ట్ అయిన తరువాత కొందరు అబ్బాయిలు వచ్చి వాళ్ల సీట్లో కూర్చోవటానికి చూస్తున్నారు. అప్పుడు తను వాళ్ల ఫ్రెండ్‌తో చెప్పి, నన్ను సీట్లో కూర్చోవటం కోసం పిలిపించింది. నాకు పరిస్థితి అర్థమై కూర్చున్నాను. కానీ ఎవరితోనూ మాట్లాడలేదు. మొబైల్‌లో సాంగ్స్ వింటున్నా. అపుడు వాళ్ల ఫ్రెండ్ ‘అన్నయ్యా! సాంగ్స్ మేము కూడా వింటాము.’ అని చెప్పింది. అపుడు నేను నా మొబైల్ వాళ్లకి ఇచ్చేసి సైలెంట్‌గా కూర్చున్నా. టైమ్ 9:30 అయ్యింది. వాళ్ల ఊరికి ఆటోలు వుంటాయో ఉండవో అని నేను కూడా తనతో పాటు తను దిగే స్టాప్‌లో దిగిపొయాను. ఎందుకైనా మంచిదని నా ఫ్రెండ్‌కి కాల్ చేసి బైక్ తెప్పించాను. తను ఆటో కోసం వెయిట్ చేస్తోంది.

నేను వేరే చోట నుంచొని ఉన్నాను. కాసేపటికి నా ఫ్రెండ్ వచ్చాడు. చాలా టైమ్ తర్వాత ఆటో వస్తే తను ఎక్కింది. నేను నా ఫ్రెండ్ ఆటోని ఫాలో అవుతూ వెళ్లాము. ఊరిలో తను దిగేవరకు ఉన్నాము. తరువాత ఒకరోజు నాకో నెంబర్‌నుంచి కాల్ వచ్చింది. తీరా చూస్తే అది తనే. చాలా రోజుల నుండి నా కోసం చూస్తుంది కానీ నేను కనిపించలేదు అని చెప్పింది. నేను చాలా సంతోష పడ్డాను. ఆఖరికి వాళ్ల చెల్లికి జరిగిందంతా చెప్పి నా నెంబర్ మా చెల్లి దగ్గర తీసుకుని కాల్ చేసిందంట. ఆ రోజు చాలా మాట్లాడుకున్నాము. అప్పటినుండి అప్పుడప్పుడు కాల్స్. డైలీ బస్‌లో మీట్ అవ్వటం చేసేవాళ్లం. తన ఇంటర్ ఎక్షామ్స్‌ అయిపోయాయి. సమ్మర్‌లో తననుండి ఒక్క కాల్ కూడా రాలేదు. నాకు పిచ్చెక్కేది. సమ్మర్ నాకు చాలా కష్టంగా గడిచింది. తర్వాత మళ్లీ కాలేజీలు స్టార్ట్ అయ్యాయి. తనని కలిసి అడిగాను ‘ఇన్ని రోజులు ఎందుకు ఫోన్ చేయలేదు’ అని. అప్పుడు తను చెప్పింది ‘మా ఫోన్ పాడైంది.

నెంబర్స్ పోయాయ్! అందుకే కాల్ చేయడానికి అవ్వలేదు’ అని. అప్పుడు తను తన కొత్త నెంబర్ నాకిచ్చింది. అప్పటి నుండి మేము డైలీ ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లం. ఒకరోజు ధైర్యం చేసి తనను ప్రేమిస్తున్న విషయం చెప్పేశాను. తను లవ్‌పైన ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. అయినా కానీ నేను తనతో మాట్లాడేవాడిని చాలా రోజుల తర్వాత తను నా ప్రేమను ఒప్పుకుంది. అప్పటినుండి మా ప్రేమ, నా లైఫ్ చాలా సంతోషంగా ఉండేది. అలా మా ప్రేమ నాలుగు సంవత్సరాలు కొనసాగింది. మా ప్రేమ విషయం తను వాళ్ల అమ్మకు కూడా చెప్పింది. వాళ్ల అమ్మ కూడా మా ప్రేమను ఒప్పుకుంది. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను పీజీ చేయడం కోసం వైజాగ్ వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఒకరోజు తను  కాల్ చేసి ‘నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఏం చేయమంటావు’ అని అడిగింది. ‘ఓ రెండు సంవత్సరాలు వేయిట్‌ చెయ్! ఈ లోపు నా చదువు పూర్తవుతుంది. జాబ్ రాగానే పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పాను.

కానీ తను ‘ఇంట్లో ఒత్తిడి చేస్తున్నారు. ఈ సంవత్సరమే చేసుకోవాలి’ అని చెప్పింది. కానీ ఇంట్లో బాధ్యతల వల్ల చేసుకోలేనని చెప్పాను. ఎందుకంటే నేను నా చెల్లి పెళ్లి చేయాలి. ఆ తర్వాత నేను చేసుకోవాలి. అలా కాదని నేనే ముందు పెళ్లి చేసుకుంటే మా ఫ్యామిలీ ఇబ్బందులు పడాల్సి వస్తుందని తనతో చెప్పాను. కానీ తను ఆ టైంలో నన్ను అర్థం చేసుకోలేదు. నాకు ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు. అప్పుడు నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయాను. వారం రోజుల తర్వాత కాల్ చేసి ‘నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. రెండు నెలల్లో మ్యారేజ్’ అని చెప్పింది. నేను ఏమీ చేయలేక అలా ఉండి పోయాను. తన పెళ్లి అయిపోయింది. ఇప్పుడు నాకు మంచి జాబ్ వచ్చింది. జీతం వచ్చే జాబ్‌ ఉంది కానీ, జీవితం ఇచ్చే ప్రేమ లేదు. నేను తనను చాలా మిస్ అవుతున్నాను. తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. అదే నేను కోరుకునేది మిస్ యు బుజ్జి ఐ మిస్ యు సో మచ్! ఐ లవ్ యు...
నిన్ను ఎంతగానో ప్రేమించే
- సతీష్


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top