అతడి సమాధి ఓ చివరి ప్రేమలేఖలా.. | John Keats And Fanny Drawe Love Story | Sakshi
Sakshi News home page

అతడి సమాధి ఓ చివరి ప్రేమలేఖలా..

Oct 23 2019 4:16 PM | Updated on Oct 24 2019 11:17 AM

John Keats And Fanny Drawe Love Story - Sakshi

బ్రైట్‌ స్టార్‌ సినిమాలోని ఓ దృశ్యం

ఒకరిని వదల్లేక ఒకరు అల్లాడారు. తప్పనిసరై బై చెప్పుకున్నారు...

తన కవితల ద్వారా ప్రపంచానికి ప్రేమను దగ్గర చేసిన కవి జాన్ కీట్స్. కానీ అతని దరికి ‘ప్రేమ’ చేరడానికి మాత్రం చాలా కాలమే పట్టింది. కీట్స్ ఎనిమిదో ఏట అతని తండ్రి చనిపోయాడు. తల్లి ప్రేమలో తలమునకలై... అమ్మచాటు బిడ్డగా బతుకుతున్న కీట్స్‌ను విధి మరోసారి చిన్నచూపు చూసింది. పద్నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు అతణ్ని వదిలి తల్లి కూడా వెళ్లిపోయింది. పొరుగింటి డాక్టర్ కీట్స్‌ను ఓదార్చాడు. ఏదైనా పనిలో పడితే గానీ దుఃఖం నుంచి తేరుకోడనే ఉద్దేశంతో తన దగ్గర అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడు. ‘గయ్స్ హాస్పిటల్’లో పని చేస్తున్నా డన్న మాటేగానీ కీట్స్ మనసు ఎక్కడో ఏకాంత దీవిలో తచ్చాడేది. ఆ దీవిలో తాను పుంఖాను పుంఖాలుగా  కవిత్వం రాస్తున్నట్లు కలగనేవాడు. ఆ కలలు నిజమయ్యాయి. కీట్స్ రాసిన ‘ఒ సాలిట్యూడ్’ కవిత అచ్చయింది. ఆ తర్వాత మరికొన్ని. అయితే అతడి కవితలు అచ్చవుతున్న కాలంలో సాహితీ విమర్శకుల నుంచి ప్రశంసల చిరుజల్లుల  కంటే విమర్శల జడివానే ఎక్కువ కురిసింది.

ఆ బాధలో ఉన్నప్పుడే తమ్ముడు చనిపోయాడు. నరాల్లో రక్తానికి బదులు బాధ ప్రవహిస్తున్నట్లుగా ఉంది. తన ఇంటిని ఖాళీ చేసి లండన్‌లోని ప్రశాంత ప్రాంతమైన హేత్‌కు వెళ్లిపోయి స్నేహితుడి రూమ్‌లో ఉన్నాడు. పక్కింటి అమ్మాయిగా అక్కడే పరిచయం అయింది ఫ్యానీ బ్రాన్!  కవిత్వం వారిద్దరినీ దగ్గర చేసింది. దాంతో ఓ కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాడు కీట్స్. ఆ ప్రపంచంలో మునుపటి చీకటి, దుఃఖం లేవు. వెన్నెల వెలుగులు, తేనె జలపాతాలు ఉన్నాయి. మనసు సహ కరించినప్పుడు గానీ కవిత్వం రాసేవాడు కాదు ఒకప్పుడు. తేజోమయమైన మన సుతో రోజూ రాస్తున్నాడు ఇప్పుడు. కవిత్వమే కాదు... ప్రేమలేఖలూ రాస్తు న్నాడు. తన లోని సృజనశక్తి రెట్టింపయి నట్లు అనిపించింది. ప్రేమకున్న శక్తి అదే! కీట్స్... ప్రతి రోజులో ఒక కొత్త రోజును చూస్తున్న రోజులవి. అలాంటప్పుడు ఓ రోజు మృత్యువు తన చుట్టు పక్కలే కదలాడటం గమనించాడు కీట్స్. ఉన్నట్టుండి విపరీతంగా దగ్గు వచ్చింది.

జాన్ కీట్స్, ఫ్యానీ బ్రాన్
నోట్లో నుంచి రక్తం పడింది. కొన్ని రోజులు వైద్యం నేర్చుకున్న కీట్స్‌కి  ఆ రక్తంలో ఏదో తేడా కనిపించింది. చివరికి ఆయన ఊహించిందే జరిగింది. ‘నీకు టీబీ సోకింది’ అని చెప్పారు డాక్టర్లు. తన దగ్గర ఉన్న అపూర్వమైన నిధిని అకస్మాత్తుగా ఎవరో దొంగిలించినట్లు అనిపించింది కీట్స్‌కి. అయినా మౌనంగా ఆ బాధను భరించాడు. కొన్ని రోజుల తరువాత పరిస్థితి విషమించింది. శరీరం కుంగిపోతోంది. మనసు అంతకంటే కుంగిపోతోంది. ‘లోకాన్ని విడిచి వెళ్లడానికి భయం లేదు. ఆమెను విడిచి వెళ్లడానికి మాత్రం భరించలేనంత బాధగా, భయంగా ఉంది’ అంటూ తన మిత్రుడికి లేఖ రాశాడు. ఫ్యానీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. మనసులో అగ్ని పర్వతాలు బద్ద లవుతున్నా, బాధ చివ్వున ఎగజిమ్ము తున్నా తట్టుకుని కీట్స్‌కు సపర్యలు చేస్తోంది. అంతలో కీట్స్ మిత్రుడు జోసెఫ్ సోవెర్న్ వచ్చాడు. మెరుగైన చికిత్స కోసం కీట్స్‌ను ఇటలీకి తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడు. ఓడ ఎక్కేముందు ప్రేమికులిద్దరూ తృప్తిగా మాట్లాడుకున్నారు.

‘నీ కోసం మళ్లీ బతుకుతాను’ అన్నాడు కీట్స్. ‘నా కోసం బతకాలి’ అని అర్థించింది ఫ్యానీ. ఒకరిని వదల్లేక ఒకరు అల్లాడారు. తప్పనిసరై బై చెప్పుకున్నారు. ఇటలీకి వెళ్లిన కొంత కాలానికి కీట్స్ ఆరోగ్యం విషమించింది. పాతికేళ్ల వయసులో లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. రోమ్‌లోని ప్రొటెస్టెంట్ సిమెట్రీలోని సమాధిలో చేరిపోయాడు. ఆ నిలువెత్తు సమాధి ఫలకాన్ని చూస్తే... ఫ్యానీ కోసం అతడు రాసిన చివరి ప్రేమలేఖలా కనిపిస్తుంటుంది! కీట్స్, ఫ్యానీల ప్రేమకథను ‘బ్రైట్ స్టార్’ (2009) పేరుతో తెరకెక్కించారు న్యూజిలాండ్ దర్శకురాలు ఎలిజబెత్ జెన్ క్యాంపియన్. లండన్‌కు చెందిన కవి, నవలా రచయిత ఆండ్రూ మోషన్ రాసిన కీట్స్ జీవితచరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ  సినిమా విడుదల సమయంలో ప్రసిద్ధ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ‘బ్రైట్‌స్టార్: లవ్ లెటర్స్ అండ్ పొయెమ్స్ ఆఫ్ జాన్ కీట్స్ టు ఫ్యానీ బ్రాన్’ పేరుతో 144 పేజీల పుస్తకాన్ని ప్రచురించింది.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement