‘గుడ్డిదాన్ని చేసుకొని ఏం సుఖపడతావు?’ | Joan And Dave Great Love Story | Sakshi
Sakshi News home page

జోయెన్, డేవ్‌ ప్రేమ కథ

Oct 11 2019 12:02 PM | Updated on Oct 11 2019 12:02 PM

Joan And Dave Great Love Story - Sakshi

 ‘నా కళ్లు నీ కళ్లతో లోకాన్ని చూస్తున్నాయి.
 నా గుండె నీ గుండె చాటు ప్రేమసవ్వడి అయ్యింది!’

హై-ఫ్లయింగ్ బిజినెస్ ఉమెన్‌గా తన కెరీర్‌తో సంతృప్తిగా, సంతోషంగా ఉంది జోయెన్. సింగపూర్, హాంకాంగ్, ఆస్ట్రేలియా... ఎన్నో దేశాలు తిరిగింది. ‘ఇక తిరిగింది చాలు’ అనుకొని లండన్‌లో ‘మార్కెటింగ్ ఏజెన్సీ’ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో... విధి తనను వెక్కిరించింది. టైప్ 1 డయాబెటిస్‌తో ముప్ఫై నాలుగో ఏట కంటి చూపును కోల్పోయింది. జోయెన్ లోకం ఒక్కసారిగా చీకటిమయమైపోయింది. ఏ రంగూ, ఏ రూపం కనిపించని శూన్యప్రపంచంలోకి దీనంగా వెళ్లిపోయింది.
 
అయితే అప్పుడప్పుడూ ఆ శూన్యంలో నుంచి కొన్ని నవ్వులు వినిపించేవి. అందుకు కారణం చిన్ననాటి స్నేహితుడు డేవ్. తనని గుర్తు చేసుకుంటే చాలు, ఆమె మనసులో ఆనందాల మల్లెలు పూస్తాయి. తను ఎక్కడుంటే అక్కడ సందడి. నవ్వుల కోలాహలం. అలాంటి వాడి దగ్గర ఒక గంట గడిపినా చాలు, జీవనోత్సాహం ఇంద్రధనుస్సై వెల్లి విరుస్తుంది. అయితే కెరీర్ వేటలో ఎవరి బతుకులు వారివయ్యాయి. కానీ ఇప్పుడు ఈ ఒంటరితనంలో మళ్లీ మళ్లీ గుర్తుకు వస్తున్నాడు డేవ్. జోయెన్ గురించి తెలిసి ఆమె ఇంటికి వచ్చాడు డేవ్. ఎన్నో రకాలుగా ఆమెకు ధైర్యం చెప్పాడు. చాలాసేపు నవ్వించాడు.

 కొండలా భారంగా ఉన్న ఆమె మనసు దూదిపింజలా తేలిపోయింది. అన్ని కష్టాలూ నాకే అన్నట్లుగా అలిగిన మనసు ఆహ్లాదపు రెక్కలు తొడుక్కుని తేలియాడింది. ‘‘డేవ్... మళ్లీ ఎప్పుడు వస్తావు?’’  వెళుతున్న  డేవ్‌ను అడిగింది జోయెన్. ‘‘ఎప్పుడూ వస్తూనే ఉంటాను’’ అని చెప్పి ఆమె దగ్గర సెలవు తీసుకున్నాడు డేవ్. ఇచ్చిన మాట తప్పలేదు. ఏ మాత్రం వీలున్నా వచ్చి జోయెన్‌ను కలిసేవాడు. తన తమ్ముడి బర్త్‌డే వేడుకకు ఆమెను ముఖ్య అతిథిగా పిలిచాడు. ‘‘నా బాల్య స్నేహితురాలు’’ అని అక్కడ అందరికీ పరిచయం చేశాడు. ఒక రోజు ఉన్నట్టుండి... ‘‘నేను  నిన్ను పెళ్లి చేసుకోవాలను కుంటున్నాను....’’ అన్నాడు.

 ‘‘ఇప్పటి వరకూ నువ్వు చెప్పిన అన్ని జోకుల కంటే ఇదే పెద్ద జోక్’’ అని బిగ్గరగా నవ్వింది జోయెన్. కానీ ఆ నవ్వులో ఎక్కడో దుఃఖపు జీర! కళ్లలో కనిపించని కన్నీళ్లు!! ‘‘మనస్ఫూర్తిగా చెబుతున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’’ గంభీరంగా అన్నాడు డేవ్. ‘‘ఈ గుడ్డిదాన్ని చేసుకొని ఏం సుఖపడతావు?’’ అంది జోయెన్. ఆమె నోటికి తన చేతిని అడ్డుపెట్టి- ‘‘ఇంకెప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడవద్దు’’ అన్నాడు. తర్వాత కొద్దిరోజుల్లోనే వారి పెళ్లి ఘనంగా జరిగింది. చూపులేని జోయెన్‌కు డేవ్ చుక్కాని అయ్యాడు.  ఒక ద్వారం మూసిన దేవుడు ఎక్కడో ఒకచోట మరో ద్వారాన్ని తెరిచే ఉంచుతాడట. డేవ్ రూపంలో దేవుడు ఆమెకు కొత్త ద్వారం ఒకటి తెరిచి ఉంచాడు. ఆమె మనో ప్రపంచంలోని ప్రతి దృశ్యం ఇప్పుడు ఆ ద్వారం గుండా కనిపిస్తోంది.  


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement