కొందరికే కనెక్షన్‌! | Sakshi
Sakshi News home page

కొందరికే కనెక్షన్‌!

Published Tue, Feb 13 2018 11:49 AM

conditions in Free electricity connections

రాష్ట్ర ప్రభుత్వం  రైతులకు షాక్‌ ఇవ్వనుంది. బోరుబావులకు నూతన విద్యుత్‌ కనెక్షన్ల మంజూరులో  కొత్త మెలిక పెట్టింది. విద్యుత్‌ స్తంభాలు అవసరం లేని వారికే కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. మరి మిగిలిన రైతుల పరిస్థితి ఎలా అనే దానిపై  స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకుని కనెక్షన్‌ కోసం ఎదురుచూస్తున్న వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు):   తెలుగుదేశం ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను భారంగా భావిస్తోంది. వీలైనంత వరకు దాని   నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయి. అందులో భాగంగానే 2017  సెప్టెంబర్‌ నుంచి కొత్త కనెక్షన్ల మంజూరుపై నిషేధం విధించింది. 2015–16, 2016–17 ఆర్థిక సంవత్సరాల్లో  మొత్తం 17 వేల మంది రైతులకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చింది. 

రైతుల ఒత్తిడి అధికమవడంతో...
ఉచిత విద్యుత్‌ కనెక్షన్‌ కోసం జిల్లాలో 12856 మంది రైతులు రూ.5500 డీడీ కట్టి దరఖాస్తు  చేసుకున్నారు. వీరిలో  రెండు, మూడేళ్లు కిత్రం దరఖాస్తు చేసుకున్న వారూ ఉన్నారు. చాలామంది బోరు బావి, ఇతర ఖర్చుల కోసం రూ.1.50 లక్ష వరకు ఖర్చు చేసి విద్యుత్‌ కనెక్షన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఒక పక్క బోరు వేయించేందుకు చేసిన అప్పులకు  వడ్డీల మీద వడ్డీ పెరిగిపోతోంది. అయినా, సర్కారు పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో రైతుల్లో అసహనం అధికమైంది. 

ఈ పరిస్థితుల్లో  నూతన విద్యుత్‌ కనెక్షన్లపై ఉన్న బ్యాన్‌ను ఎత్తివేయకపోతే మరింత ప్రమాదంలో పడతామని భావించిన సర్కారు  కొత్త ఎత్తుగడ వేసింది.  విద్యుత్‌ స్తంభాలు అవసరం లేనివి, తప్పనిసరి అయితే ఒకటి, రెండు, మూడు  స్తంభాలు అవసరం ఉన్న బోరుబావులకు మాత్రమే  కనెక్షన్లను మంజూరు చేయనుంది.   అందులో భాగంగా జిల్లాలో స్తంభాలు అవసరంలేని కనెక్షన్లు 2199, ఒకటి, రెండు, మూడు పోళ్లు అవసరం ఉన్నవి 1021 ఉన్నట్లు గుర్తించారు. వాటికి మత్రమే కొత్త కనెక్షన్లను ఇచ్చేందుకు  రాష్ట్ర ప్రభుత్వానికి  ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మిగిలిన 9636 మంది రైతుల పరిస్థితి ఏమిటనేది అర్థం కావడం లేదు.  

3220 కనెక్షన్లకు ప్రతిపాదనలు పంపాం
ఇటీవల రాష్ట్రం ప్రభుత్వం విద్యుత్‌ స్తంభాలు అవసరం లేనివి, ఒకటి, రెండు పోళ్లు అవసరం ఉన్న కనెక్షన్ల వివరాలు పంపాం. ఒకటి, రెండు నెలల్లో మంజూరయ్యే అవకాశం ఉంది. జిల్లాకు మొత్తం 3220 మంది రైతులకు కొత్త కనెక్షన్లు వస్తాయి. మిగిలిన రైతుల పరిస్థితిపై ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాలి. – భార్గవ రాముడు, ఎస్‌ఈ

కనెక్షన్‌కు దరఖాస్తు చేసి ఏడాదైంది
ఏడాది క్రితం నా పొలంలో మూడు బోర్లు వేయించా. ఒకదానిలో మాత్రమే మంచి నీళ్లు పడ్డాయి. దాదాపు లక్షన్నర ఖర్చు అయింది. అప్పుడే కరెంట్‌ కోసం రూ.7వేలు ఖర్చు చేసి దరఖాస్తు చేశా. అప్పటి నుంచి కరెంట్‌ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా. అధికారులెవరూ స్పందించడంలేదు. ఒకవైపు అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు.. – నాగరాజు, పొట్లపాడు

Advertisement
Advertisement