రేపే పల్స్‌ పోలియో..

Tomorrow Pulse Polio Vaccine In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం వైద్యవిభాగం: జిల్లాలో ఈనెల 10వ తేదీన నిర్వహించే పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ కళావతిబాయి పిలుపునిచ్చారు. శుక్రవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 0–5 ఏళ్లలోపు 1,27,887 మంది పిల్లలను గుర్తించామని, వారందరికీ ఆదివారం పోలియో చుక్కలు వేయిస్తామన్నారు. అందుకోసం 8,500 వయల్స్‌ను సిద్ధం చేశామన్నారు.

గిరిజన ప్రాంతాల్లో 123, పట్టణ ప్రాంతాల్లో› 105, గ్రామీణ ప్రాంతాల్లో 672 పోలియో చుక్కలు వేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు 3,600 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. మైగ్రేటెడ్‌ ప్రజల కోసం ఆయా ప్రాంతాల్లో పల్స్‌ పోలియో చుక్కలు వేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. మురికి వాడల్లో పిల్లల కోసం సంచార వాహనాల ద్వారా పోలియో చుక్కలు వేస్తామన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చుక్కలు వేసే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. 11, 12వ తేదీల్లో ఇంటింటికీ తిరిగి మిగిలిన పిల్లలను గుర్తించి.. వారికి చుక్కలు వేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తామన్నారు.

ప్రయాణంలో ఉన్న వారి కోసం బస్, రైల్వే స్టేషన్లలో పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశామని, అలాగే నిర్మాణ స్థలాల్లో తాత్కాలికంగా నివసించే వారి కొరకు సంచార బృందాలను సిద్ధం చేశామన్నారు. జిల్లాలోని స్వచ్ఛంద సేవా సంస్థలు, రాజకీయ నాయకులు, యువజన, మహిళా సంఘాలు సహకారం అందించి పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పల్స్‌ పోలియో కార్యక్రమ పోస్టర్లను విడుదల చేశారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మాలతి, డీఐఓ అలివేలు, డిప్యూటీ డెమో సాంబశివారెడ్డి, వెంకటరమణ పాల్గొన్నారు. 

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top