వైకల్యం ఓడింది..ఆశయం గెలిచింది

Handicapped Teacher success story - Sakshi

తెలుగు ఉపాధ్యాయురాలిగా రాణిస్తున్న  దివ్యాంగురాలు వెంకటరమణ 

ఆమె చిన్నతనంలోనే పోలియో బారిన పడింది. నడిచేందుకు కాళ్లు సహకరించలే. చదివేందుకు ఇంటి ఆర్థిక పరిస్థితి అనుకూలించలే. పేదరికంలో పుట్టిన ఆడబిడ్డగా అష్టకష్టాలు పడింది. అయినా జంకలే. పట్టుదల, ఆత్మస్థైర్యంతో..ఉన్నత కోర్సులు పూర్తి చేసింది. కసితో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కొలువు కొట్టి ఆదర్శ బోధనతో తనలాంటి ఎందరికో స్ఫూర్తి నింపుతోంది.   

టేకులపల్లి:  మండలంలోని కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్న చింత వెంకటరమణ దివ్యాంగురాలు అయినప్పటికీ..ఎంతో ఆత్మవిశ్వాసంతో తన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. బహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం చింతగుంపు గ్రామానికి చెందిన చింత వెంకన్న, గురువమ్మ దంపతుల పెద్ద కుమార్తె ఈమె. పుట్టుకతోనే పోలియో సోకడంతో అంగవైకల్యం బారిన పడ్డారు. పేద కుటుంబం కావడంతో 1–10 తరగతి వరకు కురవిలో హాస్టల్‌లో ఉండి చదువుకున్నారు. బయ్యారం జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ సీఈసీ గ్రూపు చదివారు. డిగ్రీ మహబూబాబాద్‌లో పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువులకు నేరుగా కళాశాలలో చేరడం కష్టంగా భావించి..దూరవిద్య (ఓపెన్‌)లో ఎంఏ తెలుగు కోర్సు, అనంతరం 2008–09లో బీఈడీ పూర్తి చేశారు. 2013లో నిర్వహించిన ఏజెన్సీ డీఎస్సీలో స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికయ్యారు. టేకులపల్లి మండలం కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో అదే సంవత్సరం ఆగస్టులో విధుల్లో చేరి..ఇప్పటి వరకు విజయవంతంగా బోధిస్తున్నారు.

బోధనలోనూ ప్రత్యేకమే.. 
ఓ కర్ర సాయంతో నడుచుకుంటూ..తరగతి గదికి వస్తారు. తనకు కేటాయించిన క్లాసుల్లో ఎంతో శ్రద్ధగా బోధిస్తోంది. పుస్తక జ్ఞానమే కాకుండా..సమాజంలోని కొన్ని ఉదాహరణలు వివరిస్తూ, సామాజిక అంశాలను కూడా నేర్పుతున్నారు. మాతృభాష అయిన తెలుగులో విద్యార్థులు ఎవరూ వెనుకబడి ఉండకుండా ప్రోత్సహిస్తున్నారు. పద్యాలు అలవోకగా చెబుతూ..పిల్లల చేత సాధన చేయిస్తున్నారు. పాఠాలు విద్యార్థులకు అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా చెబుతూ విశేష ప్రతిభను చాటుతున్నారు. చేతి రాత కూడా అందంగా ఉండేలా మెళకువలను బోధిస్తూ తీర్చిదిద్దుతున్నారు. మొక్కవోని దీక్షతో, ధైర్యంగా ముందుకు సాగుతున్న వెంకటరమణ ఇటీవలె ఓ అనాథ అయిన సారయ్యను వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. వైకల్యం ఉందని దిగాలు చెందొద్దని, తమకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని..సాధన చేయాలని ఆమె సూచిస్తున్నారు.

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top