పరీక్షకు ప్రిపేరవుతున్న జుకర్‌బర్గ్‌

Zuckerberg Is Preparing To Attend In Front Of American Senate - Sakshi

సెనేట్‌ విచారణ కోసం కోచింగ్‌ .. ఎలా ‘ఫేస్‌‘ చేయాలి 

ఒక పరీక్షకు ముందు విద్యార్థి ఎలా ప్రిపేర్‌ అవుతాడు ? భవిష్యత్‌ను నిర్ణయించే ఎంట్రన్స్‌ టెస్ట్‌ రాసేముందు ఎంత ఒత్తిడికి లోనవుతాడు? ప్రస్తుతం ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ పరిస్థితి కూడా అలాంటి విద్యార్థిలాగే ఉంది. ఫేస్‌బుక్‌ డేటా లీకేజీ కేసుకు సంబంధించి జుకర్‌బర్గ్‌ ఈ నెల 10, 11 తేదీలలో అమెరికన్‌ సెనేట్‌ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది. అమెరికా కాంగ్రెస్‌లో రిపబ్లికన్లు, డెమొక్రాట్ల నుంచి చాలా క్లిష్టమైన ప్రశ్నలు ఎదురవుతాయన్న అంచనాల నేపథ్యంలో విచారణను ఎలా ఫేస్‌ చేయాలా అని జుకర్‌బర్గ్‌ తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. నిపుణుల నుంచి సూచనలు, సలహాలు.. గుచ్చి గుచ్చి అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలా అన్న సమాలోచనలు, ఒత్తిడి నుంచి బయటపడడానికి  కోచింగ్‌లు తీసుకుంటున్నారు. జుకర్‌బర్గ్‌కి సహజసిద్ధంగానే అద్భుతమైన వాదనాపటిమ ఉంది కానీ పదిమందిలో మాట్లాడాలంటే ఆయనకు ఏ మాత్రం ఇష్టం ఉండదు. అందుకే ఫేస్‌బుక్‌కి సంబంధించిన ఏ ప్రకటనలైనా ఆయనకు నమ్మకస్తులైన సహాయకులే చేస్తారు.

అయితే ఇప్పుడు అమెరికా ప్రజాప్రతినిధులు చేసే విచారణ అంతా మీడియాలో లైవ్‌ కవరేజ్‌ ఇవ్వనున్నారు. దీంతో జుకర్‌బర్గ్‌ పరిస్థితి పరీక్షని ఎదుర్కొనే విద్యార్థిలా ఉందని అమెరికా మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయట పడడానికి, ఒత్తిడిని అధిగమించడానికి జుకర్‌బర్గ్‌ గత కొద్ది రోజులుగా 500మందికి పైగా కమ్యూనికేషన్‌ నిపుణుల దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ దగ్గర ప్రత్యేక సహాయకుడిగా పనిచేసిన రెజినాల్డ్‌ జె బ్రౌన్‌ స్వయంగా జుకర్‌బర్గ్‌కి కొన్ని టిప్స్‌ చెబుతున్నారు. సెనేటర్లు అడిగే ప్రశ్నల్ని ఎలా ఎదుర్కోవాలో తన అనుభవాన్ని రంగరించి మరీ వివరిస్తున్నారు. ఫేస్‌బుక్‌ వినియోగదారుల డేటాను కేంబ్రిడ్జి ఎనలిటికా అనే సంస్థ లీక్‌ చేసి, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపునకు దోహదం చేయడంతో పాటు, భారత్‌ సహా వివిధ దేశాల్లో ఎన్నికల వ్యూహరచనకు డేటాను అందించిందన్న  ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. ఈ డేటా లీకేజీ నిజమేనని, తమ వైపు నుంచి తప్పు జరిగిదంటూ జుకర్‌బర్గ్‌ బహిరంగంగా క్షమాపణలు కోరారు. ఫేస్‌బుక్‌లో డేటా భద్రతకు సంబంధించి కొన్ని చర్యలు కూడా చేపట్టారు. అయితే ఫేస్‌బుక్‌ వినియోగదారుల్లో 8.7 కోట్ల మంది డేటా ఇప్పటికే లీక్‌ అయిందన్న వార్తలు ఆందోళనను పెంచుతున్నాయి. ఫేస్‌ బుక్‌లో తప్పుడు వార్తలు, ఫేక్‌ అకౌంట్లు కూడా ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో జుకర్‌బర్గ్‌ అమెరికా కాంగ్రెస్‌ ఎదుట విచారణకు హాజరుకానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

జుకర్‌బర్గ్‌ ఎదుర్కోబోయే ప్రశ్నలు ఇవే ?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫేస్‌బుక్‌ను వినియోగించుకోవడం ద్వారా రష్యన్‌ ట్రాల్స్‌ ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించి ఫేస్‌బుక్‌ స్పందన, వ్యవహారశైలి సరిగా లేదంటూ అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో వారి నుంచి జుకర్‌బర్గ్‌ను ఇరుకున పెట్టే ప్రశ్నలే ఎదురవుతాయనే ప్రచారం జరుగుతోంది. జుకర్‌బర్గ్‌ ఎదుర్కోబోయే ప్రశ్నావళి ఎలా ఉంటుందో రకరకాల అంచనాలున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. 
1.తమ డేటాకు రక్షణ ఉంటుందని వినియోగదారులు ఎందుకు ఫేస్‌బుక్‌ని నమ్మాలి ?
2.రష్యా చేతిలో ఎంతమంది ఫేస్‌బుక్‌ వినియోగదారుల డేటా ఉంది ?
3. ఫేస్‌బుక్‌పై కఠినమైన నియంత్రణ ఎందుకు విధించకూడదు ?
4.  వినియోగదారుల డేటా దుర్వినియోగం అవుతుందని తెలిసి కూడా ఫేస్‌బుక్‌ ఎందుకు సత్వర చర్యలు తీసుకోలేకపోయింది ?
5.2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఎన్ని రకాల తప్పుడు ట్రాల్స్‌ ఫేస్‌బుక్‌లో షేర్‌ అయ్యాయి ?
6. సంస్థ లాభాల కంటే ఫేస్‌బుక్‌ వినియోగదారుల ప్రయోజనాలే ∙ముఖ్యమని మీరు అంగీకరించగలరా?
7. ఫేస్‌బుక్‌తో జాగ్రత్తగా ఉండాలంటూ ఎందుకు వినియోగదారుల్ని గట్టిగా హెచ్చరించలేకపోయారు ?
8. ఫేక్‌ వార్తల్ని అరికడుతున్నామంటూ తీసుకుంటున్న చర్యలు సెన్సార్‌షిప్‌ను అడ్డుకోవడానికి సాకులేనా ? 
9. ఫేస్‌బుక్‌లాంటి అతి పెద్ద సంస్థని ఒక వ్యక్తి ఎలా నియంత్రించగలడు ?
(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top