రాళ్లు చేసిన మాయ.. ఆ నీరంతా ఏమైంది?

Where Did Water On Mars Disappear? Scientists May Have The Answer - Sakshi

పారిస్‌ : అంగారక గ్రహంపై ఉన్న సరస్సులు, సముద్రాల్లోని నీరంతా ఏమైంది?. గ్రహంపై మాగ్నటిక్‌ ఫీల్డ్‌ పడిపోవడంతో శక్తిమంతమైన సోలార్‌ విండ్స్‌ అంగారకునిపై నీటిని విశ్వంలో కలిపేశాయని గతంలో పలు అధ్యాయనాలు పేర్కొన్నాయి. అయితే, తాజా పరిశోధనలు ఆ అధ్యాయనాల్లో పేర్కొన్నట్లు అంగారకుడిపై నీరు విశ్వంలో కలసి మాయం కాలేదని చెబుతున్నాయి.

అంగారక గ్రహంపై నీరు మాయం కావడంపై పరిశోధకులు చెబుతున్న విషయాలను తెలుసుకుంటే విస్తుపోవాల్సిందే. బసాల్ట్‌ శిలలు అంగారక గ్రహంపై నీటిని పీల్చేసుకున్నాయని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. బసాల్ట్‌ శిలలకు నీటిని పీల్చుకుని తనలో ఇముడ్చుకోగల శక్తి ఉంటుంది. భూమితో పోల్చితే 25 శాతం ఎక్కువ నీటిని అంగారక గ్రహంపై గల బసాల్ట్‌ శిలలు గ్రహించగలవు. 

రసాయన చర్యలు, హైడ్రోథర్మల్‌ రియాక్షన్స్‌ ఫలితంగా భూమిపై ఉన్న రాళ్లలోని మినరల్స్‌లో మార్పులు వస్తాయని పరిశోధనలో పాలుపంచుకున్న వారిలో ఒకరైన జోన్‌ వేడ్‌ తెలిపారు. రాళ్లలోని మినరల్స్‌లో మార్పులు రావడం వల్ల అవి నీటిని గ్రహించే శక్తిని సొంతం చేసుకుంటాయని వివరించారు. అంగారక గ్రహంపై ఇలాంటి చర్యలే జరిగి నీటిని మొత్తాన్ని రాళ్లు పీల్చేసుకున్నాయని చెప్పారు. 

అంగారకుడిపై ఉన్న రాళ్లలోని నీరు కూడా మినరల్స్‌లో కలిసిపోయి ఉండొచ్చని అన్నారు. ఆ రాళ్లను కరిగించడం ద్వారా మాత్రమే నీటిని తిరిగి తీసుకురాగలుగుతామని చెప్పారు. భూమి పుట్టుకలో కూడా ఇలానే జరిగిందని వెల్లడించారు. అత్యంత వేడి పదార్ధాలు ఈ రాళ్ల గుండా ప్రవహించడం ద్వారానే భూమిపైకి నీరు చేరి సముద్రాలు, సరస్సులు, నదులు ఏర్పాడ్డాయని వివరించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top