ఏ కారణం చేతనో బలవన్మరణం పొందాలనుకున్న యువతిని ఓ యువకుడు రక్షించాడు.
బీజింగ్: ఏ కారణం చేతనో బలవన్మరణం పొందాలనుకున్న యువతిని ఓ యువకుడు రక్షించాడు. ప్లాట్ ఫాం మీదకు వచ్చే రైలు ముందు దూకబోయిన ఆమెను గమనించి ప్రాణాలు పణంగా పెట్టి కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చైనాలోని ఓ రైల్వే స్టేషన్లో రైలు కోసం ప్రయాణీకులు ఎదురుచూస్తున్నారు. కొద్ది సేపటికి రైలు ప్లాట్ ఫాం మీదకు వస్తూ కనిపించింది. ప్రయాణీకులతో పాటు నిల్చున్న యువతి ఒక్కసారిగా వచ్చే రైలు ముందు పట్టాలపై దూకాలని ప్రయత్నించింది. ఈ లోగా యువతి వెనుకే ఉన్న ఓ యువకుడు అప్రమత్తమై యువతి చేయి పట్టుకుని వెనక్కిలాగాడు.
యువకుడి చేతిని విడిపించుకుని రైలు కింద పడేందుకు ఆమె చేసిన ప్రయత్నం సఫలం కాలేదు. యువతిని కాపాడే క్రమంలో వెనక్కు పడిన యువకుడి తల నేలకు తగిలి గాయమైంది. వెంటనే స్పందించిన తోటి ప్రయాణీకులు అతనికి సాయం చేశారు. ఈ ఘటన రైల్వేస్టేషన్లోని సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. సాహసం చేసి యువతి ప్రాణాలు కాపాడిన ఆ యువకుడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.