
అమెరికా, రష్యా అధినేతలు డోనాల్డ్ ట్రంప్, పుతిన్ (ఫైల్ ఫొటో)
మాస్కో: అమెరికాకు వెళ్లే యోచనలో ఉన్న రష్యా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ ఆ దేశ విదేశాంగ శాఖ హెచ్చరించింది. అమెరికా నిఘా విభాగాలు ఇతర దేశాల నుంచి వలస వచ్చే వారిపై నిఘా ఉంచిందని, ముఖ్యంగా రష్యా వాసులపైనే ప్రధానంగా వారి వేట మొదలైందని పేర్కొంది. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ అధికారులు ఓ ప్రటకన విడుదల చేశారు. అమెరికాకు వలసవచ్చిన వారిని ఏవో కారణాలు చూపించి వారి అధికారులు అరెస్ట్ చేసి భయబ్రాంతులకు లోను చేస్తున్నారని రష్యా అభిప్రాయపడింది. మూడో ప్రపంచ దేశాల్లో సైతం అమెరికా విజ్ఞప్తి మేరకు అమాయకులను అదుపులోకి తీసుకుని విచారణ పేరుతో హింసించే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు.
'ఓ వైపు అమెరికాతో రష్యా సత్సంబంధాలు మెరుగు పరుచుకుంటుండగా మరోవైపు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు రష్యన్లపై వేట కొనసాగిస్తున్నారు. అందుకే విదేశీ యాత్రలు, పర్యటనలు, ఉపాధి కోసం వలస వెళ్లే రష్యా వాసులు ఆచితూచి వ్యవహరించాలి. గతేడాది నుంచి విదేశాల్లో 10 మందికి పైగా అరెస్ట్ చేశారు. గతంలో ఆయుధాల వ్యాపారి అంటూ విక్టోర్ బౌట్ అనే వ్యక్తిని థాయ్‌లాండ్‌లో అరెస్ట్ చేయగా అమెరికాకు తరలించారు. రష్యా వ్యాపారి అనే కారణంగా అతడిని అరెస్ట్ చేసి విచారణ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ' రష్యా విదేశాంగశాఖ పలు విషయాలను వెల్లడించింది.
రష్యాకు వెళ్లే తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ అమెరికా ట్రావెల్ అడ్వైజరీ డిపార్ట్‌మెంట్ ఈ ఏడాది జనవరి 10న హెచ్చరించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదం లాంటి సమస్యల్లో చిక్కుకుని ఆపదలు కొని తెచ్చుకుంటారని, ఇతరత్రా వేధింపులకు గురయ్యే అవకాశాలు రష్యాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొనడం రష్యాను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో తమ పౌరులు విదేశాల్లో, ముఖ్యంగా అమెరికాలు జాగ్రత్తగా ఉండాలని రష్యా విదేశాంగశాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.