అమెరికా దాడులు.. 84మంది మృతి!

US air strikes in Syria killed over 80 Syrian civilians - Sakshi

బీరుట్‌(లెబనాన్‌): సిరియా నగరం రఖాపై అమెరికా ఆధ్వర్యంలోని బలగాలు జరిపిన వైమానిక దాడుల్లో 84 మంది చనిపోయారని హ్యూమన్‌రైట్స్‌ వాచ్‌ సంస్థ పేర్కొంది. ఐఎస్‌ మిలిటెంట్లు పాగా వేసిన ఈ నగరంపై గత మార్చిలో అమెరికా దళాలు విచక్షణారహితంగా బాంబులు జారవిడిచాయని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడుల్లో అమాయక పౌరులు, డజన్ల సంఖ్యలో చిన్నారులు అసువులు బాశారని పేర్కొంది.

పౌరులు ఆశ్రయం పొందుతున్న మన్సూరాలోని ఓ స్కూల్‌తోపాటు తబ్కా పట్టణంలోని ప్రజలు బారులు తీరి ఉన్న ఓ బేకరీ, జనసమ్మర్దంతో ఉన్న మార్కెట్‌పైనా అమెరికా బలగాలు దాడి చేయగా పెద్ద సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఆయా ప్రాంతాల్లో పౌరులు మాత్రమే ఉన్న విషయం సంకీర్ణ దళాలకు తెలియనిపక్షంలో నిఘా వర్గాల సమాచారం తీసుకుని ఉండాల్సిందని, అదేమీ లేకుండా దాడులకు దిగటం సరికాదని వివరించింది.

 మార్చి 20వ తేదీన మన్సూరాలోని పాఠశాలపై జరిపిన దాడిలో 16 మంది చిన్నారులతోపాటు 40మంది ప్రాణాలు కోల్పోయారని, మార్చి 22వ తేదీన తబ్కా మార్కెట్‌, బేకరీలపై జరిపిన దాడిలో 14 మంది బాలలు సహా 44 మంది మృతి చెందారని తెలిపింది. అయితే, ఆ ప్రాంతంలో పనిచేస్తున్న వివిధ స్వచ్చంద సంస్థలు మాత్రం మృతుల సంఖ్య ఇంకా చాలా ఎక్కువగానే ఉందని చెబుతున్నాయి. బాంబు దాడులు జరిపిన ప్రాంతాల్లో అమెరికా సంకీర్ణ దళాల ప్రతినిధులు సర్వే చేస్తే అసలు నిజాలు వారికి తెలుస్తాయని అంటున్నాయి. 2011 నుంచి సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా 3.30లక్షల మంది చనిపోయారని అంచనా.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top