
ఇస్లామాబాద్/లాహోర్: పుల్వామా ఘటనకు ప్రతీకారంగా మంగళవారం ఐఏఎఫ్ జరిపిన దాడులతో భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. బుధవారం ఉదయం తమ గగనతలంలోకి చొచ్చుకువచ్చిన భారత వైమానిక దళానికి చెందిన రెండు ఐఏఎఫ్ యుద్ద విమానాలను కూల్చివేసి, ఇద్దరు పైలట్లను అరెస్టు చేసినట్లు ప్రకటించుకున్న పాక్.. ఆ తర్వాత మాటమార్చి, ఒక్కరినే పట్టుకున్నట్లు తెలిపింది. ఉద్రిక్తతల నేపథ్యంలో తమ గగనతలాన్ని మూసివేసినట్లు ప్రకటించింది.
పాక్ సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ ఘఫూర్ బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ..‘పాక్ వైమానిక దళం(పీఏఎఫ్) జెట్ విమానాలు పాక్ గగనతలంలో నుంచే ఎల్‌వోసీ ఆవల భారత్ లోని భింబేర్ గల్లీ, నరన్ ప్రాంతంలో ఉన్న ఆరు లక్ష్యాలను కచ్చితంగా ఛేదించాయి. అవన్నీ సైనిక పోస్టులు, ఆయుధ డిపోలకు సమీపంగా ఉన్నవే. దాడులు చేయ గలిగిన సత్తా మాక్కూడా ఉందని నిరూపించుకు నేందుకు ఇలా చేసి చూపాం. ఆ తర్వాత ఐఏఎఫ్ విమానాలు మా భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిం చగా వాటిని కూల్చేశాం’అని తెలిపారు. ‘రెండు ఐఏఎఫ్ విమానాల్లో ఒకటి జమ్మూ కశ్మీర్‌లోనూ మరొకటి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోను కూలి పోయాయి. వాటిలో ఉన్న ఇద్దరు పైలట్లను అరెస్టు చేశాం. గాయపడిన ఒకరిని ఆస్పత్రికి తరలించాం.
మరొకరు సురక్షితంగా ఉన్నారు’ అని తెలిపారు. ఆ పైలట్ల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు, పత్రాలను ఘఫూర్ మీడియాకు చూపారు. ఈ సందర్భంగా ఆయన 46 సెకన్ల నిడివి ఉన్న వీడి యోను విడుదల చేశారు. కళ్లకు గంతలు కట్టి ఉన్న ఒక వ్యక్తి ‘నేను ఐఏఎఫ్ అధికారిని. నా సర్వీస్ నంబర్ 27981’ అని చెబుతున్నట్లుగా అందులో ఉంది. ఆయనే ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ అని ఘఫూర్ అన్నారు. ఆ తర్వాత మేజర్ జనరల్ ఆసిఫ్ ఘఫూర్ మరో ప్రకటన విడుదల చేశారు. తమ సైన్యం అదుపులో ఉన్నది ఇద్దరు పైలట్లు కాదు.. వింగ్ కమాండర్ అభినందన్ ఒక్కరే అని పేర్కొన్నారు. పీవోకేలో ఆయనపై కొందరు దాడి చేయగా సైన్యం రక్షిం చిందని తెలిపారు. సైనిక నిబంధనావళి ప్రకారం అభినందన్‌తో వ్యవహరిస్తామని వివరించారు.
రెడ్ అలర్ట్ ప్రకటించిన పాక్
తాజా పరిణామాలతో పాక్ దేశంలో రెడ్‌అలర్ట్ ప్రకటించింది. గగనతలాన్ని మూసివేసి, వాణిజ్య విమానాలను రద్దు చేసింది. ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ ఎయిర్‌పోర్టుల్లో విమానాల రాకపోకలను నిలిపివేసింది. తిరిగి ప్రకటించే వరకు వీటిని సైనిక అవసరాలకు మాత్రమే వాడుకుంటామని అధికారులు తెలిపినట్లు డాన్ న్యూస్ టీవీ తెలిపింది.