విమానంలో ప్రత్యేక అతిథి.. సర్‌ప్రైజ్‌ ఇచ్చిన పైలెట్‌ | Turkish Airlines Pilot Thanks His School Teacher Who Was On Board The Flight | Sakshi
Sakshi News home page

Nov 29 2018 8:53 PM | Updated on Nov 29 2018 8:56 PM

Turkish Airlines Pilot Thanks His School Teacher Who Was On Board The Flight - Sakshi

విమానంలో ఎడమ వైపు నల్లకోటు వేసుకున్న వ్యక్తి

జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే.. ఆ జన్మకు సార్ధకత లభించేలా చేసేది గురువులు. ఉపాధ్యాయుల గొప్పదనం తెలిపే ఓ సూక్తి ఇలా చెప్తుంది.. ‘నా ముందు దైవం, గురువు ఇద్దరూ నిలబడితే.. నేను ముందుగా గురువుకు నమస్కారం చేస్తాను. ఎందుకంటే ఈ రోజు నాకు భగవంతుని దర్శనం లభించిందంటే అందుకు కారణం గురువు’ అని ఉంటుంది. అది ఉపాధ్యాయులకు మనం ఇవ్వాల్సిన గౌరవం. తాము విద్యాబుద్ధులు నేర్పిన వారు నేడు ప్రయోజకులై తమ కళ్లముందుకు వస్తే వారికి కలిగే సంతోషం మాటల్లో వర్ణించలేము. ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది ఓ ఉపాధ్యాయునికి. తన విద్యార్థి ఇచ్చిన సర్‌ఫ్రైజ్‌.. ఆ టీచర్‌నే కాక ఇతర ప్రయాణికుల చేత కూడా కంటతడి పెట్టించింది.

వివరాలు..టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌లో ఓ వృద్ధుడు ప్రయాణిస్తున్నారు. విశేషం ఏంటంటే చిన్నప్పుడు అతని వద్ద చదువుకున్న విద్యార్థే ఆ ఎయిర్‌లైన్స్‌కు పైలట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో తనకు చదువు చెప్పిన టీచర్‌, నేడు తాను నడుపుతున్న విమానంలోనే ప్రయాణిస్తుండటంతో ఆ పైలెట్‌ తెగ సంతోషపడ్డాడు. తన టీచర్‌కి జీవితాంతం గుర్తుడిపోయేలా ఏదైనా సర్‌ఫ్రైజ్‌ ఇవ్వాలనుకున్నాడు. వెంటనే.. ‘విమానంలో ఎడమ వైపు నల్లకోటు వేసుకున్న వ్యక్తి నా స్కూల్‌ టీచర్‌. ఒకప్పుడు నాకు చదువు చెప్పిన టీచర్‌ ఈరోజు నేను నడిపే విమానంలో ప్రయాణిస్తున్నారని తెలిసి చాలా సంతోషించాను. ఈ సందర్భంగా ఆయనకు గుర్తుండిపోయేలా ఏదన్నా చిన్న సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకుంటున్నాను. ఆయనకు పువ్వులు ఇచ్చి విష్‌ చేయాల్సిందిగా సిబ్బందిని కోరుతున్నాను’ అంటూ ఉద్వేగానికి లోనవుతూ ప్రకటన చేశాడు.

ఈ ప్రకటన విన్న ఆ టీచర్‌కి కన్నీళ్లాగలేదు. ఈ లోపు పైలట్‌ చెప్పినట్లుగానే విమానంలోని ఇతర సిబ్బంది ఫ్లవర్‌ బోకేలు ఇచ్చి సదరు టీచర్‌ని  విష్‌ చేశారు. ఆ తర్వాత తన టీచర్‌ను కలవడానికి క్యాబిన్‌ నుంచి పైలట్‌ కూడా వచ్చాడు. టీచర్‌ని ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. సదరు పైలట్‌ చేసిన పనికి తోటి ప్రయాణికులకు కూడా కన్నీరాగలేదు. చప్పట్లు కొడుతూ పైలట్‌ను అభినందించారు. విమానంలోని కొందరు ప్రయాణికులు ఈ దృశ్యాన్ని వీడియో తీశారు. అయితే ఇదే సమయంలో విమానంలో టర్కీకి చెందిన ఇష్టిషమ్‌ ఉల్‌హక్‌ అనే విలేకరి కూడా ఉన్నారు.

ఈ వీడియోను ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ..‘ తనకు చదువు చెప్పిన టీచర్‌ తను నడుపుతున్న విమానంలో ఉన్నారని తెలిసి ఈ పైలట్‌ ఈ రకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ దృశ్యం నన్నెంతో కదిలించింది. మన జీవితాలకు వెలుగునిచ్చిన ఉపాధ్యాయులకు మనం ఇచ్చే మర్యాద ఇది..’ అని పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో చాలా వైరల్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement