అక్రమ వలసదార్ల అరెస్టులు షురూ | Trump says ICE raids to start Sunday | Sakshi
Sakshi News home page

అక్రమ వలసదార్ల అరెస్టులు షురూ

Jul 14 2019 5:05 AM | Updated on Jul 14 2019 5:35 AM

Trump says ICE raids to start Sunday - Sakshi

వాషింగ్టన్‌: దేశంలో వలసదార్లను పెద్ద సంఖ్యలో ఏరివేసేందుకు, వారిని దేశ బహిష్కారం చేసేందుకు అమెరికా సర్వసన్నద్ధమైంది. అక్రమ వలసదార్లను ఆదివారం నుంచి అరెస్టు చేయనున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. లక్షలాది అక్రమ వలసదార్లను అరెస్టు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. తగిన ఉత్తర్వులతో వారిని దేశ బహిష్కారం చేయనున్నట్టు ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ యాక్టింగ్‌ డైరెక్టర్‌ మాథ్యూ అల్‌బెన్స్‌ తెలిపారు.

అరెస్టులు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాబోవని, కేసుల దర్యాప్తును అనుసరించి అధికారులు ఎక్కడికంటే అక్కడికి పోతారని ఆయన చెప్పారు. అరెస్టు చేసిన వారిని వారి వారి దేశాలకు పంపుతామని, నేరాలకు పాల్పడిన వారిని ఇక్కడ లేదా వారి దేశాల్లోని జైళ్లకు పంపుతామని ట్రంప్‌ ప్రకటించారు. అధికారులు అందిస్తున్న వివరాల ప్రకారం – 2000 మందిని లక్ష్యంగా చేసుకుని సోదాలు నిర్వహించనున్నారు. గతంలో జరిగిన దాడులను బట్టి ఇప్పుడు కనీసం 200 మందిని అరెస్టు చేయవచ్చునని భావిస్తున్నారు.

ట్రంప్‌ సర్కారు నిర్ణయాలు అగ్రరాజ్యంలో తీవ్ర రాజకీయ చర్చకు దారితీశాయి. ప్రభుత్వ చర్యలు అమానవీయమైనవంటూ డెమోక్రాట్లు విమర్శలు చేస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. మధ్య అమెరికా నుంచి ఇంతకు ముందెన్నడూ లేనంత మంది ప్రజలు ఇటీవల యూఎస్‌ సరిహద్దులకు చేరుకున్న విషయం తెలిసిందే. వీరిలో పలువురు ఇమ్మిగ్రేషన్‌ కోర్టు కేసులను ఎదుర్కొంటున్నారు. 2016లో బరాక్‌ ఒబామా హయాంలోను, 2017లో ట్రంప్‌ హయాంలోను అక్రమ వలసదార్లపై ఇదే తరహా ఆపరేషన్‌ నిర్వహించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement