అక్కడికి పోతే అంతే సంగతులు!

Tourists Warned Over Visiting Asbestos Riddled Wittenoom - Sakshi

న్యూఢిల్లీ : ప్రాణాపాయ స్థితిలో తన లేదా ఇతరుల ప్రాణాలను రక్షించడం కోసం ప్రాణాలకు తెగించిన వారిని ఎవరైనా హర్షిస్తారు. అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకునే వారిని ఎవరు హర్షించరు. అయినప్పటికీ కొందరికి ప్రాణాలతో చెలగాటమాడడం అంటే ఎంతో ఇష్టం. అలాంటి వారు పశ్చిమ ఆస్ట్రేలియాలోని విట్టెనూమ్‌ ప్రాంతానికి క్యూ కడుతున్నారు. అక్కడ దెయ్యాలు లేవు, భూతాలు లేవుగానీ విషపూరితమైన వాయువులున్నాయి. అక్కడ వీచే ఆస్బెస్టాస్‌ (కంటికి కనిపించని ఆరు సహజ సిద్ధమైన ఖనిజాల మిశ్రమం) వాయువులను పీల్చినట్లయితే పక్క వారిని హెచ్చరించేలోగానే ప్రాణాలు గాలిలో కలసి పోతాయి. ప్రాణాపాయం తప్పితే ఊపిరి తిత్తుల క్యాన్సర్, శ్వాసకోస సంబంధిత వ్యాధులు వస్తాయి.

పోర్ట్‌ హెడ్‌లాండ్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఈ విషవాయువుల ప్రాంతం ఉంది. అక్కడ 1966లో ఆస్బెస్టాస్‌ గనుల  తవ్వకాలను నిలిపివేశారు. గాలిలోకి లీకైన ఆస్బెస్టాస్‌ వాయువుల వల్ల కార్మికుల ప్రాణాలకు ముప్పు వాటిళ్లడంతో 30 లక్షల టన్నుల ఆస్బెస్టాస్‌ నిల్వలు ఉన్నప్పటికీ గనులను మూసివేశారు. సమీపంలోని ఊరును కూడా ఖాళీ చేయించారు. ఎన్నో హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేశారు. పాడు పడిన ఇళ్లూ, దుకాణాలు, కేఫ్‌లు శిథిలావస్థలో ఉన్నాయి. పర్యాటకులు వాటి వద్దకే కాకుండా హెచ్చరిక బోర్డుల వద్దకు వెళ్లి కూడా ఫొటోలు దిగుతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సమీపంలోని విషతుల్యమైన చిన్న సరస్సులో ఈతలు కూడా కొడుతున్నారు.

పర్యాటకులను ఆ ప్రాంతానికి వెళ్లకుండా నిరోధించడంలో భాగంగా ఆ ప్రాంతానికి పూర్తిగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. ఆ ప్రాంతాన్ని జనావాస ప్రాంతాల నుంచే కాకుండా అలాంటి ప్రమాదకరమైన ప్రాంతం అన్నది ఒకటుందనే విషయం కూడా ప్రజలకు తెలియకూడదనే ఉద్దేశంతో అన్ని రకాల మ్యాప్‌ల నుంచి తొలగించారు. అయినప్పటికీ పర్యాటకుల తాకిడి పెరిగింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ లాంటి సోషల్‌ మీడియా విస్తరించడమే కారణం. మిత్రులే కాకుండా, కుటుంబాలు కూడా అక్కడికి వెళుతున్నాయి. టెంటులు వేసుకొని కూడా గడుపుతున్నారు.

‘మా హెచ్చరికలను ఆషామాషీగా తీసుకోవద్దు. ఇప్పటికీ అక్కడ ప్రాణాలను హరించే వాయువులు ఉన్నాయి. ఇప్పట్లో అక్కడ పరిస్థితులు మెరగయ్యే అవకాశం కూడా లేదు. దయచేసి అక్కడికి వెళ్లకండి’ అంటూ ‘అబార్జినల్‌ అఫేర్స్‌ అండ్‌ ల్యాండ్స్‌’ మంత్రి బెన్‌ వ్యాన్‌ తాజాగా ఓ హెచ్చరిక జారీ చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top