బ్రెగ్జిట్‌పై నూతన విధానం

Theresa May Propose New Deal On Brexit - Sakshi

లండన్‌: యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) నుంచి బ్రిటన్‌ వైదొలగే విషయమై ప్రధాని థెరెసా మే మంగళవారం పార్లమెంటులో నూతన బ్రెగ్జిట్‌ విధానాన్ని ప్రతిపాదించారు. దీనిపై అవసరమైతే రెండోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరిపించాలన్న అంశాన్నీ పొందుపరిచారు. ప్రతిపక్షాలు కోరుతున్న డిమాండ్లకు చోటు కల్పించారు. బిల్లులో కార్మికులు, దేశ రక్షణ, పర్యావరణం, వలసలకు సంబంధించి మరికొన్ని ప్రతిపాదనలు చేశారు. ఈయూ నుంచి వైదొలగాలన్న తమ నిర్ణయానికి చివరి అవకాశం ఇవ్వాలని బ్రిటన్‌ ఎంపీలను థెరిసా కోరారు. ప్రజల నిర్ణయం కొరకు అవసరమైతే మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపడదామని, దీనికి సంబందించిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈయూ నుంచి బయటకు రావాలంటూ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లు పలుమార్లు వీగిపోయిన విషయం తెలిసిందే. ఆమె సొంత పార్టీ సభ్యులే ఓటింగ్‌లో ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేశారు. కాగా బ్రెగ్జిట్‌ గడువు ఏప్రిల్‌ 12తో ముగియనున్న నేపథ్యంలో మరో 6 నెలలు అంటే అక్టోబర్‌ 31 వరకూ పొడిగిస్తున్నట్లు ఈయూ తెలిపింది.మరోవైపు ఈయూతో ఒక అంగీకారానికి రాలేని పరిస్థితుల నేపథ్యంలో బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే రాజీనామాకు ఆమె కేబినెట్‌ సహచరులే ఒత్తిడి తెస్తున్నారు. మే ప్రభుత్వ బ్రెగ్జిట్‌ ప్రతిపాదనలపై పార్లమెంట్‌లో మరోసారి ఓటింగ్‌కు రానున్న నేపథ్యంలో కొందరు మంత్రులు, ఎంపీలు పదవి నుంచి వైదొలగాలంటూ ఆమెను హెచ్చరించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా 2016లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఈయూ నుంచి వైదొలగాలన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top