నిలువుతో సులువు!

A super vertical airport - Sakshi

నిన్న..
చాన్నాళ్ల క్రితం సుదూర ప్రయాణం అంటే రోజుల తరబడి సాగేది. రకరకాల ప్రయాణ సాధనాలను దాటి.. రైలు వచ్చినా.. ఒక దేశం నుంచి మరొక దేశం పోవాలంటే.. వారాలు పట్టాల్సిందే..

నేడు.. 
విమానం వచ్చాక ఈ ప్రపంచం చాలా చిన్నదైపోయింది.. గంటల వ్యవధిలో ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లిపోతున్నాం.. విమానం వచ్చి.. ఈ భూప్రపంచాన్ని చిన్నదిగా చేస్తే.. విమానాశ్రయాలు వచ్చి అదే భూప్రపంచంలోని చాలా భూమిని తమ వసతుల కోసం వినియోగించుకుంటున్నాయి. టెర్మినళ్లు, రన్‌వేలు, టాక్సీవేలు ఇలా ఎయిర్‌పోర్టు అంటే..  వేల ఎకరాల స్థలం సమర్పించాల్సిందే.

మరి రేపు..
వీటన్నిటికీ పరిష్కారం ఈ నిట్టనిలువు ఎయిర్‌పోర్టు అట.. ఇలాంటిది మనమెప్పుడైనా చూశామా.. తక్కువ భూమి వినియోగంతో అన్ని సదుపాయాలున్న విమానాశ్రయం.. దీని వల్ల మిగిలి ఉన్న భూమిని వ్యవసాయ, వాణిజ్య, పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు వినియోగించుకోవచ్చు. నిట్టనిలువుగా అన్నది ఎయిర్‌పోర్టులకే కాదు.. విమానాలకూ వర్తిస్తుంది.. ఇప్పటికే ఆ టైపువి కొన్ని వచ్చాయి కూడా.. అంటే.. నిట్టనిలువుగా ల్యాండింగ్‌.. టేకాఫ్‌ అన్నమాట. దీని వల్ల భారీ రన్‌వేలు అవసరముండదు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టులను చూస్తే.. అంతా వాణిజ్య సముదాయాలే కనిపిస్తాయి. అయితే.. ఈ ఎయిర్‌పోర్టులో విభిన్నమైన అంశాలకు, పర్యావరణ అనుకూల విధానాలకు ప్రాధాన్యమిచ్చారు.

ఇక్కడే కొన్ని అంతస్తుల్లో పంటలు పండిస్తారు.. వాటిని అమ్మేందుకు కూడా మార్కెట్లు ఇక్కడే ఉంటాయి. మాల్స్, అగ్రికల్చర్‌ కాలేజీలు, చేపల పెంపకం, నిర్లవణీకరణ ప్లాంట్లు వంటివి కూడా ఏర్పాటు చేస్తారు. అంతేనా.. ముందున చెరువులా కనిపిస్తుంది చూశారు.. చుట్టుపక్కల ఉండే నీటి వనరులు అంటే కాలువలు కావచ్చు లేదా చెరువుల ద్వారా కావచ్చు.. వాటి నుంచి నీటిని ఇక్కడికి తరలిస్తారు.. ఈ నీటిని చేపల పెంపకంతోపాటు పంటల కోసం వినియోగిస్తారు.. దీంతోపాటు ఈ నీటిని శుద్ధి చేసి.. చుట్టుపక్కల ఉండే నివాస ప్రాంతాలకు తాగు నీటిని సరఫరా చేస్తారు. ఇక నగరంలోని రైలు వ్యవస్థను విమానాశ్రయానికి అనుసంధానం చేస్తారు. ప్రయాణికులు రైళ్ల ద్వారా ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. వాళ్ల లగేజీ వంటివి ఆటోమేటిక్‌గా వారు ప్రయాణిస్తున్న విమానాల్లోకి వెళ్లే వ్యవస్థ ఉంటుంది. టికెట్లు కొనుగోలు చేయడానికి చిన్నపాటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఉంటాయి.

తనిఖీల సమయాన్ని తగ్గించేందుకు ఆటోమేటిక్‌ స్క్రీనింగ్‌ వ్యవస్థ ఉంటుంది. విమానాలు ఇప్పటికంటే కాస్త చిన్నవిగా.. పర్యావరణ అనుకూల పునర్వినియోగ ఇంధనాన్ని వినియోగించేవిగా ఉంటాయి. ఈ ఎయిర్‌పోర్టులతో స్థల సమస్య తీరుతుందని.. పర్యావరణ అనుకూలమైనది కూడా కావడం వల్ల కాలుష్య ఉద్గారాలు తక్కువగా ఉంటాయని ఈ వర్టికల్‌ ఎయిర్‌పోర్టు డిజైనర్‌ జొనాథన్‌(అమెరికా) చెబుతున్నారు. కొత్త ఆలోచనలను, విప్లవాత్మకమైన, వినూత్నమైన డిజైన్లను ప్రోత్సహిస్తూ ‘ఇవాలో’ ఆర్కిటెక్చర్‌ మేగజైన్‌ ఏటా ఆకాశహర్మ్యాల పోటీని నిర్వహిస్తోంది. 2018కి సంబంధించిన పోటీలో ఈ డిజైన్‌ జ్యూరీ దృష్టిని ఆకర్షించింది. దీనికి జ్యూరీ ప్రత్యేక ప్రశంసా పురస్కారం దక్కింది.  
..:  సాక్షి, తెలంగాణ డెస్క్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top