కారు నిండా బాంబులతో వచ్చి ఓ ఉగ్రవాది పోలీస్ చెక్ పాయింట్ ఢీకొన్నాడు. అనంతరం కారులోని బాంబులతో సహా తనను తాను పేల్చుకున్నాడు.
బాగ్దాద్: కారు నిండా బాంబులతో వచ్చి ఓ ఉగ్రవాది పోలీస్ చెక్ పాయింట్ ఢీకొన్నాడు. అనంతరం కారులోని బాంబులతో సహా తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే, తొలుత ఈ దాడులకు ఎవరు పాల్పడ్డారనే విషయంపై స్పష్టత రానప్పటికీ దాడి జరిగిన కొద్ది సేపటి తర్వాత తామే చేశామంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. బాగ్దాద్ పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో ఖాలిస్ అనే పట్టణం ఉంది.
ఒకప్పుడు ఈ పట్టణంపై ఐసిస్ పట్టు ఉండేది. అయితే, రెండేళ్ల కిందట అమెరికా సేనలు, ఇరాక్ సేనలు కలిసి వారి చెర నుంచి ఈ నగరాన్ని విడిపించాయి. అప్పటి నుంచి తిరిగి తమ ప్రాబల్యం కోసం ఐసిస్ ఇక్కడ దాడులు చేస్తూనే ఉంది. షియా జనాభా ఎక్కువగా ఉండే ఈ ఖాలిస్ నగరం ముఖ ద్వారం వద్ద ఉన్న బలగాల తనిఖీ పాయింట్ పైకి నేరుగా ఓ ఆత్మాహుతి దాడి సభ్యుడు బాంబులతో వచ్చి దాడి చేసి తనను తాను పేల్చుకున్నాడు. ఆ ప్రాంతం రద్దీది కావడంతో మృతుల సంఖ్య డజను దాటింది. చనిపోయినవారిలో పది మంది పోలీసులు, ఆరుగురు సామాన్యులు ఉన్నారు. 41మంది గాయపడ్డారని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు.