ఇక సోలార్‌ గృహోపకరణాలు

ఇక సోలార్‌ గృహోపకరణాలు - Sakshi


ఈ రోజుల్లో సౌరశక్తికి ఇస్తున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. వీలైనంత చౌకగా... పర్యావరణానికి నష్టం కలిగించకుండా వేర్వేరు మార్గాల ద్వారా సూర్యుడి వెలుతురును విద్యుత్తుగా మార్చుకుని వాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూరోపియన్‌ దేశాల్లో కొన్నిచోట్ల రోడ్లపై సోలార్‌ ప్యానెళ్లు పరిచేస్తే.. తాజాగా భారత్‌లో రైళ్లపై కూడా వీటిని వాడేస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. పక్క ఫొటోల్లో  కనిపిస్తున్న అందమైన ఫర్నిచర్‌కు, సోలార్‌ ఎనర్జీకి సంబంధం ఉంది కాబట్టి. హంగెరీ రాజధాని బుడపెస్ట్‌లో అక్కడక్కడా ఇలాంటి ఫర్నిచర్‌ను ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల కూర్చునేందుకు వీలుంటే.. ఇంకొన్నిచోట్ల కాళ్లు బారజాపుకుని కాసేపు సేదదీరే అవకాశమూ ఉంది.



ఇంకొన్నిచోట్ల పది, ఇరవైమంది కూర్చుని కబుర్లు చెప్పుకునేందుకు లేదంటే చిన్నసైజు ప్రదర్శనలు ఏర్పాటు చేసుకునేందుకు సౌకర్యాలున్నాయి. ఈ ఏర్పాట్లలో పెద్ద విశేషమేమీ లేదుగానీ.. ప్రతి ఫర్నిచర్‌లోనూ కొంత భాగం సోలార్‌ప్యానెళ్లతో నిండి ఉండటం మాత్రం చెప్పుకోదగ్గ విషయమే కదా.. ప్లాటియో అనే స్టార్టప్‌ కంపెనీ ఐడియా నుంచి పుట్టుకొచ్చాయి ఈ సోలార్‌ ఫర్నిచర్లు. ఫుట్‌పాత్‌ల టైల్స్‌లా వాడగల రీతిలో వీరు సోలార్‌ ప్యానెల్స్‌ను తయారు చేశారు. వాటిని బల్లలు, సోఫాల్లాంటి ఫర్నిచర్‌లో భాగంగా మార్చారు. సోలార్‌ ప్యానెల్స్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును నిల్వ చేసుకునేందుకు వీటిల్లోనే బ్యాటరీలూ ఉన్నాయి. అలాగే.. ఫర్నిచర్‌లో ఒకవైపున ఉండే చార్జింగ్‌ పాయింట్‌తో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను చార్జ్‌ చేసుకోవచ్చు. దాదాపు 80 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే సోలార్‌ ప్యానెల్స్‌ ద్వారా 11.7 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చునని.. 11 యూఎస్‌బీ పోర్ట్‌ల ద్వారా ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను ఛార్జ్‌ చేసుకోవచ్చునని కంపెనీ అంటోంది. హంగెరీతోపాటు ఇటీవలే ఈ సంస్థ కజకిస్తాన్‌లోని ఆస్తానాలోనూ ఈ సోలార్‌ ఫర్నిచర్‌ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి , విశాఖపట్నాల్లోనూ ఎండలు బాగానే ఉంటాయి కదా.. అక్కడా ఇలాంటివి ఉంటే ఎంత బాగుండునో!

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top